IPL 2025 PBKS VS RCB Result Update: పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి మరో ఓటమి
టోర్నీలో దూకుడు మీదున్న పంజాబ్ మరో విజయాన్ని నమోదు చేసింది. ఐదో విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఇక సొంతగడ్డపై మరోసారి విఫలమైన ఆర్సీబీ, 3వ ఓటమిని మూటగట్టుకుంది.

IPL 2025 PBKS 5th Win: పంజాబ్ కింగ్స్ పాంచ్ పటాకా నమోదు చేసింది. ఈ సీజన్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్న ఈ జట్టు ఐదో విజయాన్ని సాధించింది. శుక్రవారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్షంతో కుదించిన 14 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 95 పరుగులు చేసింది. విధ్వంసక బ్యాటర్ టిమ్ డేవిడ్ (26 బంతుల్లో 50 నాటౌట్, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ ఫిఫ్టీతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో అర్షదీప్ సింగ్, మార్కో యన్సెన్, యజ్వేంద్ర చాహల్, హర్ ప్రీత్ బ్రార్ కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనను పంజాబ్ కింగ్స్ 12.1 ఓవర్లలో 5 వికెట్లకు 98 పరుగులు చేసి, పూర్తి చేసింది. నేహాల్ వధేరా (19 బంతుల్లో 33 నాటౌట్, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలకదశలో ధాటిగా జట్టును విజయ తీరాలకు చేర్చాడు. జోష్ హేజిల్ వుడ్ కు మూడు వికెట్లు దక్కాయి. ఇక సొంతగడ్డపై ఆర్సీబీకి ఇది మూడో ఓటమి కావడం విశేషం. ఆ జట్టు సాధించిన నాలుగు విజయాలు పరాయి గడ్డపై సాధించినవే కావడం గమనార్హం. సొంతగడ్డపై ఇప్పటివరకు ఖాతా తెరవలేదు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ రెండో స్థానానికి ఎగబాకింది.
దయనీయ స్థితిలో ఆర్సీబీ..
ఈ సీజన్ లో సొంతగడ్డపై తడబడుతున్న ఆర్సీబీ.. ఈ మ్యాచ్ లో నూ ఆ బలహీనతను కనబర్చింది. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. తన ఫియర్లెస్ బ్యాటింగ్ పవర్ ను ప్రదర్శించలేకపోయింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఫోర్ తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆర్సీబీ.. ఆ జోష్ ను కొనసాగించలేకపోయింది. ఆరంభంలోనే ఫిల్ సాల్ట్ (4), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (1) వికెట్లను కోల్పోయింది. ఈ దశలో రజత్ పతిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ (18 బంతుల్లో 23, 1 ఫోర్, 1 సిక్సర్)తో కాస్త సహనాన్ని ప్రదర్శించినా, మిగతా బ్యాటర్లు వికెట్లు పారేసుకున్నారు. లియామ్ లివింగ్ స్టన్ (4), జితేశ్ శర్మ (2), క్రునాల్ పాండ్యా (1) వికెట్లను కోల్పోవడంతో 41 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లివింగ్ స్టన్ ను సబ్ స్టిట్యూట్ చేసి, మనోజ్ భాండగే (1)ను ఇంపాక్ట్ సబ్ గా జట్టులోకి తీసుకున్నా ఫలితం లేకపోయింది. తను ఔట్ కావడంతో ఓ దశలో 42/7 తో నిలిచి, లీగ్ లో తామే నమోదు చేసిన అత్యల్ప స్కోరును అధిగమిస్తుందా..? లేదా అనిపించింది. అయితే ఈ దశలో భువనేశ్వర్ కుమార్ (8) తో , జోష్ హేజిల్ వుడ్ లతో కలిసి డేవిడ్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఎక్కువ భాగం స్ట్రైక్ తానే తీసుకున్నాడు. ఇక ఆఖరి ఓవర్లో విశ్వరూపం ప్రదర్శించి మూడు సిక్సర్లు బాది, ఆఖరు బంతికి ఫిఫ్టీని డేవిడ్ పూర్తి చేసుకున్నాడు.
Maiden #TATAIPL FIFTY 🔥
— IndianPremierLeague (@IPL) April 18, 2025
Tim David's explosive 50* (26) gives #RCB a strong finish 💪
🔽 Watch | #RCBvPBKS
Marco Jansen turned up the heat with a fiery spell of 2/11 🔥
— IndianPremierLeague (@IPL) April 18, 2025
🔽 Watch | #TATAIPL | #RCBvPBKS
వధేరా సూపర్ బ్యాటింగ్..
ఓ మాదిరి టార్గెట్ తోనే బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కు ఓపెనర్లు శుభారంభాన్నే ఇచ్చారు. ముఖ్యంగా ప్రభు సిమ్రాన్ సింగ్ (9 బంతుల్లో 13, 2 ఫోర్లు) వేగంగా ఆడే ప్రయత్నం చేసి ఔటయ్యాడు. దీంతో 22 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కాసేపటికే ప్రియాంశ్ ఆర్య (16) కూడా వెనుదిరిగాడు. ఈ దశలో జోష్ ఇంగ్లీస్ (14), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (7) 20 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇంగ్లీస్ రెండు బౌండరాలతో కాస్త టచ్ లో కన్పించాడు. అయితే రెండు బంతుల తేడాతో వీరిద్దరూ ఔట్ కావడంతో పంజాబ్ కాస్త కష్టంలో పడింది. ఈ దశలో నేహాల్ వధేరా , శశాంక్ సింగ్ (1) తో కలిసి జట్టును ఆదుకున్నాడు. సుయాశ్ బౌలింగ్ లో ఫోర్, సిక్సర్ కొట్టిన వధేరా.. ఒత్తిడిని తగ్గించాడు. ఆ తర్వాత మరింత ధాటిగా ఆడిన వధేరా.. ఛేజింగ్ ను ఈజీగా చేశాడు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 28 పరుగులు జోడించి, టార్గెట్ ఛేజింగ్ ను ఈజీ చేశారు. ఇందులో సింహభాగం పరుగులు వధేరానే సాధించడం విశేషం. చివర్లో మార్కస్ స్టొయినిస్ (7 నాటౌట్) సిక్సర్ తో మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. మిగతా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ కు రెండు వికెట్లు దక్కాయి.




















