(Source: ECI/ABP News/ABP Majha)
Maharashtra News: మహారాష్ట్ర రాజ్యమాతగా గోమాత, మరి ఇతర రాష్ట్ర జంతువులు ఏంటి?
Rajyamata Gomata : రాజ్యమాత- గోమాత పేరిట శాసనసభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలోని మహాయుతి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గోపశుపోషకులకు భారీగా నజరానాలు కూడా ప్రకటించింది.
Maharashtra Govt : త్వరలో శాసనసభకు ఎన్నికలు జరగనున్న వేళ మహారాష్ట్రలోని మహాయుతి సర్కారు గోవు ఆధారిత రాజకీయాలకు తెరతీసింది. ఆవులను రాజ్యమాత- గోమాతగా పరిగణిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశీ ఆవుల పరిరక్షణకు ఈ పథకం ఎంతగానో ఉపకరిస్తుందన్న ఏక్ నాథ్ షిండే సర్కారు, గో పోషకులకు అనేక సబ్సిడీలు కూడా ప్రకటించింది.
శాసనసభ ఎన్నికల వేళ గోరాజకీయాలకు వేదికగా మహారాష్ట్ర:
భారతదేశానికి ఆవు ఎంత పవిత్రమైందో అందరికీ తెలుసు. కామధేనువుగా వేదకాలం నుంచి గోమాతను హిందువులు పూజిస్తూ ఉన్నారు. అయితే స్వతంత్ర భారతంలో మాత్రం ఆవు దేశ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. ఆవులపై ఆధారపడి బతికే రోజుల నుంచి ప్రభుత్వాలు లేదా రాజకీయ పార్టీలు గోవులపై ఆధారపడి రాజకీయాలు చేసే రోజులకు ఇప్పుడు భారతదేశం చేరింది. ఇప్పుడు మహారాష్ట్ర వంతు వచ్చింది. త్వరలో ఆ రాష్ట్రానికి శాసనసభ ఎన్నికలు జరగనుండగా మహాయుతి కూటమి ఒక్కసారిగా గోమాతవైపు దృష్టి సారించింది. రాజ్యమాత- గోమాత అంటూ మహారాష్ట్ర జంతువుగా ఆవును గుర్తిస్తూ సెప్టెంబర్ 30న ఉత్తర్వులు జారీ చేసింది. భారతీయ సంస్కృతి, సాంస్కృతిక వారసత్వం, వ్యవసాయం, ఆరోగ్య విభాగాల్లో ఆవు విశిష్టమైన స్థానం కలిగి ఉందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయం దేశీ ఆవుల పరిరక్షణకు ఉపకరిస్తుందని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు.
రాష్ట్రసర్కారే పశుపోషకులకు దాణా అందిస్తుందని ప్రకటన:
రాజ్యమాత- గోమాత పథకం కింద పశు పోషకులకు అనేక ప్రయోజనాలు అందనున్నాయని పఢణవీస్ తెలిపారు. ప్రభుత్వం గోపోషకులకు దాణా కూడా అందిస్తుందన్నారు. అంతేకాకుండా రోజుకు 50 రూపాయలు సబ్సిడీ కూడా అందనుంది. మహారాష్ట్రలో ప్రస్తుతం 46 లక్షలా 13 వేల 632 ఆవులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2019 నాటి సెన్సెస్‌తో పోల్చితే ప్రస్తుతం మహారాష్ట్రలో ఆవుల సంఖ్య 20.69 శాతం పడిపోయిందని పఢణవీస్ తెలిపారు. మహాయుతి సర్కారు నిర్ణయంతో దేశీ ఆవుల సంరక్షణ పెరుగుతుందని అన్నారు. దేశీ ఆవు పాలలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు.
మహారాష్ట్రలో పలురకాల దేశీ ఆవు బ్రీడ్‌లు:
మహారాష్ట్రలో చాలా రకాల బ్రీడ్‌లు ఉన్నాయి. మరఠ్వాడ పరిధిలో దేవ్‌నీ, లాల్కంధారి ఆవులు ఉంటాయి. పశ్చిమ మహారాష్ట్రలో చూస్తే ఖిల్లార్ ఆవు జాతి ఉంటుంది. ఉత్తర మహారాష్టర్లో దాంగి రకం ఆవులు, విదర్భలో గవ్లావ్ ఆవులు ఉంటాయి. అయితే ఈ ఆవు జాతులు క్రమంగా అంతర్దానం దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేసిన మహారాష్ట్ర సర్కారు ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వాటి సంరక్షణకు ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. మనుషులకు అవసరమైన పోషకాలు ఆవు పాలలో అధికంగా ఉంటాయని, ఆయుర్వేదం, పంచగవ్య వంటి ట్రీట్మెంట్ పద్దతుల్లో ఆవు పాలకు ప్రత్యేక స్థానం ఉందని మహారాష్ట్ర పశుసంవర్థక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్గానిక్ ఫామింగ్‌కు కూడా ఈ నిర్ణయం ఎంతో ఉపకరిస్తుందని అభిప్రాయ పడింది. మహారాష్ట్ర సర్కారు నిర్ణయాన్ని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే సమర్థించారు. భారత సంస్కృతి, జీవన విధానంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించిన గోవును గౌరవించుకోవడానికి మహాయుతి సర్కారు తీసుకున్న నిర్ణయం అభినందనీయం అన్నారు.
వివిధ రాష్ట్రాల జంతువులు ఏంటి?
ఆంధ్రప్రదేశ్ కృష్ణ జింకను రాష్ట్ర జంతువుగా గుర్తించింది. అరుణాచల్ ప్రదేస్ గయాల్‌ను, బిహార్, గోవా తమ రాష్ట్ర జంతువులుగా అడవి ఎద్దును గుర్తించాయి. ఛత్తీస్‌గడ్‌కు అడవి బర్రె, గుజరాత్‌కు ఆసియా సింహం ఉన్నాయి. మహారాష్ట్రకు సోమవారం వరకు జైంట్ స్క్విరల్ రాష్ట్ర జంతువు కాగా ఇకపై ఆవు రాష్ట్ర జంతువుగా ఉండనుంది. రాజస్తాన్‌లో చింకారాను కాపాడడమే లక్ష్యంగా 1981 మేలో దాన్ని రాష్ట్ర జంతువుగా గుర్తించారు. ఆ తర్వాత 2014లో ఒంటెల సంఖ్య తగ్గుదలను గుర్తించి దాన్ని కూడా రాష్ట్ర జంతువుగా గుర్తిస్తూ రాజస్థాన్ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విధంగా ఆ రాష్ట్రానికి రెండు రాష్ట్ర జంతువులు ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర జంతువు చిత్తడి జింక. ఇలా రాష్ట్ర జంతువుగా ఆవును గుర్తించిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ఉండగా ఇప్పుడు మహారాష్ట్ర కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. జాతీయ జంతువు మాత్రం పులి.