Academic Text Books: అన్ని ప్రాంతీయ భాషల్లో పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచండి, విద్యాసంస్థలకు కేంద్రం ఆదేశం
Academic Text Books: దేశవ్యాప్తంగా విద్యార్థులకు మాతృ భాషలో చదువుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించిన కేంద్రం. వచ్చే మూడేళ్లలో పాఠ్యపుస్తకాలన్నీ ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.
Academic Text Books in Regional Languages: దేశవ్యాప్తంగా విద్యార్థులకు మాతృ భాషలో చదువుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. వచ్చే మూడేళ్లలో అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలను అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు తర్జుమా చేపట్టాలని నియంత్రణ సంస్థలైన ఎన్‌సీఈఆర్‌టీ, యూజీసీ, ఏఐసీటీఈ, ఇగ్నో, జాతీయ సార్వత్రిక విద్యా పీఠం (ఎన్‌ఐఓఎస్)తోపాటు కేంద్రీయ విద్యా సంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, సెంట్రల్ వర్సిటీలను కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. మాతృభాషలో చదువుకోవడాన్ని ప్రోత్సహించాలని జాతీయ నూతన విద్యా విధానం-2020 సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీటెక్ కోర్సులనూ ప్రాంతీయ భాషల్లో బోధనకు ఏఐసీటీఈ దేశవ్యాప్తంగా అనుమతిస్తోంది. మధ్యప్రదేశ్‌లో ఎంబీబీఎస్ కోర్సు హిందీ మాధ్యమంలో ఇప్పటికే మొదలైంది.
విద్యార్థుల సౌలభ్యం కోసం 'ట్రాన్స్‌లేషన్' యాప్..
రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భారతీయ భాషల్లో అన్ని తరగతుల పుస్తకాలను ఆంగ్లం నుంచి తర్జుమా చేయాలని కేంద్ర విద్యాశాఖ సంకల్పించింది. ఏ భాష నుంచి ఏ భాషలోకైనా సులభంగా తర్జుమా చేసేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే అనువాదిని యాప్‌ను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. దాని సహాయంతో గత రెండేళ్ల నుంచి ఇంజినీరింగ్, మెడికల్, లా తదితర ప్రొఫెషనల్ కోర్సుల పాఠ్యపుస్తకాలను అనువాదం చేస్తున్నారు. ఇలా తర్జుమా చేసిన ఉన్నత విద్య కోర్సుల పుస్తకాలను ఈ-కుంభ్ పోర్టల్‌లో ఉంచారు. పాఠశాల విద్యకు సంబంధించిన స్టడీ మెటీరియల్ దీక్షా యాప్‌లో అందుబాటులో ఉంది. మొత్తానికి అన్ని తరగతుల పుస్తకాలను 2026 నాటికి అన్ని భాషల్లో అందుబాటులో ఉంచనున్నారు.
యాప్ గురించి అవగాహన..
అనువాదిని యాప్ సహాయంతో పాఠ్యపుస్తకాల తర్జుమాపై విశ్వవిద్యాలయాలకు అవగాహన కల్పించేందుకు అన్ని రాష్ట్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఏఐసీటీఈ చీఫ్ కోఆర్డినేటర్ బుద్ధా చంద్రశేఖర్ తెలిపారు. ఇటీవలే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రజంటేషన్ ఇచ్చారు. వచ్చే నెలలో ఏపీలో ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో అవగాహన కల్పించబోతున్నారు. ఇంగ్లిష్ భాషపై భయంతో ఏ విద్యార్థి కూడా ఉన్నత విద్యను మానేయకుండా ఉండేందుకు కేంద్రం ఈ చర్యలు తీసుకుంటోంది. పాఠ్యపుస్తకాలన తర్జుమా చేయడానికి ఎందరో నిపుణులు, రచయితలు ముందుకొస్తున్నారు. ఇటీవల యూజీసీ సైతం రచయితల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. కేరళ హైకోర్టు ఆంగ్లంలో ఇచ్చిన తీర్పులను ఈ యాప్ సహాయంతో మలయాళంలోకి తర్జుమా చేసి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతోంది.
2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. పూర్వ ప్రాథమిక స్థాయి నుంచే పిల్లలు తమ మాతృభాషపై ప్రత్యేకదృష్టి సారించడంతోపాటు ఇతర భాషలను తెలుసుకుంటే, బహు భాషావాదం చిన్నారుల ఆలోచనా పరిధిని విస్తృతం చేస్తుందని జాతీయ విద్యావిధానం-2020 కూడా బలంగా చెబుతోంది. కనీసం 5వ తరగతి వరకైనా ఈ విధానం అనుసరించాలని, 8వ తరగతి.. ఆ తర్వాత కూడా ఇదే విధానం మేలని నిర్దేశిస్తోంది. బహుభాషా విద్యావిధానం అమలుకు, బోధనా భాషగా మాతృభాష వాడకానికి ప్రస్తుతం కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి.
భిన్న భాషల్లో బోధించే సామర్థ్యమున్న నిపుణులైన టీచర్లు దొరకడం, నాణ్యమైన బహుభాషా పాఠ్యపుస్తకాల లభ్యత కష్టమవుతోంది. ఈ సవాళ్ల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో భారతీయ భాషల ద్వారానే విద్యాబోధన కొనసాగించేందుకు కేంద్ర విద్యాశాఖ పలు చర్యలు తీసుకొంది. ఆ సంస్థ వెంటనే ఈ పనిని ప్రారంభించినందున వచ్చే సీజను నుంచి పిల్లలకు 22 భారతీయ భాషల్లో కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వస్తాయి. మరోవైపు.. ఉన్నత విద్యారంగంలోనూ భారతీయ భాషల్లో పాఠ్యపుస్తకాల ముద్రణ పని మొదలైంది. ఇంగ్లిష్ మాధ్యమానికి అదనంగా భారతీయ భాషల్లో బోధన, అభ్యాస ప్రక్రియ కొనసాగించడానికి, పరీక్షలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టింది.