Crime News: బజ్జీల కోసం దారుణం - అరువు ఇవ్వలేదని వేడి నూనె పోసేశాడు, ఎక్కడంటే?
Telangana News: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బజ్జీలు అరువు ఇవ్వలేదని దుకాణం యజమానిపై సల సల కాగే నూనె పోశాడు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
Man Pour Hot Oil On Bujji Shop Owner In Gadwal District: ఓ వ్యక్తి తనకు బజ్జీలు అరువు ఇవ్వలేదని ఆ దుకాణం యజమానిపైనే క్రూరంగా ప్రవర్తించాడు. అందరూ చూస్తుండగానే సల సల కాగిన నూనెను అతనిపై పోసేశాడు. ఈ ఘటనలో సదరు షాప్ ఓనర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లాలోని (Gadwal District) కేటిదొడ్డి మండలం గువ్వలదిన్నెకు చెందిన బొజ్జన్న గౌడ్ స్థానికంగా మిర్చీ బజ్జీల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తి తనకు బజ్జీలు కావాలని.. డబ్బులు తర్వాత ఇస్తానని చెప్పాడు. అయితే, అరువు ఇవ్వడం కుదరదని బొజ్జన్నగౌడ్ తేల్చిచెప్పాడు. దీంతో వినోద్ అతనితో అరువు ఎందుకు ఇవ్వవు అని గొడవకు దిగాడు.
ఆగ్రహంతో ఊగిపోయిన వినోద్.. పక్కనే కళాయిలో సల సల కాగుతున్న నూనెను బొజ్జన్న గౌడ్‌పై పోశాడు. అయితే, దీన్ని తప్పించుకునే క్రమంలో వీరేశ్ అనే వ్యక్తి వెనకాల బొజ్జన్న దాక్కుండిపోయాడు. దీంతో వీరేశ్ ముఖంపై నూనె పడి పూర్తిగా కాలిపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. వీరేశ్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో వినోద్ మద్యం తాగి ఉన్నాడని స్థానికులు పేర్కొంటున్నారు. కాగా, బజ్జీల కోసం ఇంత దారుణానికి ఒడిగట్టడంపై స్థానికంగా ఆందోళన నెలకొంది.