Janwada Drugs Party: కేటీఆర్ పాస్ పోర్ట్ సీజ్ చేయాలి, డ్రగ్స్ కేసుతో విదేశాలకు పారిపోయే ఛాన్స్ - బండి సంజయ్ సంచలన ఆరోపణలు
Bandi sanjay News | కాంగ్రెస్ ప్రభుత్వం రేవ్ పార్టీ’ కేసును లిక్కర్ కేసుగా నీరు గారుస్తోందని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మరోసారి నిరూపితమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Janwada Drugs Party News | హైదరాబాద్: బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య దోస్తీ జన్వాడ ఫాం హౌస్ రేవ్ పార్టీ కేసుతో మరోసారి నిరూపితమైందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్థి ఫాంహౌజ్ ‘రేవ్ పార్టీ’ కేసు నీరుగార్చే కుట్ర మొదలైందని సంచలన ఆరోపణలు చేశారు. రేవ్ పార్టీలో కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారని మీడియాలో ఫొటోలు, వీడియోలు ప్రసారం అవుతున్నా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకవోడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కేటీఆర్ తో పాటు పార్టీకి హాజరైన ఆయన కుటుంబసభ్యులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
'రేవ్ పార్టీలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని పోలీసులతో చెప్పించేలా కాంగ్రెస్ నుండి ఒత్తిడి మొదలైంది. ఇంకా చెప్పాలంటే అది రేవ్ పార్టీయే కాదు కేవలం లిక్కర్ పార్టీ అని బుకాయించేందుకు సిద్ధమయ్యారు. రేవ్ పార్టీ పంచనామాలోనే డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా కుట్ర చేశారు. విదేశీ మద్యం బాటిళ్ల పేర్లను మాత్రమే కేసుల్లో ప్రస్తావించినట్లు తెలిసింది. కేటీఆర్, ఆయన కుటుంబసభ్యులు ఆ పార్టీకి హాజరైనట్లు ఫోటోలతో సహా టీవీల్లో వస్తున్నా విచారణ ఎందుకు జరపడం లేదు?. కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులను ఈ కేసు నుంచి తప్పించి అనామకుల పేర్లను చేర్చే కుట్ర మొదలైంది. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ఇచ్చే దివాళీ గిఫ్ట్ ఇదే. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అని మరోసారి నిరూపితమైంది.
ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, డ్రగ్స్, గొర్రెల స్కాం మాదిరిగానే ‘రేవ్ పార్టీ’ కేసును లిక్కర్ కేసుగా నీరు గారుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ సర్కార్ కు దమ్ముంటే రేవ్ పార్టీలో పాల్గొన్న 35 మంది పేర్లు బయటపెట్టాలి. సీసీ పుటేజీలు, టవర్ లోకేషన్స్ గుర్తింపు ఆధారాలను ప్రజల ముందు ఉంచి చిత్తశుద్ధి చాటుకోవాలి. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న వాళ్లు కూడా ఈ పార్టీలో ఉన్నట్లు తెలిసిందని' బండి సంజయ్ అన్నారు.
సీఎం వద్దే హోంశాఖ ఎందుకు సమగ్ర విచారణ జరపడం లేదు? పోలీసులు కావాలనే కేటీఆర్, ఆయన ఫ్యామిలీని కేసు నుంచి తప్పించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని ఇన్నాళ్లు బీజేపీ చెప్పేది నిజమేనని మరోసారి రుజువైంది. మాజీ సీఎం కేసీఆర్ తో ఉన్న దోస్తీ వల్లే కేటీఆర్ ను వదిలేశారా?. డ్రగ్స్ రహిత రాష్ట్రమంటే కేటీఆర్ కుటుంబ సభ్యులను తప్పించడమేనా? తెలంగాణలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతాం అని ప్రభుత్వ ప్రకటనలన్నీ డొల్లేనా? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అక్కడున్న టవర్ లొకేషన్స్ ను గుర్తించాలి. కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పాస్ పోర్టులను సీజ్ చేయాలి. లేకపోతే విదేశాలకు పారిపోయే ప్రమాదముంది. సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ విషయంలో ఉక్కు పాదం మోపాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు.