RCB vs PBKS Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం | ABP Desam
పాయింట్ల పట్టికలో మూడు నాలుగు స్థానాల్లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకి, పంజాబ్ కింగ్స్ కి మ్యాచ్ అనగానే అందరి ఆలోచనా ఒకటే..ఇవాళ గెలిచి పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానానికి వెళ్లేది ఎవరు అని. కానీ వర్షం ఊహించని రీతిలో బెంగుళూరు చిన్న స్వామి స్టేడియాన్ని ముంచెత్తటంతో చాలా ఆలస్యంగా మొదలైన మ్యాచ్ అయితే మంచి లో స్కోర్ థ్రిల్లర్ ను తలపించి చివరగా పంజాబే విజయం దక్కించుకున్న ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. చిన్న స్వామిలో పెద్ద వర్షం
వర్షం కారణంగా బెంగుళూరు చిన్న స్వామి స్టేడియంలో మ్యాచ్ దాదాపుగా రెండు గంటలకు పైగా ఆలస్యమైంది. 7.30 నిమిషాలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ లో 9.45 కి టాస్ పడింది. టాస్ గెలిచిన పంజాబ్ ఆర్సీబీని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. వర్షం కారణంగా రెండు గంటల ఆట తుడిచిపెట్టుకోవటంో చెరో టీమ్ కి 20 ఓవర్లు ఆడటానికి బదులుగా 14 ఓవర్లు మాత్రమే కేటాయించారు.
2. సెల్ ఫోన్ నెంబర్ల ఆర్సీబీ
పంజాబ్ బౌలర్ల ధాటికి ఆర్సీబీ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. పటీదార్, టిమ్ డేవిడ్ తప్ప ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కొహ్లీ తో మొదలు పెడితే..ఏ ఒక్క బ్యాటర్ కూడా కనీసం డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయాడు. ముందు పిల్ సాల్ట్, విరాట్ కొహ్లీలను అర్ష్ దీప్ సింగ్ పెవిలియన్ కు పంపిస్తే...బార్ట్ లెట్ లివింగ్ స్టన్ ను అవుట్ చేసి... 4ఓవర్ల పవర్ ప్లేలో 26 పరుగులకే ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయేలా చేశాడు. పోనీ పవర్ ప్లే తర్వాత ఏమన్నా ఇరగదీస్తారు అనుకుంటే మరింత దారుణం..ముందు పటీదార్ కి సపోర్ట్ ఇచ్చేవాళ్లు లేరు..తర్వాత టిమ్ డేవిడ్ కోసం ఎవరూ నిలబడలేదు. జితేశ్, కృనాల్, ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన మనోజ్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.
3. టిమ్ డేవిడ్ ఒంటరి పోరాటం
ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ రజత్ పటీదార్ మినహా అందరూ చెతులెత్తేసిన ఆర్సీబీని మళ్లీ 49 పరుగుల్లోపు ఆలౌట్ కాకుండా పరువు కాపాడటమే కాదు స్కోరు బోర్డును కాస్త పరుగులు పెట్టించాడు టిమ్ డేవిడ్. 26 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతో సరిగ్గా 50 పరుగులు చేశాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ లో కేవలం 4 సిక్సులు మాత్రమే నమోదు కాగా రజత్ 1 కొడితే..టిమ్ డేవిడ్ 3 సిక్సులు కొట్టాడు. ఫలితంగా నిర్ణీత 14 ఓవర్లలో ఆర్సీబీ 9 వికెట్ల నష్టానికి 95 పరుగులైనా చేయగలిగింది.
4. ఊగిసలాడిన పంజాబ్
96 పరుగుల టార్గెటే కదా ఈజీగా పంజాబ్ కొట్టేస్తుంది అనుకోవటానికి లేదు. ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య వికెట్లను పవర్ ప్లేలోనే తీసేశారు ఆర్సీ బీ బౌలర్లు. ప్రధానంగా హేజిల్ వుడ్ బౌలింగ్ ను ఆడటానికి పంజాబ్ బ్యాటర్లు చాలా ఇబ్బందులు పడ్డారు. పవర్ ప్లేలో ఆర్యను హేజిల్ వుడ్, ప్రభ్ సిమ్రన్ భువనేశ్వర్ అవుట్ చేశారు. పవర్ ప్లే తర్వాత మరింత ప్రమాదకరంగా మారిన హేజిల్ వుడ్ వరుస బంతుల్లో శ్రేయస్ అయ్యర్, జోష్ ఇంగ్లీష్ లను అవుట్ చేయటంతో పంజాబ్ కాస్త కంగారు పడిపోయింది.
5. ఫినిషర్ నేహల్ వధీరా
రాగానే సూయాష్ శర్మ బౌలింగ్ లో ఆడటానికి ఇబ్బంది పడినట్లు కనిపించిన వధీరా ఒక్కసారిగా గేర్లు మార్చేశాడు. 19 బాల్స్ లో 3 ఫోర్లు, 3 సిక్సులు బాది 33 పరుగులు చేయటంతో పంజాబ్ ఈ లో స్కోర్ థ్రిల్లర్ లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మొత్తంగా వరుణుడితో పాటు ఆర్సీబీని ఓ ఆటాడుకున్న పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో 2వస్థానానికి చేరుకోగా….ఆర్సీబీ నాలుగో స్థానానికి పడిపోయింది.





















