అన్వేషించండి
Advertisement
Ayyanna Patrudu House Issue: మాజీ మంత్రి అయ్యన్నకు హైకోర్టులో ఊరట, కానీ రివేంజ్ పాలిటిక్స్‌పై ఏపీలో దుమారం
AP high court stay on Ayyanna Patrudu House Issue: ఏపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. అయ్యన్న ఇంటి ప్రహారీ గోడ కూల్చివేత ప్రక్రియపై హైకోర్టు స్టే ఇచ్చింది.
ఏపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. అయ్యన్న ఇంటి ప్రహారీ గోడ కూల్చివేత ప్రక్రియపై హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలిచ్చేంతవరకూ ఈ విషయంలో చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు గతంలో మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ భూమి, కాల్వకు సంబంధించిన రెండు సెంట్లను ఆక్రమించి భవనాన్ని నిర్మించినట్టు ఆరోపిస్తూ మున్సిపల్ అధికారులు తెల్లవారుజామున జేసీబీతో వచ్చి అయ్యన్న ఇంటి గోడను పగులకొట్టారు. ఇది తెలుసుకున్న అయ్యన్న అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో అయ్యన్న ఇంటిని చేరుకోవడానికి ప్రయత్నించగా వారిని అధికారులతో పాటు వచ్చిన పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నర్సీపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
బీసీలం కనుకే గొంతు నొక్కుతున్నారు : అయ్యన్న భార్య పద్మావతి
ఈ ఘటనపై అయ్యన్న పాత్రుడు భార్య పద్మావతి స్పందిస్తూ అయ్యన్న గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అని, బీసీలుగా పుట్టడమే తాము చేసిన నేరమా అంటూ ఒక వీడియోను రిలీజ్ చేసారు. విద్యుత్ సరఫరా నిలిపివే సిమరీ తమ ఇంటిని కూల్చడం మొదలు పెట్టారని, రాజకీయ పరమైన విభేదాలు ఉంటే నేరుగా చూసుకోవాలని, ఇలా ఆస్తులు ధ్వంసం చేస్తారా అంటూ ఆమె మండిపడ్డారు.
అన్ని అనుమతులూ తీసుకున్నాకే ఇంటిని నిర్మించాం : అయ్యన్న కుమారుడు రాజేష్
నర్సీపట్నంలో మున్సిపల్ సిబ్బంది తీరును అయ్యన్నపాత్రుడు రెండో కుమారుడు చింతకాయల రాజేశ్ ఖండించారు. మున్సిపల్ కమిషనర్ నుంచి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే నిర్మించామని చెప్పారు. ల్యాండ్ పర్మిషన్ ఇచ్చాకే కట్టామని రాజేశ్ తెలిపారు. న్యాయంగా ఇల్లు కట్టుకున్నామని.. ఇలా ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్? అని ఆయన నిలదీశారు. పోలీసులు ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేశారని రాజేశ్ ఆరోపించారు. అధికారులు మాత్రం ఆక్రమణలో ఉన్నందునే కూల్చివేశామని చెబుతున్నారు. మరోవైపు అయ్యన్న ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయన కుమారుడు రాజేశ్‌ను అరెస్ట్ చేసేందుకుప్రయత్నించారు. దీంతో పోలీసులు, అధికారులతో కుటుంబసభ్యులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.
ప్రభుత్వ భూమిలో రెండు సెంట్లు ఆక్రమించారంటూ మున్సిపల్ కమిషనర్ పేరిట ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. ఆ నోటీసులో ఈ నెల 2 వ తేదీ అని ఉండగా .. అది తమకు శనివారం అందజేసి ,ఆదివారం కూల్చివేత మొదలు పెట్టారని అయ్యన్న కుమారుడు రాజేశ్ ఆరోపించారు. మళ్ళీ రీసర్వే చెయ్యాలని ఒకవేళ రెండు సెంట్లు ఆక్రమించుకున్నట్టు రుజువైతే.. తామే ఇంటిని కూల్చివేస్తామని ఆయన తెలిపారు. అలాకాకుండా, తమ ఇల్లు సక్రమంగా నిర్మించినట్టు రుజువైతే పడగొట్టిన ఇంటి ప్రహరీని కట్టించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దాంతో అయ్యన్న ఇంటి కూల్చివేత కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది. సోమవారం నాడు భూమి రీసర్వే చేయనున్నారు అధికారులు. ఇక ఈ సంఘటన జరుగుతున్న సమయంలో అయ్యన్నపాత్రుడు హైదరాబాద్‌లో ఉన్నారు .
ఇది ముమ్మాటికీ వైసీపీ కక్ష సాధింపు చర్యే: టీడీపీ అధినేత చంద్రబాబు
మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ కూల్చివేత ముమ్మాటికీ వైసీపీ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు టీడీపీలో బలమైన బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అరెస్టులు, దాడులకు జగన్ పాల్పడుతున్నారని పేర్కొన్నారు. చోడవరం మినీ మహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాడనే అక్కసుతోనే అయ్యన్నపాత్రుడి ఇంటిపై చీకటి దాడులు చేయించాడని ఆరోపించారు. అయ్యన్న అడిగిన ప్రశ్నల్లో ఏ ఒక్కదానికైనా సమాధానం ఇవ్వలేని, దమ్ములేని జగన్ కూల్చివేతకి పాల్పడ్డాడని విమర్శించారు. దీనిపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు.
జగన్‌ను చూస్తే జాలి వేస్తుంది : నారా లోకేష్
అయ్యన్నపాత్రుడు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం చూసి జగన్ భయపడ్డారని అందుకే ఇలాఆయన ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేసారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. కనీసం అయ్యన్నకు న్యాయ సహాయం అందకుండా ఆదివారం నాడు ఈ పనికి పూనుకోవడం కక్ష సాధింపు కాదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజావ్యతిరేకత చూసి పిరికిపంద చర్యలు మొదలుపెట్టారని, మూడేళ్ళ తర్వాత కూడా ఇలా ప్రతిపక్ష నేతల ఇల్లు కూల్చడం, అరెస్టులకు పూనుకోవడం వంటి పనులకు పాల్పడుతున్న జగన్ ను చూసి జాలి వేస్తుందని లోకేష్ అన్నారు.
వైజాగ్ లో జగన్ దిష్టి బొమ్మ దగ్ధం
మాజీ మంత్రి అయ్యన్న ఇంటి కూల్చివేత యత్నానికి వ్యతిరేకంగా విశాఖ పట్నంలో TNSF నేతలు సీఎం జగన్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. 70 సంవత్సరాల వయసున్న వ్యక్తిపై నిర్భయ కేసు పెట్టడం, ఆదివారం నాడు ఇల్లు కూల్చే ప్రయత్నం చెయ్యడం పిరికిపందల చర్యలని TNSF రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ పేర్కొన్నారు. అయ్యన్న పాత్రుడుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేసి, ఆయనను వేధించడం మానుకోకుంటే వైజాగ్ నుండి ఛలో అనకాపల్లి కలెక్టరేట్ కార్యక్రమానికి పిలిపునిస్తామని హెచ్చరించారు.
చట్టం దృష్టిలో అందరూ సమానమే : మంత్రి కారుమూరి నాగేశ్వర రావు
దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా ఘాటుగా స్పందించింది. చట్టం దృష్టిలో అందరూ సమానమే అనీ, అయ్యన్న పాత్రుడు చేసిన కబ్జాలకు అదుపూ అడ్డూ లేదని విమర్శించారు. బీసీలు అయినా కూడా తప్పు చేస్తే అది తప్పేనంటూ ఏపీ పౌర సరఫరాల శాఖా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే బీసీలు అని చూస్తూ చర్యలు తీసుకోకుండా ఉండాలా అని ప్రశ్నించారు.
చోడవరం మినీ మహానాడులో ప్రసంగమే కారణం
ఇటీవల చోడవరంలో జరిగిన కార్యక్రమంలో అయ్యన్న పాత్రుడు సీఎం జగన్ కు వ్యతిరేకంగా చేసిన ప్రసంగమే ఈ వివాదానికి కారణం అంటున్నాయి టీడీపీ శ్రేణులు. ఆ సభలో వైసీపీ నేతలు, మంత్రులు మీద అయ్యన్న ఘాటు విమర్శలు చేశారు. అలాగే సీఎం జగన్ పై కూడా తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు . దానితో ప్రభుత్వం అయ్యన్నను టార్గెట్ చేసిందని వాదనలు వినిపిస్తున్నాయి .
రివెంజ్ పాలిటిక్స్ ?
ఇక ఈ మొత్తం ఘటనపై రాష్ట్ర రాజకీయాల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో రాజకీయ విభేదాలు వ్యక్తిగత స్థాయికి దిగజారాయని, ఒకవైపు విమర్శలు, మాటలు బూతులుగా హద్దు దాటి వెళుతుంటే, మరోవైపు దానికి ప్రతిచర్య కూడా అరెస్టులు, ఆస్తుల ధ్వంసం వరకూ వెళుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఏపీ రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు ఎన్నడూ చూడలేదని ముందుముందు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజలకు రాజకీయాలంటేనే అసహ్యం కలుగుతుందని చర్చ మొదలైంది .
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement