IND vs AUS Final 2023: ఫైనల్‌కు ప్రత్యేక అతిథులు- ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ఉపప్రధాని రాక
World Cup Final 2023: క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌కు కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్లు కప్పు కోసం తలపడనున్నాయి.
World Cup Final 2023: క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్, మహా సంగ్రామానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium) వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్లు కప్పు కోసం తలపడనున్నాయి. క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్-ఆస్ట్రేలియా ప్రపంచకప్ ఫైనల్(IND vs AUS Final 2023) మ్యాచ్ కోసం బీసీసీఐ(BCCI), ఐసీసీ(ICC) సంయుక్తంగా భారీస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాయి.
రోజు మొత్తం క్రికెట్ అభిమానులను అలరించేలా బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. మ్యాచ్‌కు ముందు భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం పది నిమిషాల పాటు ఎయిర్ షో ఉండనుంది. అలాగే కంపోజర్ ప్రీతమ్ ప్రదర్శనతో సహా అనేక ఈవెంట్లను బీసీసీఐ ప్లాన్ చేసింది. ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ కూడా హాజరవుతారని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కార్యాలయం తెలిపింది.
ఫైనల్ మ్యాచ్‌లో ప్రదర్శనలు
టాస్ వేసిన తరువాత ఫ్లైట్ కమాండర్, డిప్యూటీ టీమ్ లీడర్, వింగ్ కమాండర్ సిదేశ్ కార్తిక్ నేతృత్వంలోని తొమ్మిది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలతో వైమానిక ప్రదర్శన ఉంటుంది. విమానాలు అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి, నరేంద్ర మోడీ స్టేడియంపై ఆకాశంలో ఎయిర్ షో చేస్తాయి. భారత త్రివర్ణ పతాకంతో విమానాన్ని నడపాలన్న అభ్యర్థనను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తిరస్కరించింది.
మ్యాచ్‌కు ముందు ఇప్పటి వరకు ప్రపంచకప్ గెలిచిన అన్ని జట్ల కెప్టెన్లను BCCI సత్కరిస్తుంది. ఇందులో 1983లో కప్ గెలిచన కపిల్ దేవ్, 2011లో గెలిచినప్పుడు భారత జట్టుకు నాయకత్వం వహించిన మహేంద్ర సింగ్ ధోనీలను సైతం బీసీసీఐ సత్కరించనుంది. అలాగే సంగీత స్వరకర్త ప్రీతమ్, 500 కంటే ఎక్కువ మంది డ్యాన్సర్‌లతో ప్రదర్శన ఇవ్వనున్నారు. గుజరాత్ సీఎం శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భద్రత, పరిశుభ్రత, ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ప్రముఖులకు ఆహ్వానం
1975 నుంచి 2019 వరకు ప్రపంచకప్ గెలిచిన అన్ని జట్లను ఈ తుదిపోరుకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. క్లైవ్ లాయిడ్, కపిల్ దేవ్, ధోనీ, అలెన్ బోర్డర్, స్టీవ్ వా, పాంటింగ్, మైకేల్ క్లార్క్, ఇయాన్ మోర్గాన్ సహా వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్లంతా మ్యాచ్ చూసేందుకు రానున్నారు. వీరి రాకతో ఫైనల్ మరింత ఘనంగా మారిపోనుంది. వీరికోసం ప్రత్యేకమైన బ్లేజర్‌ను బీసీసీఐ తయారు చేయించింది.
1975,1979లో ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్ జట్టు నాయకుడు క్లైవ్ లాయిడ్ (live Lloyd), 1983లో తొలిసారి భారత్‌కు కప్పు అందించిన టీమిండియా కెప్టెన్ కపిల్ దేవ్(Kapi Dev), 1987లో కంగారులకు తొలిసారిగా కప్పు అందించిన అలన్ బోర్డర్(Allen Border), 1996లో కప్పు అందించిన శ్రీలంకకు చెందిన అర్జున రణతుంగ(Arjun Ranatunga), 1999లో మరోసారి ఆస్ట్రేలియాకు కప్పు అందించిన స్టీవ్ వా(Steve Waugh), 2003, 2007లో టైటిల్‌ను అందించిన రికీ పాంటింగ్(Ricky Ponting ) హాజరు కానున్నారు.
2011లో మరోసారి కప్పు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ(MS. Dhoni), 2015లో ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్(Michael Clarke), 2019లో తొలిసారి కప్పు అందించిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(Eoin Morgan) (2019) ఈ మ్యాచ్ చూసేందుకు రానున్నారు. అయితే 1992లో పాకిస్థాన్ కప్పు కైవసం చేసుంది. అప్పటి కెప్టెన్‌గా ఉన్న ఇమ్రాన్ ఖాన్(Imran Khan)కు కూడా ఆహ్వానం వెళ్లినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆయన జైల్లో ఉండడంతో హాజరయ్యే అవకాశం లేదు. ఇక ఫైనల్ మ్యాచ్ చూసే సమయంలో ఈ లెజెండరీ కెప్టెన్లంతా ఓ స్పెషల్ బ్లేజర్ ధరిస్తారని తెలుస్తోంది. అందుకోసం ఇప్పటికే బీసీసీఐ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. వీరితోపాటు అమితాబ్ బచ్చన్ (Amitab Bachchan)సహా.. ఎంతో మంది సెలబ్రెటీలు కూడా మ్యాచ్‌కు హాజరవుతారని సమాచారం.