Renuka Chowdary: సీఎం నోరు మెదపరా? రేణుకా చౌదరి ఆగ్రహం - ‘ఎమ్మెల్యే రఘునందన్‌పై కేసు సమంజసమే’
Renuka Chowdary Comments: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు కావడాన్ని తాను స్వాగతిస్తున్నట్లుగా రేణుకా చౌదరి వెల్లడించారు.
తెలంగాణలో యువతులపై నేరాలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయిలపై ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువ అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కరవు అయిందని ఆరోపించారు. ఒక్క హైదరాబాద్‌లో ముగ్గురు మైనర్లు అయిన బాలికలపై అత్యాచారాలు జరిగితే షీ టీమ్స్ ఏం చేస్తున్నాయని రేణుకా చౌదరి నిలదీశారు. మరోవైపు, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు కావడాన్ని తాను స్వాగతిస్తున్నట్లుగా రేణుకా చౌదరి వెల్లడించారు. మైనర్ బాలిక వివరాలను ఎమ్మెల్యే రఘునందన్ బహిరంగంగా ప్రకటించడం తప్పు అని చెప్పారు.
‘‘రాష్ట్రంలో కొత్తగా మరో ముగ్గురు బాలికలపై అత్యాచారం జరిగింది. పోలీసుల లెక్కలు చూస్తేనే మహిళలపై రేప్ కేసులు పెరిగిపోయాయి. బంగారు తెలంగాణ అంటే ఇదేనా? పసి పిల్లలకు కూడా తెలంగాణలో రక్షణ లేదు. జూబ్లీహిల్స్ కేసులో అధికార పార్టీ నేతల పిల్లలు ఉన్నారు కాబట్టే.. ఈ కేసును నీరు గారుస్తున్నారు. ఈ రేప్ కేసు ఘటనపై సీఎం కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదు? హోం మంత్రి మనవడిపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయన పదవికి రాజీనామా చేయాల్సిందే.
వేల కేసులు నమోదయితే, 46 కేసులలో మాత్రమే దోషులకు శిక్ష పడింది. మైనర్ బాలిక వీడియోను బయట పెట్టిన ఎమ్మెల్యే రఘునందన్ రావు దోషే. ఆయనపై కేసు నమోదు చేయడాన్ని నేను సమర్థిస్తున్నాను. రఘునందన్ రావు ఇన్నోవా కారు వీడియో ఎందుకు బయటపెట్టలేదు. రఘునంధన్ రావు సిగ్గుమాలిన ఆరోపణలు చేస్తున్నారు.
‘‘పబ్ లో కాంగ్రెస్ నేతల పిల్లలు ఉన్నారని అంటున్నారు. ఉంటే రఘునందన్ రావు బయట పెట్టాలి. జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచార కేసు అసలు వదిలే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపడం లేదు. తెలంగాణ షీ టీమ్స్ ఏమైయ్యాయి.’’
సిగ్గుపడేలా బీజేపీ ప్రవర్తన - రేణుకా చౌదరి
‘‘హైదరాబాద్ నగరంలో రక్షణ లేకుండా ఇలాంటి నేరాలు జరుగుతూ ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? బీజేపీ విషయంలో టీఆర్ఎస్ యూ టర్న్ తీసుకుంది. బీజేపీ, టీఆర్ఎస్ తోడుదొంగలు, అవి రెండూ కవల పిల్లల లాంటివి. రాష్ట్రంలో పబ్బుల కల్చర్ పెరిగింది. లైసెన్స్ లు ఇస్తుంది.. ఎక్సైజ్ శాఖ కాదా..? బీజేపీ నాయకులు మరో మతాన్ని కించరపరచడం ఏ మాత్రం సరైంది కాదు. అసలు సనాతన ధర్మం బీజేపీకి తెలుసా? ప్రపంచం ముందు సిగ్గుపడేలా బీజేపీ నేతల వ్యవహారం ఉంది.’’ అంటూ రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.