Kavita Remand Report : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితే కీలకం - ఈడీ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
Telangana : ఈడీ రిమాండ్ రిపోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై కీలక విషయాలు వెల్లడించారు. స్కాంలో ఆమె కీలక పాత్ర పోషించిందన్నారు.
ED Remand report : లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీకి ఇచ్చింది హౌస్ అవెన్యూ కోర్టు. రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు పలు కీలక అంశాలను పొందుపర్చారు. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి అని, ప్రధాన కుట్రదారు అని పేర్కొన్నారు. ‘ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రధాన సూత్రధారుల్లో కవిత ఒకరు. స్కామ్‌లో కవిత కుట్రదారు, లబ్ధిదారు. శరత్‌రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మాగుంటతో కలిసి ఆప్ నేతలకు రూ. 100 కోట్లు లంచం ఇచ్చారు. మార్జిన్ మనీని 12శాతానికి పెంచి.. అందులో సగం ముడుపుల రూపంలో చెల్లించారు. లిక్కర్ కేసు జాప్యం చేయడానికి తప్పుడు కేసులు దాఖలు చేశారు. సమ్మన్లు జారీచేసిన తర్వాత 4 ఫోన్ల డేటాను ఫార్మాట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితనే కీలక వ్యక్తి. కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నిబంధనలు తనకు అనుకూలంగా ఉండేలా చూసుకోగలిగారు. అరుణ్ పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో కవిత వాటా పొందారు. ఢిల్లీ లిక్కర్ బిజినెస్ కోసం కవిత తనను సంప్రదించారని.. కేజ్రీవాల్ తనతో చెప్పినట్లు మాగుంట స్టేట్‌మెంట్ ఇచ్చారు’ అని కస్టడీ రిపోర్టులో ఈడీ పేర్కొంది.‘కవిత టీం లిక్కర్ బిజినెస్‌లో ప్రవేశించేందుకు చూస్తున్నందున ఆమెతో కలిసి ముందుకు వెళ్లాలని కేజ్రీవాల్ సూచించినట్లు.. మాగుంట చెప్పారు. హైదరాబాద్‌లో కవితతో భేటీలో ఆప్ నేతలకు రూ.100 కోట్లు ఇవ్వాలి.. వెంటనే రూ.50 కోట్లు ఇవ్వాలని కవిత చెప్పారని మాగుంట స్టేట్‌మెంట్‌లో చెప్పారు.
కవిత సూచనతో రూ.25 కోట్లు రాఘవకు ఇచ్చినట్టు మాగుంట స్టేట్‌మెంట్‌లో క్లియర్ కట్‌గా చెప్పారు. రూ.25 కోట్లను అభిషేక్ బోయినపల్లి చెప్పిన అడ్రస్‌లో ఇచ్చినట్టు మాగుంట రాఘవ కూడా స్టేట్‌మెంట్ ఇచ్చారు. కవితను పిలిచి ప్రశ్నించినప్పుడు ఇండో స్పిరిట్‌లో వాటా గురించి ప్రశ్నిస్తే ఖండించారు.. కానీ మాగుంట రాఘవ, బుచ్చిబాబుల మధ్య వాట్సాప్ చాట్‌లో కవిత కు 33% వాటా ఉన్నట్లుగా ఉంది. రామచంద్ర పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీతో కవిత వాటా పొందారు. కవితకు రామచంద్ర పిళ్లై బినామీగా ఉన్నారు. రామచంద్ర పిళ్లై ద్వారా కవిత వ్యవహారం నడిపించింది. ఎంపీ మాగుంట ద్వారా రూ. 30 కోట్లు ఢిల్లీకి కవిత చేర్చింది. ఈ రూ.30 కోట్లను అభిషేక్ బోయిన్‌పల్లి ఢిల్లీకి తీసుకెళ్లారు. స్టేట్ మెంట్ రికార్డు చేసే సమయంలో కవిత అసంబద్ధ సమాధానాలు చెప్పారు. సాక్ష్యాలను ధ్వసం చేశారు.’ అని రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది.
మొబైల్ ఫోన్స్ విషయంలోనూ కవిత తప్పుడు సమాచారం ఇచ్చారు. కవిత ప్రకటన రికార్డ్ చేసే సమయంలో ప్రత్యేకించి అడిగిన ప్రశ్నలకు కవిత అసంబద్ధ, రాజకీయ సమాధానాలు ఇచ్చారు. సాక్షాలను కూడా కవిత ధ్వంసం చేశారని చేశారు. కవిత ఇచ్చిన మొబైల్స్‌ను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపిస్తే.. పది ఫోన్లలో కనీసం నాలుగు ఫోన్లను ఈడీ సమన్లు వచ్చిన ముందు ధ్వంసం చేశారు. విచారణలోనూ అసంబంద్ధ సమాధానాలు ఇవ్వడంతో అరెస్ట్ చేశాం’ అని కవిత రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది.