Suryapet News: సర్పంచ్ హత్య కేసులో దోషులకు జీవిత ఖైదు విధించిన సూర్యాపేట కోర్టు
Lifetime imprisonment : సర్పంచ్ హత్య కేసులో దోషులకు జీవిత ఖైదు విధించింది సూర్యాపేట జిల్లా కోర్టు.
Lifetime imprisonment :
సూర్యాపేట జిల్లా... సర్పంచ్ హత్య కేసులో దోషులకు జీవిత ఖైదు విధించింది కోర్టు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహులగూడెం గ్రామ సర్పంచ్ (సీపీఎం పార్టీ) పులిందర్ రెడ్డి హత్య కేసులో ఆరుగురు హంతకులకు కోర్టు జీవిత ఖైదు విధించింది.
నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవన్న జిల్లా ఎస్పీ
సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెం గ్రామ సర్పంచ్ జూలకంటి పులిందర్ రెడ్డి హత్య కేసులో తొమ్మిదిన్నర ఏళ్ల తరువాత దోషులకు శిక్ష పడింది. సూర్యాపేట జిల్లా కోర్టు శుక్రవారం తుది తీర్పు వెల్లడించింది. 2014 జనవరి 30న కోదాడ బైపాస్ రోడ్డు లో సర్పంచ్ జూలకంటి పులిందర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. బాధితుడి భార్య, బంధువుల ఫిర్యాదు మేరకు అప్పటి దర్యాప్తు అధికారి ఐపీఎస్ సెక్షన్లు 28/2014 U/s, 147,148,120 (B), 153 (A)_, 302, 307, 201 R/w 149 కింద, Sec 7 (l) క్రిమినల్ అమెండ్ మెంట్ యాక్ట్ 1932 ప్రకారం కేసు నమోదు చేశారు.
అప్పట్లోనే ఈ కేసుకు సంబంధించి 9 మందిని రిమాండ్ కు పంపించారు. కేసు దర్యాప్తు లో బాగంగా 31 మంది సాక్షులను, బాధితులను, నిందితులను విచారించిన జిల్లా కోర్టు ఆరుగురు నేరస్తులను గుర్తించింది. వీరు హత్యకు కారకులని, నేరానికి పాల్పడ్డారని నిర్ధారించి.. సూర్యాపేట జిల్లా ప్రిన్సిపల్స్ సెషన్స్ జిల్లా కోర్టు న్యాయమూర్తి జి.రాజగోపాల్ దోషులకు యావజ్జీవ కారాగార శిక్షను విధించారు. ఇన్నేళ్ల తరువాత ఈరోజు తీర్పు వచ్చిందని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ కేసు విచారణలో ఉండగానే జలీల్ అనే నిందితుడు మృతి చెందాడు. దాంతో మిగతా ఐదుగురు నేరస్తుల (1. షేక్ షబ్బీర్, 2. కొప్పుల లక్ష్మీనారాయణ, 3 షేక్ ఇబ్రహీం, 4. మాతంగి శ్రీను, 5. ధూళిపాల నరేందర్)ను జైలుకు తరలిస్తున్నామని ఎస్పీ తెలిపారు.
రాష్ట్ర పోలీస్ శాఖలో అమలు అవుతున్న కోర్టు డ్యూటీ విభాగం జిల్లా పోలీస్ శాఖలో సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని ఎస్పీ చెప్పారు. కోర్టు డ్యూటీ పని విభాగం వర్టికల్ లో ఎప్పటికప్పుడు సిబ్బందికి శిక్షణ ఇస్తూ వారి పనిలో సామర్ధ్యాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. కోర్టులలో సమన్వయంగా పని చేయడం, కేసుల్లో శిక్షల శాతం పెరిగేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర డీజీపీ అధ్వర్యంలో కోర్టు డ్యూటీ పని విభాగాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం అన్నారు.
ఈ సందర్భంగా బాధితుల పక్షాన కేసు వాదించిన పీపీ శ్రీవాణిని కోదాడ డీఎస్పీ ప్రకాష్ సన్మానించారు. గతంలో PP వెంకటేశ్వర్లుని, కేసు పర్యవేక్షణ చేసిన డీఎస్పీ ప్రకాష్, ఇన్స్ పెక్టర్ రాము, కోర్టు డ్యూటీ అధికారి హెడ్ కానిస్టేబుల్ వెంకట రమణ, లైజన్ ఆఫీసర్ ఏఎస్ఐ సురేంద్ర బాబు లను ఎస్పీ అభినందించారు. మరోవైపు కోర్టు తీర్పు ఇవ్వనున్న సందర్బంగా నర్సింహుల గూడెం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలు మోహరించాయి. తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష పడుతుందని, ఎవరూ తప్పించుకోలేరని ఎస్పీ అన్నారు. కనుక హత్యలు, దొంగతనాలు, దోపిడీలు చేయకుండా మంచి పనులు చేయాలని ప్రజలకు సూచించారు.