Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Andhra News: టీచర్లే నిజమైన హీరోలని.. వారిని గౌరవించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. కడప మున్సిపల్ హైస్కూల్‌లో శనివారం మెగా పేరెంట్స్ ఈవెంట్‌లో పాల్గొన్నారు.
Pawan Kalyan Comments On Kadapa Muncipal School: తన దృష్టిలో టీచర్లే నిజమైన హీరోలని.. హీరోలను సినిమాల్లో నటించేవారిలో కాదని, మీ అధ్యాపకుల్లో చూసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విద్యార్థులకు సూచించారు. ఈ విషయాన్ని ఓ సినీ నటుడిగా చెబుతున్నానని చెప్పారు. కడప మున్సిపల్ హై స్కూల్‌లో (Kadapa Muncipal High School) ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మెగా సమావేశంలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో సరదాగా ముచ్చటించి వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. సినీ డైలాగులు చెబితే వెనుక రీరికార్డింగులు వస్తాయని.. సినీ హీరోలు నడిస్తే రీరికార్డింగులు ఉంటాయని.. కానీ కార్గిల్‌లో చనిపోయిన వారికి, ఉపాధ్యాయులకు రీరికార్డింగులు ఉండవని అన్నారు. కానీ వారే నిజమైన హీరోలని వారిని గౌరవించాలని సూచించారు.
'చదువుల నేల రాయలసీమ'
రాయలసీమ వెనుకబడిన ప్రాంతం కాదని.. సాహిత్యాలకు నిలయమని, అవకాశాలను ముందుండి నడిపించే ప్రాంతమని పవన్ అన్నారు. 'చదువుల నేల రాయలసీమకు వచ్చాను. అన్నమయ్య, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు, కేవీరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి మహనీయుల నేల ఇది. అవకాశాలను అందిపుచ్చుకునేలా రాయలసీమ మారబోతోంది. సమాజానికి సరైన చదువు ఇవ్వకపోతే అభివృద్ధి దిశగా వెళ్లదు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. పిల్లలతో చర్చిస్తేనే అన్ని విషయాలు మనకు తెలుస్తాయి. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా బాధ్యతగా ఉండాలి. నేటి సమాజానికి విలువలతో కూడిన విద్య అవసరం. పిల్లలపై తల్లిదండ్రుల నిఘా ఉండాలి.' అని సూచించారు.
'నీటి సమస్య తీరుస్తాం'
'2014 - 19లో ఉద్దానం సమస్యను బయటకు తీసుకొచ్చా. ఆనాటీ సీఎం చంద్రబాబు రూ.61 కోట్లతో ఉద్దానం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు. కడపలో నీటి సమస్యను తీరుస్తాం. తాగునీటి కోసం ఎక్కడా ఇబ్బంది రాకూడదనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. పులివెందుల తాగునీటి ప్రాజెక్టుకు రూ.45 కోట్లు ఇచ్చాం. నీటి సమస్యను తీర్చి ఇక్కడ ప్రజలను ఆదుకుంటాం.' అని పేర్కొన్నారు.
విద్యార్థులతో సీఎం ముచ్చట్లు
విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ.. పెద్దల పట్ల ఎలా మెలాగాలో ఆచరించి చూపించిన లోకేశ్#MegaParentTeacherMeeting #ChandraBabuNaidu#NaraLokesh#AndhraPradesh pic.twitter.com/Wy690qUHg3
— Telugu Desam Party (@JaiTDP) December 7, 2024
అటు, ఏపీవ్యాప్తంగా ఒకే రోజున తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు మెగా సమావేశాన్ని నిర్వహించారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో సీఎం ముచ్చటించడంతో పాటు వారి ప్రగతి నివేదికలు పరిశీలించారు. తర్వాత తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థుల సూచనలు, సలహాలు విన్నారు. సమావేశం అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. పిల్లల చదువును తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు. 'విద్యార్థులు స్మార్ట్ ఫోన్లకు బానిసలు కాకుండా చూసుకోవాలి. డ్రగ్స్ వ్యసనానికి విద్యార్థులు దూరంగా ఉండాలి. మానవ సంబంధాలను మాదక ద్రవ్యాలు నాశనం చేస్తాయి. రాష్ట్రంలో ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఈ రక్కసిని కర్కశంగా అణచివేస్తాం. డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలి.' అని చంద్రబాబు పిలుపునిచ్చారు.