నా పేరుకి ముందు తరవాత గౌరవ వాచకాలొద్దు, నేనూ సామాన్య కార్యకర్తనే - పార్టీ ఎంపీలకు ప్రధాని విజ్ఞప్తి
PM Modi: తన పేరుకి ముందు, తరవాత గౌరవ వాచకాలు వాడొద్దని ఎంపీలకు ప్రధాని మోదీ సూచించారు.
PM Narendra Modi:
నన్ను అలా పిలవకండి: ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీలకు కీలక సూచనలు చేశారు. పార్లమెంట్‌లో తనను పదేపదే "గౌరవనీయులైన మోదీ గారు" అని సంబోధించకూడదని వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో ఇలా సూచించారు మోదీ. తన పేరుకి ముందు, వెనక ఎలాంటి గౌరవ వాచకాలు వాడకూడదని తేల్చి చెప్పారు. ఇలా చేయడం వల్ల దేశ పౌరులకు, తనకు మధ్య దూరం పెంచినట్టవుతుందని స్పష్టం చేశారు. తాను పార్టీలో ఓ సామాన్య కార్యకర్తనే అని, ప్రజలంతా తనను కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారని చెప్పారు. పార్టీ నేతలు కూడా తనను అలాగే భావించాలని కోరారు.
"నేను పార్టీలో ఓ చిన్న కార్యకర్తను. ప్రజలు నన్ను వాళ్ల కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారు. నా పేరుకి ముందు శ్రీ, ఆదరణీయ అని గౌరవ వాచకాలు జోడించొద్దు. ఇలా పిలవడం వల్ల ప్రజలకు, నాకు మధ్య దూరం పెరుగుతుంది"
- ప్రధాని నరేంద్ర మోదీ
మూడు రాష్ట్రాల ఫలితాలపై..
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ విజయంపై నేతలతో మాట్లాడారు ప్రధాని మోదీ. ఇది టీమ్ స్పిరిట్‌కి నిదర్శనమని వెల్లడించారు. ఇదే స్ఫూర్తితో ముందుకు కొనసాగాలని పిలుపునిచ్చారు. పార్టీ గవర్నెన్స్ మోడల్ ప్రజలందరికీ నచ్చిందని అందుకే...ప్రతిసారీ తమనే ఎన్నుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకతను బీజేపీ అర్థం చేసుకుని ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయడమే ఈ గెలుపునకు కారణమని నేతలతో చెప్పారు ప్రధాని. వరుసగా రెండోసారి ఎన్నికవడంలో బీజేపీ 57% విజయం సాధించగా...కాంగ్రెస్ కేవలం 20%కే పరిమితమైందని గుర్తు చేశారు. స్థానిక పార్టీల విషయంలో ఇది 49%గానే ఉందని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ యాత్రలో ఎంపీలందరూ పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలందరికీ వివరించాలని సూచించారు.
భారతీయ జనతా పార్టీకి చెందిన 10 మంది ఎంపీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 12 మంది బీజేపీ నేతలు విజయం సాధించారు. వీరిలో పది మంది బీజేపీ ఎంపీలు తమ లోక్ సభ సభ్వతానికి బుధవారం రాజీనామా చేశారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కాలు పెట్టేందుకు ఎంపీ పదవికి కాషాయ పార్టీ నేతలు రాజీనామా చేస్తున్నారు. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి రేసులో ఉన్న బాబా బాలక్ నాథ్, రేణుకా సింగ్ ఇంకా రాజీనామా చేయకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నేతృత్వంలో ఎంపీల బృందం రాజీనామాలు సమర్పించేందుకు బుధవారం స్పీకర్‌ను కలిసింది. అనంతరం 10 మంది ఎంపీలు నేడు తమ లోక్ సభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ కు విడివిడిగా లేఖలు అందజేశారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రి అభ్యర్థులపైనే మేధోమథనం జరుగుతోంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఇప్పటికే కీలక అభ్యర్థులతో సమావేశమయ్యారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు చర్చించారు. ఈ సమావేశంలో మూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి రేస్‌లో ఉన్న అభ్యర్థులతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. మూడు రాష్ట్రాల పార్టీ ఇన్‌ఛార్జ్‌లతోనూ సమావేశమయ్యారు అమిత్‌షా, జేపీ నడ్డా.
Also Read: కాంగ్రెస్‌లో అలజడి రేపుతున్న ప్రణబ్ కూతురి పుస్తకం, రాహుల్ నాయకత్వంపై చురకలు