Revanth Reddy: తెలంగాణలో ఫార్మా గ్లాస్ ట్యూబ్ ల తయారీ కేంద్రం, కార్నింగ్ కంపెనీతో సీఎం రేవంత్ ఒప్పందం
Telangana News | మరో ప్రముఖ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో కార్నింగ్ ఇన్‌కార్పొరేటేడ్ గ్లాస్ ట్యూబ్ కేంద్రంపై సంతకాలు చేసింది.
Pharma glass tube manufacturing unit in Telangana | హైదరాబాద్: మెటీరియల్ సైన్స్ రంగంలో ప్రసిద్ధి చెందిన “కార్నింగ్ ఇన్‌కార్పొరేటేడ్” కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకొచ్చింది. వివిధ కంపెనీలతో భాగస్వామిగా నూతన సాంకేతిక ఆవిష్కరణలను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో బుధవారం నాడు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ఎమర్జింగ్ ఇన్నొవేషన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోనాల్డ్ వెర్క్‌క్లీరెన్ అధ్వర్యంలోని కార్నింగ్ ప్రతినిధుల బృందంతో చర్చించారు. చర్చల అనంతరం ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఏర్పాటుపై అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగాలలో అత్యాధునిక పరిశోధన, అభివృద్ది కేంద్రంగా తెలంగాణ (Telangana)ను తీర్చిదిద్దడంతో కార్నింగ్ భాగస్వామిగా పనిచేయనుంది. తెలంగాణలో ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబ్ (Pharma glass tube manufacturing unit) తయారీ కేంద్రం స్థాపించడంపై చర్చలు జరిగాయి. 2025 నుంచి ఇందులో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమిస్తామని కంపెనీ ప్రతినిధులు ఈ సందర్భంగా ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ యూనివర్సిటీ (Hyderabad University) సహకారంతో డాక్టర్ రెడ్డీస్ లిమిటెడ్, లారస్ ఫార్మా లిమిటెడ్ నిర్వహిస్తున్న ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ (Flow chemistry Technology) హబ్‌లోనూ కార్నింగ్ కంపెనీ భాగస్వామిగా మారనుంది. ఫార్మాస్యూటికల్ తో పాటు కెమికల్ పరిశ్రమలలో ఆవిష్కరణలతో పాటు ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ (FCT)లో ఈ కంపెనీ తగిన సహకారం అందించడానికి నిర్ణయం తీసుకుంది.
కొత్తగా అందుబాటులోకి తెస్తున్న అడ్వాన్స్‌డ్ ఫ్లో రియాక్టర్స్ టెక్నాలజీని కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధుల బృందానికి వివరించారు. ఈ అత్యాధునిక గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం (Glass tube manufacturing unit) ఫార్మా రంగం అభివృద్ధికి దోహదం చేయనుంది. మెడిసిన్ ప్యాకేజింగ్ పరిశ్రమలో ఈ గ్లాస్ ట్యూబ్‌లను వినియోగిస్తారు. వీటి తయారీకి వినూత్నమైన వెలాసిటీ గ్లాస్- కోటింగ్ టెక్నాలజీని కార్నింగ్ కంపెనీ వినియోగిస్తోంది. ఈ కొత్త తయారీ కేంద్రం ఏర్పాటుతో తెలంగాణలో ఇప్పటికే వేగంగా విస్తరిస్తున్న ఫార్మాస్యూటికల్ రంగంలో ఉత్పాదకత సామర్థ్యం మరింత పెరుగుతుందని రాష్ట్ర ప్రతినిధుల బృందం అభిప్రాయపడుతోంది.