Rupai Village Story: ఇండియన్ కరెన్సీ పేరుతో గ్రామం- శ్రీకాకుళం జిల్లాలోని రూపాయి పల్లె చరిత్ర తెలుసా?
Srikakulam: రూపాయి... అంటే ఏంటంటే... ఇండియా కరెన్సీ అని ఠక్కున చెప్పేస్తారు. ఆ పల్లె వాసులు మాత్రం మా ఊరి పేరు అంటారు. ఇలాంటి వెరైటీ పేర్లు శ్రీకాకుళం జిల్లాలో చాలానే ఉన్నాయి.
Srikakulam : రూపాయి అధికారిక మారక ద్రవ్యం. భారతీయ కరెన్సీలో రూపీని రూపాయిగా పిలుస్తాం. ఇదే పేరుతో ఓ గ్రామం ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఉన్న గిరిజన గ్రామం పేరే రూపాయి. అక్కడ నివశించేది అందరు గిరిపుత్రులే. సీతంపేట ఐటీడీఏ, మండలంలో కొతతగా చేరిన అధికారులు ఎవరైనా సరే ఒక్కసారైనా రూపాయి గ్రామాన్ని చూసి వస్తారు.
పూర్వం కాలం నుంచి గ్రామానికి వచ్చిన పేరు అది కాదని స్థానికులు చెబుతుంటారు. చుట్టు పక్కల గ్రామల కంటే ఇ పల్లె ఆర్థికంగా బాగా మెరుగ్గా ఉండేదట. అప్పటి నుంచి దీన్ని రూపాయి గ్రామంగా పిలుస్తున్నారు. వాళ్లంతా పక్కనే ఉన్న గ్రామంలో మేకలను రూపాయికే కొనుగోలు చేసేవారట. దీంతో ఆ గ్రామం పేరు రూపాయిగా మారిందని చెప్పుకొస్తున్నారు.
ఆ గ్రామ ఆదివాసీలు పండించే పంటలను మైదాన ప్రాంతంలో విక్రయించేవారు. అప్పట్లో వస్తువులు అమ్ముకుని తేచ్చే నాణేలను ఇంటి వద్ద జాగ్రత్త చేసే వాళ్లు. మరికొందరు భూమిలో పాతిపెట్టేవారట. అలా ఉంచిన నాణేలు చిలుము పట్టడంతో వాటిని చింత పండుతో కడిగి ఆరబెట్టేవాళ్లట. దీంతో ఆ గ్రామానికి రూపాయి ఊరుగా ఫిక్స్ చేశారంటూ మరో కథను వినిపిస్తున్నారు.
కారణం ఏమైనా సరే రూపాయి పేరుతో ఆ గిరిజన ఏజెన్సీలోనే గ్రామానికి ప్రత్యేకత ఉంది. వినడానికి చిత్రంగా ఉన్న పేరుతో చాలాసార్లు గిరిపుత్రులు నవ్వులపాలు అయ్యామని చెబుతున్నారు. మైదాన ప్రాంతాలకు వచ్చి ఊరు చెబితే ఎదుటి వాళ్ల నవ్వుకునే వాళ్లు. మరికొందరు వెటకారంగా పిలిచే వారని ఇలాంటివి చాలా ఎదుర్కొన్నామని చెబుతున్నారు. ఇప్పుడు రూపాయిగా సుపరిచతం కావడంతో కొన్ని సూటిపోటు మాటలు తగ్గాయనిఅంటున్నారు.
రూపాయి గ్రామం పేరు వింటే వైరేటిగా ఉందంటున్నారే తప్ప వివాదాలు లేవని చెబుతున్నారు. ఈ గ్రామం పక్కనే వాటర్ ఫాల్ ఉండడంతో వేర్వేరు గ్రామాల నుంచి వస్తుంటారు. ఈ పల్లె ఒక్కటే కాదు... ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చాలా పేర్లు ఇలా వింతగా ఉంటాయి. ఉద్దానంలో ప్రతి పేరు వెనక పుట్టుగా కచ్చితంగా ఉంటుంది. టెక్కలి నియోజకవర్గంలో బొమ్మాలి పేర్లతో ఊళ్లు ఉంటాయి.
వికీపిడియా ప్రకారం రూపాయి ఊరు ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే కాదు ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలో కూడా ఉందట. ఆ ఊరి పేరు గౌర రూపాయి పీర్ అలీపూర్. ఇక్కడ 550 ఇళ్లు 3,097 మంది జనాభా ఉన్నారట.