Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
Sukumar On Revanthi Death: 'పుష్ప 2' పెయిడ్ ప్రీమియర్ షో చూసేందుకు ఫ్యామిలీతో కలిసి వచ్చిన రేవతి మృతి చెందారు. ఆవిడ మరణం పట్ల 'పుష్ప 2' బ్లాక్ బస్టర్ సక్సెస్ ప్రెస్ మీట్ లో సుకుమార్ మాట్లాడారు.
మూడేళ్లు కష్టపడి సినిమా తీసినా, ఆరేళ్లు కష్టపడి సినిమా తీసినా సరే ఒక ప్రాణాన్ని అయితే తాను తిరిగి తీసుకురాలేనని ప్రముఖ దర్శకుడు, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ అన్నారు. తమ సినిమాకు వచ్చిన ఒక మహిళ మృతి చెందిన ఘటన తనను ఎంతో కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు 'పుష్ప 2' బ్లాక్ బస్టర్ సక్సెస్ ప్రెస్ మీట్ లో ఆయన మహిళ మృతి పట్ల స్పందించారు.
దర్శకుడు అనే వాడు చాలా సెన్సిటివ్...
నేను మూడు రోజులుగా సంతోషంగా లేను!
తాను మూడు రోజులుగా సంతోషంగా లేను అని సుకుమార్ స్పష్టం చేశారు. అందుకు కారణం రేవతి మృతి. ఆ వివరాల్లోకి వెళితే... డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సర్కిల్లో గల సంధ్య థియేటర్ దగ్గరకు 'పుష్ప 2: రూల్' పెయిడ్ ప్రీమియర్ సినిమా చూడడం కోసం కుటుంబంతో కలసి రేవతి అనే మహిళ వచ్చారు. అభిమానులతో కలిసి సినిమాను వీక్షించేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం అదే థియేటర్ దగ్గరకు వెళ్లారు. ఆయన రావడంతో ప్రేక్షకుల తాకిడి ఎక్కువ అయ్యింది. ఒకానొక దశలో ప్రేక్షకులను కంట్రోల్ చేయడం కోసం పోలీసులు లాఠీ ఛార్జ్ కూడా చేయవలసి వచ్చింది. ఆ సందర్భంలో జరిగిన తొక్కిసలాట కారణంగా రేవతి ఆసుపత్రి పాలయ్యారు. ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన తనను కలచివేసిందని సుకుమార్ తెలిపారు.
''నేను మూడు రోజులుగా సంతోషంగా లేను. ఎందుకు అంటే... దర్శకుడు అనేవాడు చాలా సెన్సిటివ్ గా ఉంటాడు. నేను మూడు సంవత్సరాలు కష్టపడి సినిమా తీసినా... ఆరేళ్లు కష్టపడి సినిమా చేసినా... ఒక ప్రాణాన్ని సృష్టించలేను. ఒక ప్రాణం పోవడం వల్ల నా మనసు వికలమైంది. ఆవిడ ప్రాణాలు పోవడం చాలా బాధాకరం. ఆ విషాదం నుంచి బయటకు వచ్చిన తర్వాతే మేము వసూళ్ల వివరాలు వెల్లడించాం. నేను అయినా, బన్నీ అయినా, మా నిర్మాతలు అయినా... ఆ ఘటన నుంచి చేరుకోవడానికి మాకు సమయం పట్టింది. ఆ కుటుంబ బాధ్యతను మేము తీసుకుంటామని హామీ ఇస్తున్నాను'' అని సుకుమార్ చెప్పారు.
Also Read: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ జాతర... అఫీషియల్‌గా రెండు రోజుల్లో 'పుష్ప 2' కలెక్షన్లు ఎంతో తెలుసా?
పాతిక లక్షల సాయంతో పాటు భరోసా ఇచ్చిన బన్నీ
రేవతి మృతి పట్ల శుక్రవారం సాయంత్రమే అల్లు అర్జున్ తన స్పందన తెలియజేశారు. తాను ఎంతగా బాధపడుతున్నది వివరించడంతో పాటు ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రేవతి కుటుంబానికి పాతిక లక్షల రూపాయల సాయం అందించడంతో పాటు వైద్యానికి ఆయన ఖర్చు అంతా తాను భరిస్తానని ఆయన వెల్లడించారు. రేవతిని తాము తిరిగి తీసుకు రాలేమని, ఆమె కుటుంబానికి అండగా నిలబడతానని చెప్పడానికి కోసం మాత్రమే ఈ పాతిక లక్షలు ఇస్తున్నానని ఆయన వివరించారు.
Also Read: బూత్ బంగ్లాలో RC 16... అమెరికాలో Game Changer... ఇదీ డిసెంబర్‌లో రామ్ చరణ్ షెడ్యూల్