Hanuman Jayanti 2025: వడమాల, పప్పు, బెల్లం సహా హనుమాన్ ఇష్టమైన నైవేద్యాలు ఇవే!
ఏటా చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ విజయోత్సవం/హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ రోజు ఆంజనేయుడికి ఏం నైవేద్యం పెట్టాలో తెలుసా...

Hanuman: ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి వచ్చింది..సప్త చిరంజీవుల్లో ఒకరైన ఆంజనేయుడు ఇప్పటికీ భూమిపై ఉన్నాడని, కాలానుగుణంగా తన భక్తులను అనుగ్రహిస్తాడని నమ్ముతారు. నిత్యం ఆంజనేయుడి పూజ చేయడం మంచిది. మంగళవారం, శనివారం శుభప్రదం. హనుమాన్ విజయోత్సవం, హనుమాన్ జయంతి రోజు మరింత ప్రత్యేకం.
భగవంతుడి పూజలో భాగంగా పూజా సామగ్రితో పాటూ అరటిపండ్లు, కొబ్బరికాయ, ఇతర రకాల తాజాపండ్లు ఉండడం సాధారణం. వీటిని దీర్ఘాయువుకు చిహ్నంగా భావిస్తారు. అయితే వీటితో పాటూ ఒక్కో దేవుడికి ఒక్కో నైవేద్యం ప్రీతికరంగా చెబుతారు. మరి ఆంజనేయుడి అనుగ్రహాన్ని పొందేందుకు సమర్పించాల్సిన నైవేద్యాలివే..
వడమాల
ఆంజనేయుడి పూజలో భాగంగా తమలపాకు మాల వేస్తారు. అయితే నైవేద్యంలో భాగంగా వడమాల సమర్పిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఆంజనేయుడు జన్మించింది శనివారమే అని పురాణాల్లో ఉంది. శనివారానికి అధిపతి శనీశ్వరుడే కదా..అందుకే శనికి ఇష్టమైన పదార్థాలను హనుమంతునికి ప్రసాదంగా సమర్పిస్తే ...హనుమాన్, శని ఇద్దరి అనుగ్రహం ఉంటుందని విశ్వసిస్తారు. అందుకే నల్లటి మినుగులతో చేసిన వడలు ఆంజనేయుడికి సమర్పిస్తే శని బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఔషధపరంగా కూడా మినుములకు ఉన్న ప్రాధాన్యత వేరు. మినుములతో చేసిన ఆహారం తింటే బలం వస్తుంది. ఆ బలానికి మారుపేరైన హనుమాన్ పేరు చెప్పి ఆ వడలు అందరకీ పంచితే మీకు మంచి జరుగుతుంది.
పప్పు బెల్లం
సాధారంగా బెల్లం నివేదనకు మంచిది. నిత్యం పిండివంటలు చేయాల్సిన అవసరం లేదు, నిత్యపూజలో భాగంగా బెల్లం నివేదిస్తే చాలు. ముఖ్యంగా వినాయకపూజలో బెల్లాన్ని నివేదిస్తారు. హనుమాన్ కి కూడా బెల్లం - వేయించిన పప్పులు నైవేద్యంగా సమర్పిస్తే మంచిదని పండితులు చెబుతారు. బెల్లం - పప్పులతో తయారుచేసిన స్వీట్స్ నైవేద్యంగా పెడతారు. సీతమ్మ అన్వేషణలో భాగంగా మార్గ మధ్యలో పప్పు బెల్లం తిన్నాడట హనుమాన్. శక్తివంతుడైన హనుమాన్ కి ఈ ఆహారం మరింత బలాన్నిచ్చిందని..అందుకే హనుమాన్ విజయోత్సవం రోజు పప్పు, బెల్లం నివేదిస్తారు
లడ్డూ
హనుమాన్ కి బూందీ కానీ, బూందీతో తయారు చేసిన లడ్డూ కానీ నైవేద్యంగా పెడతారు. ఈ రోజు బూందీ లడ్డు నివేదించేవారికి సంతోషం, విజయం తథ్యం అంటారు. ఏదైనా విజయం సాధించినప్పుడు ఇప్పటికీ చాలామంది బూందీ లడ్డు పంచిపెడతారు. పెళ్లిళ్లు, వేడుకల్లోనూ ఒప్పుడు బూందీ లడ్డు తప్పనిసరిగా పెట్టేవారు. వీటిని శుభానికి సూచనగా చెబుతారు.
పాలు - పంచదార - కుంకుమపువ్వు
ఏదైనా పనిపై బయలుదేరేముందు పంచదార కలిపిన పాలను దేవుడిక నైవేద్యంగా సమర్పించి..వాటిని తాగి వెళితే గుడ్ న్యూస్ వింటారనే సెంటిమెంట్ ఉంది. అందుకే శుభం జరగాలని కోరుకుంటూ భగవంతుడికి పాలు-పంచదార సమర్పిస్తారు. హనుమాన్ కి వీటితో పాటూ కుంకుమపువ్వు కూడా వేస్తారు.
ఆంజనేయుడి పూజలో సింధూరం, తమలపాకులు తప్పనిసరి. శనివారం రోజు ఆంజనేయుడికి ఆకుపూజ చేయిస్తే ఎలాంటి కష్టాలు అయినా దూరం అయిపోతాయి. పరమేశ్వరుడికి కూడా శనివారం ప్రీతికరమైనది. ముఖ్యంగా శనిదోషం ఉండేవారు 5 అయిదు శనివారాలు కానీ 9 శనివారాలు కానీ శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే గ్రహ బాధల నుంచి విముక్తి లభిస్తుందంటారు. ఇక శనివారం రోజు రావిచెట్టు కింద దీపం పెట్టి చుట్టూ 9 ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలంగా వెంటాడుతున్న సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతారు.
ఆంజనేయుడి ఆశీస్సులు సదా మీపై ఉండాలి
మీకు ఎప్పుడూ మంచే జరగాలి
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే . ఏబీపీ దేశం ఈ సమాచారాన్ని ధృవీకరించడం లేదు. ఇది కేవలం ప్రాధమిక సమచారం. దీనిని అనుసరించేముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల ఆదాయ వ్యయాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి






















