Food Adulteration: హైదరాబాద్ లో కల్తీ దందాకు చెక్ పెట్టేందుకు GHMC మాస్టర్ ప్లాన్ .. ఇకపై వేగంగా చర్యలు
హైదరాబాద్ లో ఫుడ్ కల్తీ విపరీతంగా పెరిగిపోయింది. రెస్టారెంట్స్ లో తినే ఆహారం మాత్రమే కాదు, ఇంట్లో వండినా కల్తీ భయం వెంటాడుతోంది. అందుకే కల్తీ కట్టడిపై కొత్త వ్యూహంతో సిద్దమైయ్యింది జీహెచ్ ఎంసీ..

హైదరాబాద్ నగరంలో రోజు రోజుకూ పెరుగుతున్న జనాభా, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇలా కారణాలు ఏవైనా ఎక్కువ శాతం మంది ఇంటి వంటకంటే బయట ఆహారం ఎక్కువగా తింటున్నారు. ఇదే అవకాశంగా చేసుకున్న కొందరు కల్తీగాళ్లు తినే ఆహార పదార్దాలను కల్తీమయంగా మార్చేస్తున్నారు. తాగే నీటి నుండి వంటలో నూనె వరకూ, నోరూరించే పప్పు నుండి అందులో వేసే ఉప్పు వరకూ, ఏకంగా నాన్ వెజ్ ను సైతం కుళ్లే వరకూ ఫిడ్జ్ లలో నిల్వ ఉంచి, రెస్టారెంట్ లో వడ్డించేస్తున్నారంటే హైదరాబాద్ లో ఆహార కల్తీ ఏ స్దాయిలో ఉందో అర్దం చేసుకోవచ్చు. కనీసం బయట కప్పు టీ త్రాగాలన్నా అందులో పాలు, టీ పౌడర్, చెక్కర ఇలా ఒక్కమాటలో చెప్పాలంటే కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్లుగా భాగ్యనగరంలో కల్తీ దందా ఓ రేంజ్ లో నడుస్తోంది.
సహజ సిద్దంగా ప్రకృతిలో లభించే యాలుకలు, మసాలా దినుసులు, అల్లం , వెల్లుల్లి ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ను మించిపోతుంది. కళ్ల ముందు నోరూరించే , వేడివేడి ఆహారం కనిపించడంతో ఆవురావురుమంటూ తినేస్తున్నాం. ఆ వేడివేడి రుచి వెనుక దాగున్న హానికరమైన , ప్రమాదకరమైన కల్తీ దందా మాత్రం పైకి కనిపించదు. ఇలా హైదరాబాద్ నగరంలో కల్తీ ఏ స్దాయిలో చేరిందంటే, మేము ఇంతే , మారమంతే.. తిని చావండి .. మాకు నష్టం లేదు.అనేంతలా కొందరు వ్యాపారులు తెగించి మరీ కల్తీ కక్కుర్తికి జనం ప్రాణాలను బలిచేస్తున్నారు.
ఇన్నాళ్లు ఎందుకు కట్టడి చేయలేకపోయారంటే..
హైదరాబాద్ మహానగరంలో కల్తీ ఏ స్దాయిలో విస్తరించిందో అధికారులకు తెలుసు. ఎంతలా మనిషి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోందో అదీ తెలుసు. కానీ కట్టడి చేయడం, పూర్తిగా నిర్మూలించే దిశగా చర్యలు తీసుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారనే సందేహలు అందరిలో ఉన్నాయి. అయితే అధికారుల వాదన మరోలా ఉంది. కల్తీ హద్దులు దాటిన మాట వాస్తవమే. , అయితే నగరంలో విపరీతంగా పెరిగిన జనాభాకు, వేగంగా విస్తరించిన కల్తీ మాఫియాకు చెక్ పెట్టే స్దాయిలో తనీఖీ సిబ్బంది లేకపోవడం, కల్తీ జరిగినట్లు ప్రాధమికంగా గుర్తించినా, ఫిర్యాదులపై అధికారులు స్పందిచినా.., టెక్నికల్ గా నిరూపించాలంటే అది టెస్టింగ్ ల్యాబ్ లో సాధ్యం. హైదరాబాద్ నగరానికి ఒకే ఒక్కటి అందుబాటులో ఉండటంతో రిపోర్ట్ రావడం విపరీతంగా ఆలస్యమైయ్యేది.దీంతో కల్తీ మాఫియాపై చర్యలు తీసుకోవడంలోనూ విపరీతంగా ఆలస్యం జరిగేది.కొన్ని సందర్భాల్లో విసిగిపోయిన ఫిర్యాదుదారులు లైట్ తీసుకోక తప్పని పరిస్దితి.
కల్తీ కట్టడికి GHMC తాజా సరికొత్త వ్యూహం ఏంటి..
నగరంలో కల్తీని కట్టడి చేయాలంటే ముందుగా టెస్టింగ్ ల్యాబ్ ల సంఖ్యను పెంచాలని భావించిన జిహెచ్ ఎంసీ అధికారులు.., హైదరాబాద్ వ్యాప్తంగా ఒక్కో జోన్ లో ఒక్కో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇలా జిహెచ్ ఎంసీ పరిధిలో ఉన్న ఆరు జోన్ లలో కొత్త టెస్టింగ్ ల్యాబ్ లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ కల్తీ కట్టడికి ప్రతీ జోన్ కు ఆయా జోనల్ కమీషనర్ ను ప్రత్యేక అధికారిగా నియమించబోతున్నారు.వీటితో పాటు 15 మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ లను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్దమైయ్యింది జిహెచ్ ఎంసి. ఇలా టెస్టింగ్ ల్యాబ్ ల సంఖ్య పెరగడంతో కల్తీ సాంపిల్స్ తీసుకున్న 14రోజుల్లోనే , ఏ స్దాయిలో కల్తీ జరిగిందో రిపోర్ట్ వేగంగా వచ్చేస్తుంది. అలా రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతోపాటు , హోటల్ లేదా వ్యాపార సముదాయం సీజ్ చేయడం ఇలా అన్ని చకచకా జరిగిపోతాయి. ఎప్పుడైతే చర్యలు కఠినంగా అమలవుతున్నాయని సంకేతాలు బయటకు వెళతాయో, అప్పుడు కల్తీ మాఫియా ఖచ్చితంగా అదుపులోొకి వస్తుంది. తాజాగా ఈ సరికొత్త వ్యూహంతో జిహెచ్ ఎంసీ కల్తీ కంత్రీల తాగతీసేందుకు సిద్దమైయ్యింది. 




















