IPL-2025 UPdate: ఐపీఎల్ డేట్ వచ్చేసిందోచ్ - 2 నెలల పాటు ధనాధన్ ఆట, నిర్వహణ తేదీలు ప్రకటించిన బీసీసీఐ
IPL 2025: ఐపీఎల్ 18వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. మార్చి 23 నుంచి ఈ మెగాటోర్నీని నిర్వహించనున్నారు. వచ్చే నెలలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత ఆటగాళ్లు మళ్లీ ఈ టోర్నీలోనే బరిలోకి దిగుతారు.

IPL 2025 News: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఐపీఎల్ 2025 నిర్వహణకు ముహుర్తం ఖరారైంది. మార్చి 23 నుంచి ఈ మెగా టోర్నీ జరుగుతంది. రెండు నెలలకు పైగా సాగే ఈ టోర్నీ మే 25న ముగుస్తుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. ఆదివారం నిర్వహించిన బీసీసీఐ ప్రత్యేక వార్షిక సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. బీసీసీఐ కార్యదర్శిగా దేవజిత్ సైకియా, కోశాధికారి ప్రభ్ తేజ్ సింగ్ భాటియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐపీఎల్ నిర్వహణ తేదిల గురించి తెలియజేశారు. అలాగే పాకిస్థాన్ నిర్వహించబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఎంపిక చేసే జట్టును ఈ నెల 18న లేదా 19న వెల్లడిస్తామని పేర్కొన్నారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయంపై అవగాహన రాకపోవడంతోనే జట్టు ప్రకటనలో ఆలస్యం అవుతోందని తెలుస్తోంది.
కొత్త కూర్పుతో జట్లు..
గతేడాది రెండు రోజులపాటు ఐపీఎల్ మెగా వేలం నిర్వహించడంతో ఈసారి జట్లు వివిధ ఆటగాళ్లతో కళకళలాడనున్నాయి. అలాగే ఆటగాళ్లకు కేటాయించే బడ్జెట్ కూడా ఈసారి పెరిగింది. 2008లో టోర్నీ మొదలైన ఇన్నేళ్లలో రిషభ్ పంత్ అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలిచాడు. వేలం మొదలైన రోజునే రూ.27 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ తనను సొంతం చేసుకుంది. వేలంతో తొలుత ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్‌లతో పోటీపడినా లక్నో.. చివరికి 20.75 కోట్ల వద్ద పైచేయి సాధించిది. ఈ దశలో రైట్ టూ మ్యాచ్ ఆప్షన్ ద్వారా ఢిల్లీ రంగంలోకి దిగగా, రూ.27 కోట్ల కళ్లు చెదిరే మొత్తాన్ని ఆఫర్ చేసి లక్నో పంత్‍ను కైవసం చేసుకుంది. అలాగే గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును విజేతగా నిలిపిన ఆ టీమ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అనూహ్యంగా వేలంలోకి వచ్చి, భారీ ధరను దక్కించుకున్నాడు. రూ.26.75 కోట్లతో తనను పంజాబ్ కింగ్స్ దక్కించుకోగా, టోర్నీలోనే రెండో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలిచాడు. ఇక హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి కప్పు కొరతను పంజాబ్‌కు తీర్చాలని భావిస్తున్నాడు.
ఇక ఆర్సీబీ ప్లేయర్ విల్ జాక్స్ వేలంలోకి రాగా కాస్త వివాదాస్పద పద్ధతిలో అతడిని ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుంది. వేలంలో రూ.5.25 కోట్లకు ముంబై జాక్స్‌ను దక్కించుకోగా, తన రైట్ టూ మ్యాచ్ ఆప్షన్‌ను ఆర్సీబీ వినియోగించుకోలేదు. దీంతో వేలం అనంతరం ముంబై యాజమాని ఆకాశ్ అంబానీ.. ఆర్సీబీ యాజమాన్యం దగ్గరికి వెళ్లి షేక్ హ్యాండ్ ఇవ్వడం వివాదాస్పదమైంది. ముందే సంప్రదింపులు చేసుకుని జాక్స్‌ను ముంబై దక్కించుకుందని ఆరోపణలు రాగా, కేవలం ఆర్సీబీకి థ్యాంక్స్ చెప్పడం కోసమే అనంత్ అక్కడికి వెళ్లాడనే సమర్థింపులు కూడా వచ్చాయి. మొత్తానికి ఇదో టాక్ ఆఫ్ ది టౌన్‌లా మారింది.
యంగెస్ట్ ప్లేయర్‌గా సూర్యవంశీ..
ఇక బిహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో ఆడబోతున్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. రూ.1.10 కోట్లతో రాజస్థాన్ రాయల్స్ జట్టు అతడిని కొనుగోలు చేసింది. దీంతో టీనేజీలోనే కోటీశ్వరుడిగా సూర్యవంశీ నిలిచాడు. ఈ ఏడాది ఐపీఎల్ మెగావేలం కొంతమందికి చేదు అనుభవం మిగిల్చింది. హుషారుగా తమ పేరును వేలంలో నమోదు చేసుకున్న వివిధ దేశాలకు చెందిన ప్లేయర్లు అన్‌సోల్డ్‌గా మిగిలి షాకిచ్చారు. ముఖ్యంగా పీయూష్ చావ్లా, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, ఉమేశ్ యాదవ్, స్టీవ్ స్మిత్ తదితరులు అమ్ముడుపోలేదు. అలాగే ఫేమస్ క్రికెటర్లయిన ఆదిల్ రషీద్, కేశవ్ మహారాజ్, పృథ్వీషా, సర్ఫరాజ్ ఖాన్, జేమ్స్ అండర్సన్ లాంటి వాళ్లను కొనుగోలు చేయడానికి ఏ టీమ్ ఉత్సాహం చూపించలేదు. ఏదేమైనా ఐపీఎల్ మొదలై 17 ఏళ్లు గడిచిన ఢిల్లీ, పంజాబ్, బెంగళూరు కొత్త జట్టు లక్నోలు కప్పు కొట్టలేదు. ఈసారి ఎలాగైనా ఆ లోటు తీర్చుకోవాలని గట్టి పట్టుదలగా ఉన్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

