Railway Kavach: ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా రెండు రైళ్లు, ఒక దాంట్లో రైల్వే మంత్రి చివరకు ఏమైందంటే?
Railway Kavach: ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా వస్తున్న రైళ్లను నిలిపివేసేందుకు కవచ్ సాంకేతికతను అభివృద్ధి చేసింది రైల్వే శాఖ. కవచ్ పనితీరును రైల్వే మంత్రి ఇవాళ స్వయంగా పరీక్షించారు.
Railway Kavach: దక్షిణ మధ్య రైల్వే కవచ్(Kavach) సాంకేతికతను శుక్రవారం ప్రయోగాత్మకంగా ప్రయోగించింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw) కవచ్ పనితీరును స్వయంగా పరీక్షించారు. ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా అత్యధిక వేగంతో దూసుకొచ్చిన రైళ్లు(Trains) కవచ్ సాంకేతికతతో నిలిపివేశారు. దక్షిణ మధ్య రైల్వే)(South Central Railway) జోన్ సికింద్రాబాద్ డివిజన్‌లో శుక్రవారం ఒకే రైల్వే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొట్టుకోకుండా ఆగిపోయాయి. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన రక్షణ వ్యవస్థ కవచ్ వల్ల ఇది సాధ్యమైందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైళ్లలో కవచ్ పనితీరును రైల్వే మంత్రి(Railway Minsiter) అశ్వినీ వైష్ణవ్ స్వయంగా పరీక్షించారు. ఒక రైలులో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మరో రైల్లో రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవో వినయ్ కుమార్ త్రిపాఠి ఎదురెదురుగా ప్రయాణించారు.
भारत में बना - भारत का कवच।#BharatKaKavach pic.twitter.com/gGQRfFKNCM
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) March 4, 2022
ఎదురెదురుగా రైళ్లు
రెండు రైళ్లు లింగంపల్లి-వికారాబాద్(Lingampalli-Vikarabad) సెక్షన్‌లో ఎదురుదెరుగా ప్రయాణించాయి. ఈ రెండు రైళ్లు 380 మీటర్ల దూరం ఉన్నప్పుడు కవచ్ ప్రమాదాన్ని గుర్తించి రైళ్లను నిలిపివేసింది. వెంటనే ఆటోమెటిక్ బ్రేకులు పడి రైళ్లు నిలిచిపోయాయి. వంతెనలు, మలుపులు ఉన్నచోట కవచ్ రైలు వేగాన్ని 30 కిలోమీటర్లకు మించకుండా ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేస్తుందని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలను రైల్వే మంత్రి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
आत्मनिर्भर भारत की मिसाल- भारत में बनी 'कवच' टेक्नोलॉजी।
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) March 4, 2022
Successfully tested head-on collision. #BharatKaKavach pic.twitter.com/w66hMw4d5u
కవచ్ సాంకేతికత
రైలు ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ సాంకేతికత అభివృద్ధి చేస్తుంది. రైళ్లలో భద్రత, సామర్థ్యం పెంపునకు స్వదేశీ టెక్నాలజీతో కవచ్ ను అభివృద్ధి చేసింది. కవచ్ పరిధిలోకి 2,000 కి.మీ.ల మేర రైల్వే నెట్‌వర్క్‌ను తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ టెక్నాలజీతో 10 వేల ఏళ్లలో ఒక పొరపాటు మాత్రమే జరిగే అవకాశముందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. సున్నా ప్రమాదాలే లక్ష్యంగా ఈ సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రెడ్ సిగ్నల్‌ను చూడకుండా లోకో పైలట్ రైలును ముందుకు తీసుకెళ్లినప్పుడు కవచ్ వ్యవస్థతో ఆటోమెటిక్ గా బ్రేకులు పడతాయని తెలిపారు. పట్టాలు బాగా లేనప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు ఎదురెదురుగా రైళ్లు వస్తున్నప్పుడు కవచ్ గుర్తిస్తుందన్నారు. వంతెనలు, మలుపులు ఉన్నచోట వేగాన్ని అదుపుచేసేలా కవచ్ స్పందిస్తుందన్నారు.