Gyanvapi Case: మసీదులో శ్రావణ మాసం పూజలు చేసుకోనివ్వండి, సుప్రీం కోర్టులో పిటిషన్
జ్ఞానవాపి మసీదులోని వాజుఖానాలో బయటపడిన శివలింగానికి పూజలు చేసుకునేందుకు అనుమతినివ్వాలని ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
శివలింగానికి పూజలు చేయనివ్వండి...
దేశవ్యాప్తంగా సంచలనమైన జ్ఞానవాపి కేసులో సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. జ్ఞానవాపి మసీదులోని వాజుఖానాలో బయటపడిన శివలింగానికి హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతినివ్వాలని ఓ వ్యక్తి పిటిషన్ వేశారు. వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయం పక్కనే ఉన్న ఈ మసీదులో కొన్ని నెలల క్రితం శివలింగం బయట పడింది. చాన్నాళ్ల పాటు ఈ అంశంపై వాదనలు జరిగాయి. అయితే శ్రీకృష్ణ జన్మభూమి ముక్తిస్థల్ అధ్యక్షుడు రాజేశ్ మని త్రిపతి, సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ వేశారు. శ్రావణ మాసం ప్రారంభమైనందును మసీదులోని శివలింగానికి హిందువులు పూజా కార్యక్రమాలు చేసుకునేందుకు అనుమతినివ్వాలని కోరారు. ఇది హిందువుల హక్కు అని అందులో ప్రస్తావించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మతపరమైన కార్యక్రమాలు చేసుకునే హక్కు అందరికీ ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. శ్రావణ మాసంలో శివుడికి పూజలు చేయటం హిందూ ఆచారమని, వారి హక్కులని, మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పూజలకు అనుమతినివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం, అందుకు అనుమతినిస్తూ తీర్పునిచ్చింది.
గతంలోనూ మహిళల పిటిషిన్..
ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీన వారణాసి కోర్టు ఓ కీలక తీర్పునిచ్చింది. మసీదులోని శివలింగానికి పూజలకు అనుమతించాలని ఓ ఐదుగురు హిందూ మహిళలు కోర్ట్‌లో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్ట్...ఈ అంశంపై సర్వే చేయటమే కాకుండా లోపల వీడియో తీసి సాక్ష్యాధారాలు బయట పెట్టాలని ఆదేశించింది. మే 16వ తేదీన ఈ సర్వే పూర్తైంది. మే 19న కోర్ట్‌లో ఈ సర్వేను ప్రవేశపెట్టారు. వీడియోగ్రఫీ సర్వేలో మసీదులో శివలింగం బయపడిందని హిందువులు వాదించారు. కానీ ముస్లింలు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. వాజుఖానాలో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటేన్‌కు సంబంధించిన శకలం అని వివరించారు. మే 20 వ తేదీన సుప్రీం కోర్టు ఈ కేసుని వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. " ఈ అంశం సంక్లిష్టత, సున్నితత్వాలను దృష్టిలో ఉంచుకుని, వారణాసిలోని సివిల్ జడ్జి సమక్షంలో విచారణలో ఉన్న సివిల్ దావాను ఉత్తర ప్రదేశ్ జ్యుడిషియల్ సర్వీస్‌లోని సీనియర్, అనుభవజ్ఞుడైన జ్యుడిషియల్ ఆఫీసర్ విచారిస్తే బాగుంటుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
మసీదులో సీల్ వేసిన ప్రాంతాన్ని అలానే ఉంచాలని ఆదేశించింది. ముస్లింలు యథావిధిగా నమాజ్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ కేసుపై తాము ఇచ్చిన ఆదేశాలు యథావిధిగా కొనసాగుతాయని సుప్రీం పేర్కొంది. శివలింగం బయట పడిన ప్రాంతాన్ని రక్షించాలని, ముస్లింల ప్రార్థనలూ కొనసాగాలని వారణాసి కోర్ట్ స్పష్టం చేసింది.
Also Read: New IT Laws: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం - ఆ న్యూస్ కంటెంట్ వాడితే మనీ కట్టాల్సిందే, త్వరలో ప్రకటన