Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Google Office In Vizag: విశాఖలో గూగుల్ తన కార్యకలాపాలు ప్రారంభించబోతోంది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటించారు.
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రతిష్టాత్మకంగా సంస్థ రానుంది. ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా పేరున్న గూగుల్ తన కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించబోతోంది. ఆ సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో సమావేశమై చర్చలు జరిపారు. విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు కూడా ఒప్పందం చేసుకున్నారు.
ఈ విషయాన్ని కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నిరంతరం శ్రమిస్తుంటేనే ఫలితాలు వస్తాయని ప్రయత్నాన్ని ఆపకూడదని వారికి సూచించారు. విశాఖ కేంద్రంగా గూగుల్ కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించబోతోందని చెప్పారు. ఇది మంత్రి లోకేష్ పట్టుదలతో సాధ్యమైందన్నారు.
గూగుల్ ఆఫీస్ యాక్టివిటీస్ ప్రారంభమైతే విశాఖ చరిత్ర మారిపోతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అందుకే నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటే కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. ప్రస్తుతం కాలంలో హార్డ్ వర్క్‌తో సాధ్యం కాని పనులు స్మార్ట్ వర్క్‌తో పూర్తి అవుతున్నాయని చెప్పుకొచ్చారు.
మొదటి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కి రాష్ట్రంలో చీకటి అమలుకొని ఉందని ఇప్పుడు రెండో కాన్ఫరెన్స్ నాటికి వెలుగు వస్తున్నాయని అన్నారు చంద్రబాబు. గవర్నమెంట్ విజన్ తెలియజేయడానికి ఈ కాన్ఫరెన్స్ ఉపయోగపడుతుందని చెప్పారు. టెక్నాలజీ ద్వారా రాష్ట్రంలో గంజాయి నీ నిర్మూలిస్తున్నామన్నారు. గతంలో పదో తేదీకి కూడా జీతాలు రాని పరిస్థితి ఉండేదని ఇప్పుడు ఒకటో తేదీకి జీతాలు పడుతున్నాయని వివరించారు.