Rythu Runa Mafi: రుణమాఫీ నిబంధనలే రైతులకు ఉరితాడు, సగం మందిని మాఫీ చేసే కుట్ర: ఈటల రాజేందర్
Crop Loan Waiver in Telangana | రైతుల కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని, రైతుబంధు మార్గదర్శకాలు అన్నదాతలకు ఉరితాడుగా మారుతున్నాయని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Etela Rajender About Rythu Runa Mafi Guidelines | హైదరాబాద్: తెలంగాణలో రైతుల రుణమాఫీ అంశంపై రాజకీయాలు జరుగుతున్నాయి. రైతులకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంటే, రుణమాఫీ మార్గదర్శకాలు లబ్దిదారులను తగ్గిస్తాయని, సగం మంది రైతులకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్ష బీఆర్ఎస్ తో పాటు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రైతు రుణమాఫీ నిబంధనలు రైతులపాలిట ఉరితాడుగా మారతాయంటూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్ నేతలు అడ్డగోలు హామీలు ఇచ్చారన్నారు.
కేసీఆర్‌ను ఓడించేందుకు అడ్డగోలుగా హామీలు
‘ఎన్నికల సమయంలో బహిరంగ సభల్లో కిసాన్, యువ, దళిత పాలసీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రూ.2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీకి 6 పేజీల నిబంధనలు (రుణమాఫీ మార్గదర్శకాలు) రూపొందించింది. రుణమాఫీ జరగాలంటే తెల్లరేషన్ కార్డు తప్పనిసరి చేస్తూ నిబంధన పెట్టారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మరోసారి మోసగించింది.
పదేళ్లుగా తెల్లరేషన్ కార్డులు జారీ చేయలేదు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పదేళ్ల నుంచి తెల్లరేషన్ కార్డులు మంజూరు చేయలేదు. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, రేషన్‌కార్డు దరఖాస్తులు తీసుకొని 7 నెలలయినా ఒక్కరికీ కూడా మంజూరు చేయలేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో విశ్వసనీయత లేని నేత అంటూ కేసీఆర్‌ను సీఎం పీఠానికి దూరం చేశారు. కానీ తనకు ఐదేళ్ల అధికారం ఉందని, ఏమైనా చేయవచ్చు అన్నట్లు రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నారు. రైతుల పక్షాన నిలిచింది బీజేపీ. అందుకే మద్దతు ధరలను ఎన్డీఏ ప్రభుత్వం రెట్టింపు చేసింది. మేం నిబంధనలు ప్రకారం దేశవ్యాప్తంగా కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తున్నాం. కానీ కాంగ్రెస్ రేషన్ కార్డ్ తప్పనిసరి లాంటి నిబంధనలు, ఇంటికి రూ.2 లక్షల రుణమాఫీ అంటూ సగం మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతుందని’ ఈటల రాజేందర్ ఆరోపించారు.
ఆకలిని భరిస్తారు, కానీ అవమానాల్ని కాదు
‘రైతులకు కిసాన్ సమ్మాన్ నిధితో ప్రయోజనం చేకూర్చాం. కానీ తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీకి ఆరు పేజీల నియమ నిబంధనల అవసరం ఏముంది. ఏ కండీషన్ లేకుండా అర్హులైన అందరికీ రుణాలు మాఫీ చేయాలి. నిజాలు చెబితే ప్రజలు నమ్మరని, వాళ్లు నిజాలు నమ్మాలనుకోవడం లేదని రేవంత్ రెడ్డి చెప్పిన మాటల క్లిప్ ప్రదర్శించారు. రాజకీయ పార్టీలు, నేతలు ప్రజల్ని మోసం చేయాలని చూస్తారట. కానీ కేసీఆర్ లాంటి నేతను గద్దె దింపడానికి ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారు. అంతే కానీ హస్తం పార్టీపై ప్రేమతో కాదు. నాకు తెలిసి తెలంగాణ ప్రజలు ఆకలిని భరిస్తారు. కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. ధర్మం తాత్కాలికంగా ఓడిపోవచ్చు. నీతి, నిజాయితీనే వాళ్లు కోరుకుంటారు. మోసపూరిత హామీలు నమ్మి కాంగ్రెస కు ఓట్లు వేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడటం ఖాయమని’ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
Also Read: తెలంగాణలో రేషన్ కార్డు లేకుండానే ఆరోగ్యశ్రీ సేవలు- రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

