Jail For IAS : ఐదుగురు ఏపీ ఐఏఎస్ అధికారులకు జైలు - ధిక్కరణకు హైకోర్టు శిక్ష..!
భూమిని తీసుకుని పరిహారం చెల్లించలేదు అధికారులు. బాధితురాలు కోర్టుకెళ్లినా స్పందించలేదు. హైకోర్టు ఆదేశాలనూ పట్టించుకోలేదు. దీంతో కోర్టు ధిక్కరణ కింద ఐదుగురు ఐఏఎస్‌లకు శిక్ష విధించింది హైకోర్టు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐఏఎస్ అధికారులు కోర్టు ధిక్కరణ కేసుల్లో వరుసగా శిక్షలకు గురవుతున్నారు. గురువారం ఏపీ హైకోర్టు ఏకంగా ఐదుగురు సివిల్ సర్వీస్ అధికారులకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. IAS అధికారులు మన్మోహన్ సింగ్, రేవు ముత్యాలరాజు, ఎస్ఎస్ రావత్, ఇంతియాజ్, శేషగిరిబాబు లకు ఉన్నత న్యాయస్థానం శిక్ష విధించింది. వీరిలో మన్మోహన్ సింగ్ రిటైరయ్యారు. మిగిలిన నలుగురూ సర్వీసులో ఉన్నారు.
నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ అవసరాల కోసం తాళ్లపాక సాయిబ్రహ్మ అనే మహిళకు సంబంధించిన భూమిని అధికారులు సేకరించారు. కానీ పరిహారం ఇవ్వలేదు. ఆ మహిళ తనకు రావాల్సిన పరిహారం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అధికారులందర్నీ కలిశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. చివరికి హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం మహిళకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కానీ అధికారులు పట్టించుకోలేదు. పరిహారం చెల్లించలేదు. దీంతో తాము ఆదేశించినా పరిహారం ఇవ్వరా అని హైకోర్టు బాధ్యులైన ఐదుగురు అధికారులకు జైలు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
మన్మోహన్ సింగ్‌కు నెల రోజుల జైలు, రూ.1000 జరిమానా, శేషగిరిబాబుకు రూ.1000 జరిమానా, 2 వారాల జైలు , ఎస్.ఎస్.రావత్‌కు నెల రోజుల జైలు, రూ.1000 జరిమానా, ముత్యాల రాజుకు రెండు వారాల జైలు, రూ.1000 జరిమానా, ఇంతియాజ్‌కు నెల రోజుల జైలు రూ. 1000 జరిమానా హైకోర్టు విధించింది. వీరి జీతాల నుంచి పరిహారం వసూలు చేసి పిటిషనర్‌కు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ అధికారుల్లో శేషగిరిబాబు, రేవు ముత్యాలరాజు నెల్లూరు జిల్లా మాజీ కలెక్టర్లు, మిగిలిన వారు ఆర్థిక శాఖతో పాటు ఇతర బాధ్యతల్లో ఉన్నారు. రేవు ముత్యాలరాజు ప్రస్తుతం సీఎంవో పొలిటికల్ సెక్రటరీగా ఉన్నారు. ఎస్ఎస్ రావత్ ఆర్థిక శాఖ వ్యవహారాలను చూసుకుంటున్నారు. కీలకమైన అధికారులుక హైకోర్టు శిక్ష వేయడం అధికారవర్గాల్లో సంచనలం రేపుతోంది.
ఐదుగురు ఐఏఎస్ అధికారులకు శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు హైకోర్టు నెల రోజులు గడువిచ్చింది. ఈ క్రమంలో నెల రోజుల పాటు జైలు శిక్షను సస్పెండ్ చేసింది. ఇటీవలి కాలంలో కోర్టు ధిక్కరణ కింద కేసులకు .. శిక్షలకు గురవుతున్న అధికారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రభుత్వం పైఇప్పటి వరకూ ఎనిమిది వేల కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నట్లుగా లెక్క బయటపడింది. తమకు అన్యాయం చేశారని .. న్యాయం అందేలా చూడాలని ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో లక్షా 94వేల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లుగా లెక్కలు తేలాయి.