JC Prabhakar Reddy: 'తిరుమల టోకెన్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు తెచ్చుకుంది' - మాజీ మంత్రిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన కామెంట్స్
Andhra News: మాజీ మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైసీపీ శవ రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

JC Prabhakar Reddy Sensational Comments: తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైసీపీ శవ రాజకీయాలు చేస్తోందని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి (JC Prabhakar Reddy) మండిపడ్డారు. ఆదివారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 'రాబందుల ముఠా.. ఇదిగో జగనాసుర రక్తచరిత్ర' అంటూ వైసీపీ హయాంలో జరిగిన ప్రమాద ఘటనలకు సంబంధించి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వివరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రోజా మీద చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయన్న జేసీ... తిరుమల గుడిలో టికెట్లు అమ్ముకుని బెంజ్ కారు కొనుక్కుంది అంటూ మండిపడ్డారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
'రోజాపై విచారణ జరపాలి'
'మాజీ మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఆనం గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రోజా తిరుమల దర్శనానికి వెళ్లిన ప్రతిసారీ వందలాది మందిని వెంట తీసుకుని వెళ్లేది. టోకెన్ల దందాపై ఆమెపై విచారణ జరపాలి. సీఎం చంద్రబాబు పుణ్యాన రోజా రాజకీయాల్లోకి వచ్చింది. వైసీపీ నేతలను బయటకు రాకుండా చేయాలి. జగన్ హయాంలో బోటు ప్రమాదం జరిగితే అక్కడికి వెళ్లి పరామర్శించింది లేదు. ఎల్జీ పాలిమర్స్ ఘటన, రుయా ఆస్పత్రి ఘటనలు ఇంకా చాలా ఉన్నాయి. 2017లో మా బస్సు ప్రమాదంలో ఇద్దరు చనిపోతే అక్కడికి వెళ్లి కలెక్టర్, ఎస్పీని దబాయించారు.' అని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబు ఒకసారి వీరి గురించి ఆలోచించాలని జేసీ సూచించారు. జగన్ & కో రాబందుల కంటే ఘోరంగా తయారయ్యారని మండిపడ్డారు. తాము వైసీపీ హయాంలో తీవ్ర కష్టాలు పడ్డామని.. తాడిపత్రిలోనే కార్యకర్తలపై 890 కేసులున్నాయని అన్నారు. 'యువగళం ప్రారంభంలో ఎన్ని ఇబ్బందులు పెట్టారనేది అందరికీ తెలుసు. మాజీ సీఎం జగన్ ఫేడ్ అవుట్ అవుతున్నారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి చేస్తారని ప్రజలందరికీ తెలుసు. మీ మంచితనం గురించి కూడా అందరికీ తెలుసు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా చంద్రబాబు మాత్రం వారిని వదిలేశారు. తిరుపతి ఘటనలో పూర్తిస్థాయి విచారణలోనే అన్ని విషయాలు తెలుస్తాయి.' అని పేర్కొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

