Ram Mandir: అయోధ్య వేడుకతో రూ.లక్ష కోట్ల ఆదాయం, దేశవ్యాప్తంగా వ్యాపారాల్లో జోష్
Ram Mandir Inauguration: అయోధ్య వేడుక కారణంగా దేశవ్యాప్తంగా వ్యాపార రంగానికి ఒక్కసారిగా ఊపు వచ్చింది.
Ram Mandir Opening: అయోధ్య వేడుక (Ayodhya Opening Ceremony) దేశవ్యాప్తంగా బిజినెస్‌ని ఒక్కసారిగా పెంచేసింది. జనవరి 22న జరగనున్న ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవానికి దాదాపు 15 రోజుల ముందు నుంచే పలు వ్యాపారాలు కళకళలాడుతున్నాయి. కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోంది. రాముడి ప్రతిమలకు డిమాండ్ పెరిగింది. చాలా మంది బంగారంతో తయారు చేసిన రాముడి విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. ఇంట్లోనూ వేడుకలు నిర్వహించేందుకు పూజసామగ్రి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. కొన్ని చోట్ల కాలనీల్లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అన్ని చోట్లా చిరు వ్యాపారుల నుంచి బడా వ్యాపారుల వరకూ లబ్ధి పొందుతున్నారు. Confederation of All India Traders లెక్కల ప్రకారం...అయోధ్య ఉత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు రూ.లక్ష కోట్ల వ్యాపారం జరిగినట్టు అంచనా. ఇది కూడా గత కొద్ది రోజుల్లోనే. దేశవ్యాప్తంగా "హర్ షెహర్ అయోధ్య, హర్ ఘర్ అయోధ్య" క్యాంపెయిన్ కొనసాగుతోంది. దీనికి వ్యాపార వర్గాలూ మద్దతు పలుకుతున్నాయి. అంతే కాదు. ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా రకరకాల కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. బడా మార్కెట్‌లన్నీ తెరిచే ఉంచనున్నారు. ఈ మార్కెట్‌లలోనే ఈ కార్యక్రమాలు జరిపించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఢిల్లీ సహా అన్ని ప్రధాన నగరాల్లో పెద్ద మార్కెట్స్‌ని తెరిచే ఉంచుతారు. స్వీట్ షాప్‌లూ కిటకిటలాడుతున్నాయి.
30 నగరాల్లో డిమాండ్..
దాదాపు 30 నగరాల్లోని డిమాండ్‌ని పరిశీలించిన CAIT లక్ష కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా వేసింది. అయోధ్య ఉత్సవం అందరిలోనూ భక్తి భావాన్ని పెంచడంతో పాటు వ్యాపారాలకూ జోష్ ఇచ్చిందని వ్యాపారులు చెబుతున్నారు. శ్రీరాముడితో పాటు అయోధ్య ఆలయ ఫొటోలకు విపరీతమైన డిమాండ్ ఉంది. అయోధ్య ఆలయ జెండాలు, టీషర్ట్‌లూ, కుర్తాలు అమ్ముడవుతున్నాయి. పూలకు విపరీతమైన గిరాకీ పెరుగుతోంది. ఆలయాలతో పాటు ఇళ్లనూ పూలతో అలంకరిస్తుండడం వల్ల వీటి విక్రయాలు పెరిగాయి. డెకరేషన్ లైట్స్‌కీ ఇదే స్థాయిలో డిమాండ్ ఉంది. ఢిల్లీలో వ్యాపారాలకు ఎప్పుడూ లేనంత డిమాండ్ వచ్చింది. అయితే...ఈ డిమాండ్‌ని క్యాష్ చేసుకోవాలని కాకుండా భక్తిని చాటుకుంటున్నారు వ్యాపారులు. జనవరి 22న ఢిల్లీ వ్యాప్తంగా 30 వేల కార్యక్రమాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇక యూపీ ప్రభుత్వానికీ పెద్ద ఎత్తున ఆదాయం వచ్చి పడుతోంది. 2022తో పోల్చి చూస్తే గతేడాది అయోధ్య పరిసరాల్లో జరిగిన బిజినెస్‌లో చాలా మార్పు కనిపించిందని స్థానిక వర్గాలు వెల్లడించాయి. పర్యాటకుల తాకిడి పెరిగితే ఈ ఏడాది చివరి నాటికి యూపీ టూరిజం రంగానికి రూ.4 లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. 2022లో స్థానిక పర్యాటకులు రూ. 2.2 లక్షల కోట్ల మేర ఆదాయాన్నిస్తే విదేశీ పర్యాటకులు రూ.10 వేల కోట్ల వరకూ ఖర్చు చేశారని గణాంకాలు చెబుతున్నాయి. 2028 నాటికి దేశ GDPలో యూపీ వాటా ఎక్కువగా ఉండేలా చూడడమే లక్ష్యంగా పెట్టుకున్నారు యోగి ఆదిత్యనాథ్. అయోధ్య నగరానికి పర్యాటకులు తరలి వస్తుండడం వల్ల ఐదేళ్లలో ఈ లక్ష్యం సాధించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు కొందరు.
Also Read: తమిళనాడులో అయోధ్య లైవ్ టెలికాస్ట్‌పై నిషేధం! నిర్మలా సీతారామన్ తీవ్ర విమర్శలు