Bhishma Niti: పాలకులు దుర్మార్గులైతే ప్రకృతి కూడా తిరుగుబాటు చేస్తుంది -భీష్ముడు చెప్పిన రాజధర్మం ఇదే!
సప్తాంగాలకు హానికలగకుండా చూసుకున్నవాడే నిజమైన పాలకుడు అని చెప్పాడు భీష్మపితామహుడు. ఎవ్వర్నీ నమ్మకపోవడం మృత్యువుతో సమానం అని అతినమ్మకం అపమృత్యువు అని రాజధర్మం బోధించాడు...
Bhishma Niti Moral Story in Mahabharat: మహాభారతంలో శాంతిపర్వం, అనుశాసనిక పర్వం భీష్ముని మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు. అష్టవసువుల్లో ఒకరిగా, శౌర్యప్రతాపంలో అసమాన ప్రతిభ కలిగిన మహానుభావుడు భీష్మాచార్యుడు. కురువృద్ధుడు, అత్యంత శక్తివంతుడు, తెలివైనవాడు అయిన భీష్మాచార్యుడు మహాభారత యుద్ధంలో నేలకొరిగినప్పటికీ..దక్షిణాయనంలో మరణించడం ఇష్టంలేక ఉత్తరాయణం కోసం అంపశయ్యపై వేచి ఉన్నాడు. తండ్రి కోసం రాజ్యాన్ని మాత్రమే కాదు.. తన సంసార సుఖాన్ని కూడా త్యాగం చేశాడు . తన సోదరులు చనిపోయిన తర్వాత కూడా...తాను భీషణమైన ప్రతిజ్ఞ చేయడానికి కారణమైన సత్యవతీదేవి స్వయంగా ఆజ్ఞాపించినా కానీ ప్రతిజ్ఞాభంగం చేయడానికి అంగీకరించలేదు. అంపశయ్యపై ఉన్నసమయంలో భీష్ముడు బోధించిన రాజధర్మం ఇప్పటికీ ఆచరణీయమే. శ్రీ కృష్ణ భగవానుడి ఆదేశం మేరకు...కర్తవ్య నిర్వహణ, ప్రజా పాలనపై పాండవులకు చక్కని బోధ చేశాడు. మంచి పాలకుడు అనిపించుకోవాలంటే ప్రజలను ఎలా పరిపాలించాలో సూచించాడు. దుష్టపాలకుడు అనిపించుకోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించాడు భీష్ముడు.
Also Read: భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి - ఇంతకీ భీష్ముడు ఏం సందర్భంలో ఏమని ప్రతిజ్ఞ చేశాడు!
సప్తాంగాలను కాపాడాలి
అధికారంలో ఉన్నవాళ్లు ధర్మపరులై ఉండాలి. నీతి తప్పనివాళ్లయి ఉండాలి. కార్య సాఫల్యంకోసం పట్టువదలని ప్రయత్నం చేయాలి. అప్పుడే ఆ ప్రయత్నానికి భగవంతుడు కూడా సహకరిస్తాడు. రాజు, మంత్రి, రాష్ట్రం, దుర్గం, ధనాగారం, స్నేహితులు, సైన్యం అనే ఏడింటినీ సప్తాంగాలు అంటారు. వీటికి హాని రాకుండా చూసుకోవాలంటే పాలకుడు సత్ప్రవర్తన, సత్యవాక్పరిపాలన కలిగి ఉండాలి. ప్రజలందరినీ రాజు సమానంగా చూసుకోవాలి. అందరిపట్ల దయ కలిగి ఉండాలి.
బిడ్డను కనబోయే తల్లి - పాలకుడు ఒక్కటే
పాలకుడు అతి మృదువుగా ఉంటే మావటివాడు ఏనుగును ఎక్కినట్టు దిగువ ఉద్యోగులూ, ప్రజలూ నెత్తికెక్కి కూర్చుంటారు. క్రూరుడైతే అందరూ తిడతారు. అందుకే వసంతకాలపు సూర్యుడిలా తగిన మార్దవంతో పాటూ అవసరమైన చోట కాఠిన్యం కూడా చూపించాలి. రాజధర్మాల్లో ఇది చాలా ముఖ్యం. దండించేటప్పుడు జాగ్రత్తగా విచారించి మరీ శిక్షించాలి. తన ఇష్టం వచ్చినట్టు చేసి ప్రజలకు నొప్పి కలిగించకూడదు. బిడ్డను కనబోయే తల్లి తన సంతానానికి అనువైన ఆహారం తిన్నట్టే రాజు కూడా తొందరపడక ప్రజలకెలా అనుకూలమో అలా నడుచుకోవాలి. సరైన పద్ధతిలో ధనం సంపాదించాలి. అవినీతిపరులను గమనిస్తూ ఉండాలి. ఎవరినీ నమ్మకపోవడం మృత్యువుతో సమానం..ఎక్కువగా నమ్మడం అకాల మృత్యువుతో సమానం. నమ్మీనమ్మకుండా పనులు చేయించుకోవడమే తెలివైనపాలకుడి లక్షణం.
Also Read: అందరూ కృష్ణుడిని తలుచుకుంటే కృష్ణుడు ఎవర్ని స్మరించాడో తెలుసా!
పాలకులు మంచి గృహస్థులై ఉండాలి
పాలకులు మంచి గృహస్థులై ఉండాలి. సాధారణ గృహస్థులు పెరట్లో నాటిన చెట్లలాంటి వాళ్లయితే, పాలకులు నాలుగు బజార్ల కూడలిలో పెరిగిన మహావృక్షాల్లాంటి వాళ్లు. సాధారణ గృహస్థులు తమ ఇంటికి వచ్చిన అతిథుల్ని ఆదరిస్తే, ప్రభువు తన ఏలుబడిలోని నిరుపేదలను, నిరాధారులను, నిరాశ్రయులను, వృద్ధులను, వితంతువులను ఆదరించాలి. పాలకుడు ఎప్పుడూ బలహీనుల బలం కావాలి కానీ బలమైనవారికి మరింత బలం కాకూడదు. ప్రజలకు ధనం, ధాన్యం, ఇతర నిత్యావసర వస్తువులకు కొరత లేకుండా చూసుకోవాలి. జీవనోపాధి కుంటుపడకుండా జాగ్రత్త పడాలని పాండవులకు సూచించాడు భీష్ముడు.
పాలకుడు దుష్టుడైతే ప్రకృతి తిరగబడుతుంది
పాలకులు మంచివాళ్లయితే రుతువులన్నీ సక్రమంగా వాటి ధర్మాలను నిర్వర్తిస్తాయి. భూమి సమృద్ధిగా పంటలనిస్తుంది. మనుషులు సుఖసంతోషాలతో ఉంటారు. పూర్ణాయుష్కులవుతారు. పాలకులు దుర్మార్గులూ, దుష్టులూ అయితే ప్రకృతి కూడా తిరుగుబాటు చేస్తుంది. రుతువులు వాటి ధర్మాలను విడిచిపెడతాయి. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి తప్పదు. ఆకలిదప్పులు, అనారోగ్యంతో ప్రజలు బాధపడతారు. పాలకులు చేసే పుణ్యాలు, యజ్ఞయాగాది క్రతువులకు దేవతలు సంతోషించి దివ్య వర్షాన్ని, దివ్యమైన అన్నాన్ని ప్రసాదిస్తారు.
Also Read: పెళ్లి ఆలస్యం అయ్యే అమ్మాయిలు రుక్మిణీ కళ్యాణం - మరి పెళ్లికాని అబ్బాయిలు ఏం చదవాలంటే!
రైతునే రాజుగా చూడాలి
సుఖానికి మూలం ధర్మం. ధర్మానికి మూలం ధనం. ధనానికి మూలం రాజ్యం. అర్థసంపద ఉంటే అదే ప్రకృతి సంపదను కూడా ఇస్తుంది. అంటే రాజ్యపాలనకు కావల్సిన శక్తిని ఇస్తుందన్నమాట. కనుక ధనాగారాన్ని వృద్ధి చేసుకునే విధానాలేంటో నిరంతరం పాలకులు అన్వేషిస్తుండాలి. అయితే, మనకు తిండిగింజలు ఎలా వస్తున్నాయో, ఈ నేలను ఎవరు దున్నుతున్నారో, ఈ మట్టిని ఎవరు బంగారం చేస్తున్నారో, మనకూ మన ప్రజలకూ ఎవరు ప్రతిపూటా పట్టెడన్నం పెడుతూ ప్రాణదానం చేస్తున్నారో వాళ్లపట్ల కృతజ్ఞులమై ఉండాలి. అంటే రైతే అసలైన రాజు అని గుర్తించాలి. వాళ్లను పీడించకూడదు. వాళ్లకు హాని కలిగించకూడదు. పట్టెడన్నం పెట్టే కర్షకులు విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు పాలకుడు అండగా నిలవాలి..