Vaibhav Suryavanshi World Records: వైభవ్ ఖాతాలో పలు ప్రపంచ రికార్డులు.. ఐపీఎల్లోనూ కొన్ని రికార్డులు గల్లంతు.. 14 ఏళ్ల వయసులోనే...
ఒక ఇన్నింగ్స్ తో పలు ప్రపంచ రికార్డులను వైభవ్ కొల్లగొట్టాడు. టీ20ల్లో అత్యంత యంగెస్ట్ సెంచరీ, ఫిఫ్టీ చేసిన ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. పలు ఐపీఎల్ రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

IPL 2025 RR VS GT Updates: గుజరాత్ టైటాన్స్ పై మెరుపు సెంచరీ సాధించిన రాజస్థాన్ రాయల్స్ టీనేజర్ వైభవ్ సూర్యవంశీ (38 బంతుల్లో 101, 7 ఫోర్లు, 11 సిక్సర్లు) పలు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. టీ20 ఫార్మాట్లో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. గుజరాత్ పై 14 ఏళ్ల 32 రోజుల వయసులో సెంచరీ చేసిన వైభవ్.. గతంలో ఇండియాకే చెందిన విజయ్ జోల్ (18 ఏళ్ల 118 రోజులు) పేరిట ఉన్న రికార్డును తిరగ రాశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో భాగంగా మహారాష్ట్ర తరపున విజయ్ ఈ సెంచరీని సాధించాడు. భారీ తేడాతో ఈ రికార్డును వైభవ్ కొల్లగొట్టడం విశేషం. దాదాపు 4 ఏళ్ల 86 రోజుల తేడాతో ఈ రికార్డును తన కైవసం చేసుకున్నాడు. అలాగే ఐపీఎల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఇండియన్ ప్లేయర్ గాను వైభవ్ రికార్డులకెక్కాడు. కేవలం 35 బంతుల్లో సెంచరీ చేసిన వైభవ్.. గతంలో యూసుఫ్ పఠాన్ (37 బాల్స్) ముంబై ఇండియన్స్ పై చేసిన రికార్డును తిరగ రాశాడు. ఓవరాల్ గా ఈ అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది.
Special. Scintillating. Suryavanshi 🙌✨
— IndianPremierLeague (@IPL) April 28, 2025
For his record-smashing 1⃣0⃣1⃣(38), Vaibhav Suryavanshi is adjudged the Player of the Match 🩷
Updates ▶ https://t.co/HvqSuGgTlN#TATAIPL | #RRvGT | @rajasthanroyals pic.twitter.com/RQA5hxmTXE
ఐపీఎల్ రికార్డు..
ఇక ఐపీఎల్లో అత్యంత పిన్న వయస్కులో సెంచరీ చేసిన రికార్డును కూడా వైభవ్ తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు మనీశ్ పాండే (19 ఏళ్ల 253 రోజులు) పేరిట ఉండేది. తాజా ప్రదర్శనతో ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే టీ20ల్లో ఫిఫ్టీ చేసిన యంగెస్ట్ ప్లేయర్ గాను రికార్డులకెక్కాడు. గతంలో ఈ రికార్డు అఫ్గానిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ నబీ కుమారుడు మసన్ ఐసాకిల్ పేరిట ఉండేది. తను 15 ఏళ్ల 360 రోజుల వయసులో ఆఫ్గాన్ లోకల్ లీగ్ అయిన స్వాగీజా లీగ్ లో ఈ రికార్డును నమోదు చేశాడు.
ధనాధన్ ఆటతీరు..
ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సూర్యవంశీ.. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఒక్కసారిగా టాప్ గేర్ లోకి వెళ్లాడు. వెటరన్ ఇషాంత్ శర్మ బౌలింగ్ లో ఏకంగా 28 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సిక్సర్లు, 2 ఫోర్లు ఉండటం విశేషం. ఇక ఆ 10వ ఓవర్ వేసిన అరంగేట్ర ఆటగాడు కరీం జనత్ వేసిన ఓవర్లో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. ఇక 35 బంతుల్లో సెంచరీ చేశాక ఆఖరికి ప్రసిధ్ కృష్ణకు వికెట్ సమర్పించుకున్నాడు. మొత్తం మీద ఈ మ్యాచ్ ద్వారా రాయల్స్ తిరిగి విజయాల బాట పట్టింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 209 పరుగులు చేసింది. శుభమాన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (50 బంతుల్లో 84, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మహీషా తీక్షణకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం సూర్యవంశీ జోరుతో ఛేదనలో రాయల్స్ కేవలం 15.5 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసి సునాయాస విజయం సాధించింది.




















