SRH vs PBKS Match Highlights IPL 2025 | పంజాబ్ కింగ్స్ పై 8వికెట్ల తేడాతో సన్ రైజర్స్ సంచలన విజయం | ABP Desam
ఓరి నాయనో..ఓరి దేవుడో..ఏం కొట్టుడురా నాయనా ఇది. అరిచి అరిచి గొంతులు పోయాయ్ ఫ్యాన్స్ కి. అసలు నువ్వు మనిషా మానవ మృగానివా బ్రో. కొంచెమైనా మనిషి ఆడినట్లు ఆడావా బ్రో. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ కాదు బ్రో. అభిషేక్ శర్మ వర్సెస్ పంజాబ్ కింగ్స్. చీటీ రాసుకొచ్చి మరీ అభిషేకోడు పంజాబ్ ను చెవులు మూసి చావగొట్టి... సన్ రైజర్స్ కు సంచలన విజయం అందించిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. ఆర్య, ప్రభ్ సిమ్రన్ షో
ఉప్పల్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ డెసిషన్ కరెక్ట్ అని ప్రూవ్ చేస్తూ ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ చెలరేగిపోయారు. ప్రధానంగా ఆర్య గత మ్యాచ్ ఫామ్ కొనసాగిస్తూ పవర్ ప్లేలో పూనకాలు వచ్చినట్లు ఆడాడు. 13 బాల్స్ మాత్రమే ఆడి 2 ఫోర్లు 4 సిక్సర్లతో 36 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆర్య అవుటయ్యేప్పటికి పంజాబ్ స్కోరు 4 ఓవర్లలో 66. ఆ తర్వాత ప్రభ్ సిమ్రన్ రెచ్చిపోయాడు. కెప్టెన్ అయ్యర్ తోడుగా హిట్టింగ్ తో విరుచుకుపడ్డాడు. 23 బాల్స్ లో 7 ఫోర్లు ఓ సిక్సర్ తో 42 పరుగులు చేసి ఈషన్ మలింగ బౌలింగ్ లో అవుటయ్యాడు కానీ పంజాబ్ కావాల్సిన ఆరంభాన్ని ఆర్య, ప్రభ్ సిమ్రన్ అందించే వెళ్లారు.
2. అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్
ఈ సీజన్ లో తన ఫామ్ ను కొనసాగిస్తూ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ హైదరాబాద్ మీద విరుచుకుపడ్డాడు. 36 బాల్స్ లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసం సృష్టించిన అయ్యర్ 82 పరుగులు చేయటంతో పాటు ఏ దశలోనూ పంజాబ్ రన్ రేట్ ను 10కి తగ్గనివ్వలేదు. మధ్యలో నేహల్ వధీరా, చివర్లో 4సిక్సర్లతో స్టాయినిస్ విరుచుకుపడటంతో పంజాబ్ 245పరుగుల భారీ స్కోరు చేసింది.
3. విధ్వంసంలోనూ విన్యాసం హర్షల్ పటేల్
పంజాబ్ సృష్టించిన విధ్వంసంలో సన్ రైజర్స్ బౌలర్స్ అందరూ బలైపోయినా హర్షల్ పటేల్ మాత్రం ఇంప్రెస్ చేశారు. మిగిలిన బౌలర్లలానే పరుగులు భారీగా లీక్ చేసినా నాలుగువికెట్లు తీసి మెప్పించాడు. ప్రియాంశ్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్ వికెట్లతో పాటు మ్యాక్స్ వెల్ ను క్లీన్ బౌల్డ్ చేసి అంత విధ్వంసంలోనూ తన బౌలింగ్ విన్యాసం చూపించాడు హర్షల్ పటేల్
4. నిప్పుకు గాలి..అభిషేక్ కు హెడ్
టార్గెట్ 246పరుగులు. ఎంత భారీ టీమ్ ఉన్నా..బ్యాటింగ్ పిచ్ అయినా సరే ఛేజింగ్ లో అంత స్కోరు చాలా కష్టం. అలాంటిది సన్ రైజర్స్ బ్యాటింగ్ మొదలైన దగ్గర్నుంచి హెడ్ మాస్టర్ ఒక్కో పంజాబ్ బౌలర్ లెక్కలు సరిచేశాడు. మరో ఎండ్ లో ఊచకోత కోస్తున్న అభిషేక్ కి హెల్త్ చేస్తూనే తనూ నిప్పును మరింత మండించే గాలిలా బౌండరీల మోత మోగించాడు. 37 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్సర్లతో 66పరుగులు చేసిన హెడ్ మొదటి వికెట్ కు అభిషేక్ తో కలిసి 171పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి గెలుపును నల్లేరు మీద నడక చేశాడు.
5. పెను ఉప్పెన...అరాచక విధ్వంసం అభిషేక్ హెడ్
ఈ కుర్రాడికి ఏమని ఉపమానాలు చెప్పాలి. ఎలాంటి అలంకారాలు వాడాలి. స్పీచ్ లెస్ అంతే. మనిషివా మానవ మృగానివా అని అడగాలనింపించేంత కర్కశంగా విరుచకుపడ్డాడు పంజాబ్ బౌలర్లపై. ఏ దశలోనూ ఏ క్షణంలోనూ పంజాబ్ కి గెలుపు మీద ఆశలేకుండా చేశాడు. ఏ రకం బంతి వేసినా నా టార్గెట్ బౌండరీనే అన్నట్లు చెలరేగిపోయాడు. స్టార్టింగ్ లోనే వచ్చిన ప్రాణదానాన్ని వాడేసుకుంటూ 55 బంతుల్లోనే 14ఫోర్లు 10 భారీ సిక్సర్లతో 141 పరుగులు చేసి ఉప్పల్ లో ఊచకోత కోశాడు అంతే. చీటీ రాసుకుని వచ్చి మరీ సెంచరీ కొట్టాడు. దిస్ వన్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని చీటీ రాసుకుని వచ్చి మరీ కొట్టాడంటే ఈ కుర్రాడి కాన్ఫిడెన్స్ ఏమని చెప్పాలి. అభిషేక్ విధ్వంసానికి తోడు చివర్లో మిగిలిన పనిని క్లాసెస్, ఇషాన్ కిషన్ పూర్తి చేయటంతో ఐపీఎల్ చరిత్రలోనే రెండో అతి పెద్ద ఛేజింగ్ నమోదు చేస్తూ... పంజాబ్ కింగ్స్ పై సన్ రైజర్స్ 8వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది.
వరుసగా నాలుగు ఓటముల తర్వాత సంచలన విజయాన్ని అందుకుని తిరిగి తన ఆత్మవిశ్వాన్ని ఘనంగా పోగు చేసుకుంది. పంజాబ్ కూడా అద్భుతంగా ఆడినా సన్ రైజర్స్ విధ్వంసం ముందు నిలవలేకపోయింది అంతే.





















