Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
RGV Cases: తనపై నమోదైన కేసుల పట్ల దర్శకుటు ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని.. అప్పుడప్పుడు తన సినిమా పనుల కోసమే బయటకు వెళ్లినట్లు స్పష్టం చేశారు.
RGV Sensational Tweet On Cases: రామ్‌గోపాల్‌వర్మ (Ram Gopal Varma).. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈయన ఓ హాట్ టాపిక్. వైసీపీ హయాంలో చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన ఫిర్యాదులపై ప్రకాశం సహా మరికొన్ని జిల్లాల్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే విచారణకు పిలిచినా హాజరు కాకపోవడంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు వెళ్లగా అందుబాటులో లేరు. దీంతో ఆర్జీవీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా, తనపై నమోదైన కేసులపై ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దాదాపు 22 పాయింట్లతో కూడిన అంశాలను ట్వీట్ చేస్తూ జాతీయ మీడియాతో పాటు తెలుగు మీడియాను ట్యాగ్ చేశారు.
ఆర్జీవీ లేవనెత్తిన పాయింట్లివే..
- నేను ఏదో పరారీలో ఉన్నాను, ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాల్లో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నారని ఆనందపడుతున్న వాళ్లందరికీ ఓ బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఈ టైమ్ అంత నేను నా డెన్ ఆఫీసులోనే ఉన్నాను, అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటకి వెళ్లడం తప్ప.
- ఇంకో షాక్ ఏంటంటే పోలీసులు ఇంతవరకు నా ఆఫీసులోకి కాలే పెట్టలేదు. పైగా నన్ను అరెస్టు చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియాతో కానీ చెప్పలేదు. ఒక వేళ నన్ను అరెస్టు చేయడానికే వస్తే నా ఆఫీసులోకి ఎందుకు రారు?
- నా మీద కేసు ఏంటంటే నేను ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం నా సోషల్ మీడియా అకౌంట్‌లో పెట్టానని అంటున్న కొన్ని మీమ్స్, ఇప్పుడు సడెన్‌గా అసలు సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు దెబ్బతినటం మూలాన ఆ కంప్లయింట్ ఇచ్చారంట.
- ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే 4 వేర్వేరు వ్యక్తులు, ఏపీలోని 4 వేర్వేరు జిల్లాల్లో నా మీద ఈ కేసులు పెట్టారు. ఇంకా మీడియా ప్రకారం మరో 5 కేసులు కూడా నమోదయ్యాయి. అవన్నీ కలిపి మొత్తం 9 కేసులు, ఇవన్నీ కూడా కేవలం గత 4 , 5 రోజుల్లోనే నమోదయ్యాయి.
- నాకు నోటీసు అందిన వెంటనే, నా సినిమా పనుల వల్ల, సంబంధిత అధికారిని కొంత సమయం కోరాను. ఆయన కూడా అనుమతించారు. కానీ నా పనులు పూర్తి కాకపోవడం వల్ల మరికొంత టైం అడగడం, లేకపోతే వీడియో ద్వారా హాజరవుతానని చెప్పాను. అదే టైమ్‌లో నా మీద అన్ని వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదవడం వెనక ఏదో కుట్ర ఉంది అని కూడా నాకు, నా వాళ్లకి అనుమానం కలిగింది.
- నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాను, చాలాసార్లు రోజుకి 10 నుంచి 15 పోస్టులు కూడా చేసేవాడిని, ఒక సంవత్సర కాలంలో కొన్ని వేల పోస్టులు చేసి ఉంటాను. వాళ్లు నేను పెట్టానంటున్న పోస్టులు నేను చేసిన ఒక రాజకీయ వ్యంగ్య చిత్రానికి సంబంధించినవి, ఆ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం ఆ చిత్రం విడుదల అవ్వడం కూడా చాలా నెలల క్రితం జరిగిపోయింది. నేను పెట్టానంటున్న పోస్టులు, వేటి వల్ల ఐతే కొందరు వ్యక్తులు వేర్వేరు ప్రాంతాల్లో తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అని అంటున్నారో అవి ఈ నోట్ క్రింద పెట్టాను. ఈ మీమ్స్ కారణంగా నా మీద 336 (4), 353 (2), 356 (2), 61 (2), 196, 352 of BNS and section 67 of IT సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు.
- BNS 336(4) ఏవైనా పత్రాలను కానీ ఎలక్ట్రానిక్ రికార్డును కానీ ఇతరులను మోసం చేయడానికి లేదా వారి పరువుకు భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీవి సృష్టించడం. నేను చేసిన పోస్టులు చూస్తే, అందులో ఫోర్జరీ ఎక్కడుంది? , అది కేవలం ఒక కార్టూన్, ఒక వేళ దీని వల్ల ఒకరి పరువుకు భంగం కలిగింది అంటే మరికొన్ని లక్షల మంది ఇంకొన్ని లక్షల మంది మీద రోజు పెడుతున్న వాటి సంగతి ఏంటి.?
- BNS 353(2).. తప్పుడు సమాచారం, వదంతులు లేదా భయపెట్టే వార్తలను కలిగి ఉన్న ఏదైనా ప్రకటన లేదా నివేదికను రూపొందించే లేదా ప్రోత్సహించే ఉద్దేశంతో లేదా సృష్టించడానికి లేదా ప్రోత్సహించే అవకాశం ఉన్న ఎలక్ట్రానిక్ మార్గాలతో సహా, మతం, జాతి ప్రాతిపదికన ప్రచురించేది.. నా కేసు విషయంలో ఇది ఎలా వర్తిస్తుందో నాకు అర్థం కావడం లేదు.
- BNS 356. (1).. ఎవరైనా మాటల ద్వారా గానీ, రాతల ద్వారా గానీ, సంకేతాల ద్వారా గానీ, చిహ్నాల ద్వారా గానీ ఒకరి పరువుకు నష్టం కలిగించడం. మీమ్‌లతో పరువు నష్టం దావా వేస్తే రోజుకి లక్ష కేసులవుతాయి. BNS 61(2).. ఒక చట్ట విరుద్ధమైన పని చేయడం కోసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య జరిగే ఒప్పందం. ఇక: మోసపూరిత విధానం లో చద్దబద్ద మైన ఫలితం పొందడం. దీని లింక్ నా కేసుకేంటి?
- ఈ మీమ్ అనే భావ ప్రకటన ప్రస్తుత సమాజంలో తమ ఆలోచనలు, భావాలు, ఉద్దేశాలను, శైలీ, ప్రవర్తనలు వ్యక్తపరిచే ఎఫెక్టివ్ సాధకం. విస్తృతంగా వ్యాపిస్తూ పరిణామం చెందే లక్షణం వల్ల ఈ మీమ్స్ డిజిటల్ కల్చర్‌లో ముఖ్య భాగం అయ్యింది. మీమ్స్ అనేవి ఇమేజ్, వీడియో లేదా వాక్యము etc రూపంలో ఉండే హాస్యభరితమైన మెసేజ్ మాత్రమే.
- మనం ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో బతుకుతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే సినిమా మనుషులు, రాజకీయ నాయకులు, సాధారణ జనం అందరూ ప్రతి రోజు ఈ సోషల్ మీడియాలో తమ ఉద్దేశాలను రుద్దుతూ, జోక్స్ వేసుకుంటూ, అరుచుకుంటూ, బూతులు తిట్టుకుంటూ, బోధనలు చేస్తుంటారు. ఇప్పుడు వీటన్నింటినీ సీరియస్‌గా తీసుకుంటే దేశంలో సగం మందిపైన కేసు పెట్టాలి.
- ఇప్పుడూ మీడియాలో వస్తున్న కథనాలు. నన్ను పట్టుకోవటానికి పోలీసులు టీమ్స్ ఏర్పరిచారు. వాళ్లు ముంబై, చెన్నై ఇంకా పలు చోట్ల వెతుకుతున్నారు, నేను పరారీలో ఉన్నాను అనేవి అన్ని అబద్ధాలు.. కానీ ఈ మీడియా ప్రతిసారీలాగే హై డ్రామా క్రియేట్ చేసింది.
'అందుకే మొబైల్ స్విచ్చాఫ్ చేశా'
'నేను నా మొబైల్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేయటానికి ప్రధాన కారణం, లెక్కలేనన్ని మీడియా కాల్స్, ఇంకా పరామర్శ కాల్స్ ఇవన్నీ నా పనిని డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి. ఇప్పటివరకు నేను రిక్వెస్ట్ చేసిన అడిషనల్ టైమ్‌కి నాకు ఆఫీసర్ల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. నా మీద ఒకేసారి వివిధ జిల్లాలో కేసులు నమోదవటం అనేది ఏదో కుట్ర జరుగుతుందదనిపించి, అందుకే నేను ముందస్తు బెయిల్ అప్లై చేశాను. కానీ నేను వాస్తవాలు తెలియకుండా ఒక వ్యక్తినీ లేక ఒక గ్రూప్‌నీ నిందించటం లేదు. కానీ వెనుక ఏదో జరుగుతుందని మాత్రం అర్థం అవుతోంది. నేను చట్టాన్ని గౌరవిస్తాను. అలాగే ప్రభుత్వ సంస్థల నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తాను. కాని దానితో పాటు రాజ్యాంగ పరిధిలో నాకు చట్టం కల్పించిన సదుపాయాలను ఉపయోగించుకునే ప్రాథమిక హక్కు కూడా వినియోగించుకుంటాను.' అని పేర్కొన్నారు.