JEE Main 2024: జేఈఈ మెయిన్ పరీక్షలకు సర్వం సిద్ధం, విద్యార్థులకు ముఖ్య సూచనలు
NTA: జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు దేశవ్యాప్తంగా జనవరి 24 నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షల నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ ఏడాది 12 లక్షల మంది హాజరుకానున్నారు.
JEE Main 2024 Exam: జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు దేశవ్యాప్తంగా జనవరి 24 నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షల నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జేఈఈ మెయిన్ పరీక్షలకు ఈ ఏడాది 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2.4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. తెలంగాణలో 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వ హించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌లో పరీక్షలు జరుగనున్నాయి. ఇక ఏపీలోని ప్రధాన నగరాల్లో 30 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. తెలుగు, ఇంగ్లిష్ సహా మొత్తం 10 భాషల్లో జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. రెండో దశ పరీక్షలు ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో జనవరి 24న పేపర్-2 పరీక్ష నిర్వహిస్తుండగా.. జనవరి 27, 29, 30, 31 తేదీల్లో పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే పేపర్-2 పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అందుబాటులో ఉంచింది. పేపర్-1 పరీక్ష అడ్మిట్ కార్డులను విడుదల చేయాల్సి ఉంది. జనవరి 24న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్టులో, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహించనున్నారు.
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ...
జేఈఈ మెయిన్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణీత సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించబోమని ఎన్‌టీఏ ప్రకటించింది. ఈసారి భద్రత వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను అమలు చేస్తున్నారు.
నెగెటివ్ మార్కులతో జాగ్రత్త..
జేఈఈ మెయిన్స్‌లో నెగెటివ్ మార్కుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. సమాధానం కచ్చితంగా రాస్తే 4 మార్కులు ఉంటాయి. తప్పుగా టిక్ పెడితే మైనస్–1 అవుతుంది. కాబట్టి తెలియని ప్రశ్నలకు ఊహించి రాసేకన్నా, వదిలేయడమే మంచిది. కన్ఫ్యూజ్ చేసే ప్రశ్నల కోసం ముందే సమయం వృథా చేయకూడదు.
పరీక్ష రోజే అత్యంత కీలకం..
జేఈఈ మెయిన్ సిలబస్‌లో ఈసారి మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈసారి పరీక్ష కోసం సిలబస్ తగ్గించారు. కోవిడ్ సమయంలో కేంద్ర విద్యా సంస్థల్లో టెన్త్ రాసినవారు ప్రస్తుతం జేఈఈ మెయిన్స్‌కు హాజరవుతున్నారు. ఆ సమయంలో వీళ్లకు సిలబస్ కుదించారు. దాదాపు 25 శాతం సిలబస్‌ను తొలగించారు. కొన్ని పాఠ్యాంశాలను తొలగించి, మరికొన్నింటిని కలిపారు. దీనివల్ల ఇదివరకే పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు కాస్త ఇబ్బంది కలగవచ్చు. అయితే సిలబస్ నుంచి తొలగించిన పాఠ్యాంశాల నుంచి గతంలో కఠినమైన ప్రశ్నలు ఇచ్చేవారు. ఇప్పుడు వాటిని తొలగించారు. ఇక కెమిస్ట్రీ నుంచి అధ్యాయాలను ఎక్కువగా తీసేశారు. ఇది విద్యార్థులకు కాస్త ఉపశమనం కలింగించే విషయం. అలాగే మ్యాథమెటిక్స్‌లో సుదీర్ఘ ప్రశ్నలను తొలగించారు. మ్యాథమెటికల్ రీజనింగ్ నుంచి గతంలో 99 శాతం ఒక ప్రశ్న వచ్చేది. కానీ ఇప్పుడు పాఠ్యాంశాన్ని తొలగించారు. ఇలాంటివి చాలా పాఠ్యాంశాలున్నాయి. పరీక్ష రోజు ప్రశాంతంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో అత్యుత్సాహంతో తెలిసిన ప్రశ్నలకు తప్పులు చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
పరీక్ష విధానం..
➥ పేపర్-2(ఎ) బీఆర్క్ పరీక్ష..
నిట్‌లు,ట్రిపుల్ ఐటీలు,ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు రాయాల్సిన పరీక్ష ఇది. పేపర్-2ఎగా పిలిచే ఈ పరీక్షను కూడా మూడు విభాగాలుగా నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ విభాగంలో ఎంసీక్యూల్లో ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయించారు. అదే విభాగంలో న్యూమరికల్ ప్రశ్నలలో పది ప్రశ్నలకుగాను అయిదు ప్రశ్నలు ఛాయిస్‌గా ఉంటాయి. డ్రాయింగ్ టెస్ట్‌లో మాత్రం రెండు అంశాలను ఇచ్చి డ్రాయింగ్ వేయమంటారు. ఒక్కో టాపిక్‌కు 50 మార్కులు.
➥ పేపర్-2(బి)బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ పరీక్ష..
బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పేపర్-2బి మూడు విభాగాలుగా ఉంటుంది. మ్యాథమెటిక్స్‌లోని న్యూమరికల్ వాల్యూ ఆధారిత ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలు ఛాయిస్‌గా ఉంటాయి. మూడు పరీక్షలకు కేటాయించిన సమయం మూడు గంటలు. బీఆర్క్, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ రెండు పేపర్లకు మూడున్నర గంటలు పరీక్ష సమయం ఉంటుంది.
విద్యార్థులకు ముఖ్య సూచనలు..
⫸ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఏమాత్రం ఆందోళనకు గురికాకుంగా ఇచ్చిన ప్రశ్నలను క్షుణ్ణంగా పరిశీలించాలి. గుడ్డిగా అంచనా వేసి ఆన్సర్లు చేయకూడదు. తెలియని ప్రశ్నను పట్టుకుని, సమయం వృథా చేసుకోవద్దు.
⫸ పట్టున్న అంశాలపైనే దృష్టిపెట్టడం మంచిది. లేకపోతే సమయమంతా వృథా అవుతుంది. పరీక్షకు సమయం లేనందున రివిజన్ మాత్రమే చేస్తే బెటర్.
⫸ ప్రతి సబ్జెక్టులో రెండో సెక్షన్‌లో ఇచ్చే న్యుమరికల్ ప్రశ్నలకు మాత్రమే చాయిస్ ఉంటుంది. మొదటి సెక్షన్‌లోని ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు చాయిస్ లేదు.
⫸ పరీక్షలో 40 శాతం ప్రశ్నలు నేరుగా ఫార్ములా బేస్డ్, మరో 40 శాతం పాత ప్రశ్నపత్రాల నుంచి, 10 శాతం ప్రశ్నలు పాత జేఈఈ అడ్వాన్స్‌డ్ నుంచి, మిగతా ప్రశ్నలు ఎక్కువ సమయం పట్టేవి ఇస్తున్నారు.
⫸ విద్యార్థుల్లో ఎక్కువ మంది స్టేట్‌మెంట్స్, అసెర్షన్, రీజన్స్ తరహా ప్రశ్నల్లో తప్పులు చేస్తున్నారు. ఈ తప్పు జరగకుండా ఫార్ములాలను గుర్తుంచుకోవటం మంచిది.
⫸ విద్యార్థులు పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
⫸ అడ్మిట్ కార్డుతోపాటు అవసరమైన పత్రాలన్నీ (సెల్ఫ్ డిక్లరేషన్, అండర్ టేకింగ్ ఫాం) దగ్గర ఉంచుకోవాలని ఎన్‌టీఏ సూచించింది.
⫸ వాటర్ బాటిల్స్, హ్యాండ్ శానిటైజర్లు, మాస్కులు, బాల్ పాయింట్ పెన్నులను అనుమతిస్తారు.
⫸ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, స్మార్ట్‌ఫోన్లు, బ్లూటూట్ ఉపకరణాల వంటి వాటికి అనుమతి లేదు.