Power Cut In Summer: ఏప్రిల్‌లో కరెంట్ కోతలు తప్పవా! రాత్రి పూట నరకం చూడాల్సిందేనా?
Power Cut In Summer: ఈ ఏప్రిల్‌లో రాత్రి పూట కరెంట్ కోతలు తప్పేలా లేవు.
Power Cut In Summer:
డిమాండ్ తగ్గ సప్లై లేదు..
ఎండాకాలం వచ్చేసింది. ఇప్పటి వరకూ మూలకు పడేసిన కూలర్‌లను బయటకు తీస్తున్నారు. అదీ చాలదంటే ఏసీలు కొంటున్నారు. ఫ్యాన్‌లు ఆగకుండా తిరుగుతున్నాయి. క్రమంగా విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. మార్చి మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు తీవ్రంగా నమోదవుతూ వస్తున్నాయి. ఉక్కపోతకు తాళలేక ఎక్కువ సేపు ఏసీలు, కూలర్‌లు వినియోగిస్తున్నారు దేశ ప్రజలు. అయితే...ఈ వాడకం అంతా మార్చికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఏప్రిల్‌లో కరెంట్ కోతలు తప్పేలా లేవు. ముఖ్యంగా రాత్రి పూట పవర్ కట్‌లు తప్పవంటూ కొందరు అధికారులు చెబుతున్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశముందన్న అంచనాలు వస్తున్న నేపథ్యంలో ఆ స్థాయిలో విద్యుత్ సరఫరా చేయడం కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం..బొగ్గు కొరత. కోల్ పవర్ ప్లాంట్‌లలో బొగ్గు నిల్వలు నిండుకుంటున్నాయి. ఫలితంగా విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలుగుతోంది. సాధారణంగా ఎండాకాలంలో డిమాండ్ పెరుగుతుంది. అందుకు తగ్గట్టుగానే ఉత్పత్తి ఉంటుంది. కానీ..ఈ సారి మాత్రం డిమాండ్, సప్లై మధ్య అంతరాయం ఏర్పడుతుండొచ్చు. Reuters రిపోర్ట్ ప్రకారం...సోలార్ పవర్ ద్వారా మధ్యాహ్నం పూట విద్యుత్ డిమాండ్‌ను తీర్చగలిగినా రాత్రి పూట మాత్రం ఇబ్బందులు తప్పవు. రాత్రి పూట సోలార్ పవర్ అందుబాటులో ఉండదు కనుక ఈ సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. Federal Grid Regulator Grid Controller of India లెక్కల ప్రకారం చూస్తే...గతంతో పోల్చుకుంటే 1.7% మేర తక్కువ విద్యుత్ అందుబాటులో ఉండనుంది.
ప్రొడక్షన్‌లోనూ కోత..
ఏప్రిల్‌లో రాత్రి పూట 217 GW మేర విద్యుత్ డిమాండ్ ఉండే అవకాశముందని, గతేడాది ఏప్రిల్‌తో పోల్చి చూస్తే ఇది 6.4% అధికం అని అధికారులు వివరిస్తున్నారు. ఈ లెక్కన చూస్తే వచ్చే నెలలో రాత్రుళ్లు ఉక్కపోతతో అల్లాడాల్సి వస్తుంది. సాధారణంగా ఎండా కాలంలో రాత్రి పూట విద్యుత్ డిమాండ్‌ను తీర్చేందుకు కోల్, న్యూక్లియర్, గ్యాస్ ద్వారా 83% మేర పవర్ ఉత్పత్తి చేస్తారు. హైడ్రో పవర్ ప్లాంట్‌లు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే..ఈ సారి మాత్రం హైడ్రో పవర్ ప్రొడక్షన్‌లో 18% మేర కోత పడుతుండొచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం కొన్ని చోట్ల బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్‌ల నిర్మాణం జరుగుతోంది. ఈ నిర్మాణాల్లో జాప్యం కారణంగా కూడా విద్యుత్ డిమాండ్‌ను అందుకోవడం కష్టంగా ఉంది. Central Electricity Authority ప్రకారం...26 బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్‌లు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. ఒక్కో ప్లాంట్ కెపాసిటీ 16.8 గిగావాట్లు. కొన్ని పవర్ ప్లాంట్‌ల నిర్మాణం అయితే పదేళ్లుగా వాయిదా పడుతూ వస్తూనే ఉంది. ఈ కారణాలతో ఈ ఎండాకాలం దేశవ్యాప్తంగా ప్రజలు ఉక్కపోత భరించక తప్పదు. ఇప్పటికే వేడిని తట్టుకోలేకపోతుంటే...ఇప్పుడీ వార్త మరింత వేడిని పెంచుతోంది. ఏప్రిల్ నెలను తలుచుకుంటేనే భయపడేలా చేస్తోంది.
Also Read: బొట్టెందుకు పెట్టుకోలేదు, కామన్ సెన్స్ లేదా? మహిళా వ్యాపారిపై బీజేపీ ఎంపీ ఆగ్రహం - వైరల్ వీడియో