Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?
Tees Maar Khan 2022 Movie Review : ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ జంటగా నటించిన సినిమా 'తీస్ మార్ ఖాన్'. ఈ రోజు థియేటర్లలో విడుదలైంది.
కళ్యాణ్ జి గోగణ
ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్, సునీల్, పూర్ణ తదితరులు
సినిమా రివ్యూ : తీస్ మార్ ఖాన్
రేటింగ్ : 2/5
నటీనటులు : ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్, సునీల్, పూర్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్ తదితరులు
సినిమాటోగ్రఫీ : బాల్ రెడ్డి
సంగీతం : సాయి కార్తీక్
నిర్మాత : నాగం తిరుపతి రెడ్డి
రచన, దర్శకత్వం : కళ్యాణ్ జి గోగణ
విడుదల తేదీ: ఆగస్టు 19, 2022
తెలుగులో వరుసగా చిత్రాలు చేస్తున్న కథానాయకులలో ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఈ ఏడాది 'అతిథి దేవోభవ', 'బ్లాక్' సినిమాలతో థియేటర్లలోకి వచ్చిన ఆయన... ఇప్పుడు 'తీస్ మార్ ఖాన్' (Tees Maar Khan 2022 Movie) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) గ్లామర్ యాడ్ కావడంతో ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిలో పడింది. మరి, సినిమా (Tees Maar Khan Review) ఎలా ఉంది?
కథ (Tees Maar Khan Movie Story) : తీస్ మార్ ఖాన్ (ఆది సాయి కుమార్) అనాథ. చిన్నతనంలో తనను చేరదీసి అన్నం పెట్టిన అమ్మాయి వసు (పూర్ణ)ను అమ్మ అంటుంటాడు. అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంటాడు. ఆమెకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేడు. అమ్మ తర్వాత అతడి జీవితంలో ముఖ్యమైన మరో అమ్మాయి... అనఘ (పాయల్ రాజ్‌పుత్). తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఆమె కూడా ప్రేమిస్తుంది. జీవితం సంతోషంగా సాగుతున్న తరుణంలో తీస్ మార్ ఖాన్ జీవితంలోకి జీజా (అనూప్ సింగ్ ఠాకూర్) ప్రవేశిస్తాడు. అతనొక పెద్ద డాన్. హోమ్ మంత్రి (శ్రీకాంత్ అయ్యంగార్) మీద ఎటాక్ చేసి బెదిరించి మరీ తనపై కేసులు కొట్టేసేలా చేస్తాడు. జీజా రాకతో తీస్ మార్ ఖాన్ జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. అతని తల్లి మరణిస్తుంది. అందుకు కారణం జీజా అని తీస్ మార్ ఖాన్ భావిస్తాడు. హోమ్ మంత్రి సహాయంతో పోలీస్ అవుతాడు. జీజాను చంపేస్తాడు. అయితే... చచ్చే ముందు 'మీ అమ్మను నేను చంపలేదు' అని జీజా చెబుతాడు. అప్పుడు తీస్ మార్ ఖాన్ తల్లిని చంపింది ఎవరు? జీజా మరణం తర్వాత అతడి అన్నయ్య అంటూ కొత్తగా వచ్చిన ముంబై మాఫియా వరల్డ్ డాన్ తల్వార్ (కబీర్ సింగ్) ఎవరు? వసు మరణం వెనుక ఎవరు ఉన్నారో తీస్ మార్ ఖాన్‌కు ఎలా తెలిసింది? అతడి అమ్మతో పాటు సిటీలో కనిపించకుండా పోయిన కొంత మంది మరణాలకు, అరుదైన డైమండ్స్‌కు సంబంధం ఏమిటి? నమ్మలేని నిజాలు తెలిసిన తీస్ మార్ ఖాన్ ఏం చేశాడు? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Tees Maar Khan Review) : మాస్... పక్కా మాస్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని 'తీస్ మార్ ఖాన్'ను తెరకెక్కించారని ప్రచార చిత్రాలు చూస్తే అర్థం ఈజీగా అవుతుంది. నో లాజిక్స్, ఓన్లీ కమర్షియల్ మేజిక్‌ను నమ్మి సినిమా తీశారని విశ్రాంతి ముందు వరకూ అనిపిస్తుంది. హీరో ఇంట్రడక్షన్ నుంచి హీరోయిన్‌తో పరిచయం, విలన్స్ ఎంట్రీ, ఒకటేమిటి? ప్రతి డైలాగ్, సీన్... అన్నీ కమర్షియల్ మీటర్‌లో సాగాయి. ఆది సాయి కుమార్‌లో మాస్ యాంగిల్ బయటకు తీయాలని, అతడిని కమర్షియల్ హీరోగా నిలబెట్టాలనే ప్రయత్నం అడుగడుగునా కనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ 'రేసుగుర్రం' సినిమాను గుర్తు చేస్తుంది. అందువల్ల, అప్పటి వరకూ రొటీన్ కమర్షియల్ డ్రామాగా అనిపిస్తుంది.
ఇంటర్వెల్ తర్వాత కాసేపు 'రేసు గుర్రం' మీటర్‌లో కథ ముందుకు వెళ్లినా... ఆ తర్వాత కథలో అసలు మేటర్ బయటపెట్టారు దర్శకుడు. నిజం చెప్పాలంటే... మెయిన్ ట్విస్ట్ కొత్తగా ఉంది. మర్డర్ జీజూ చేయలేదని తెలిసిన తర్వాత కథలో వేగం పెరిగింది. అక్కడి నుంచి ముగింపు వరకూ ఆసక్తిగా ముందుకు కదిలింది. సెకండాఫ్‌లో సినిమా బావుంది. అంతకు ముందు రొటీన్ సన్నివేశాలను సైతం నిలబెట్టాలని ఆది సాయి కుమార్ పడిన తపన కనిపిస్తుంది. 'రేసు గుర్రం'లా... తనలో కమర్షియల్ మీటర్ ఉందని నిరూపించుకోవాలని గట్టిగా కృషి చేశారు. ఫైట్స్‌లో చాలా కష్టపడ్డారు. పెద్ద సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఫైట్స్ తెరకెక్కించారు. సాయి కార్తీక్ సంగీతం ఆయనకు హెల్ప్ అయ్యింది. కమర్షియల్ సినిమాకు ఎటువంటి నేపథ్య సంగీతం కావాలో... అటువంటి సంగీతం ఇచ్చారు. ప్రత్యేక గీతం మినహా మిగతా పాటలు వినసొంపుగా ఉన్నాయి. ఎమోషనల్ సాంగ్‌లో లిరిక్స్ బావున్నాయి.
ఆది సాయి కుమార్ గత సినిమాల ఫలితాలను దృష్టిలో పెట్టుకోకుండా నిర్మాతలు బాగా ఖర్చు చేశారు. అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్, సునీల్... మంచి కాస్టింగ్ ఉంది. రీసెంట్‌గా ఆది చేసిన సినిమాల్లో రిచ్ ఫిల్మ్ 'తీస్ మార్ ఖాన్' అని చెప్పవచ్చు. అలాగే, బెటర్ ఫిల్మ్ కూడా!
పాయల్ రాజ్‌పుత్ పాత్రకు కథలో పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. కమర్షియల్ సినిమాలో రెగ్యులర్ హీరోయిన్ రోల్‌లా ఉంది. పాయల్ నటన కంటే పాటల్లో గ్లామర్ హైలైట్ అవుతుంది. పూర్ణ పాత్రకు తగ్గట్లు నటించారు. సునీల్ వేరియేషన్ చూపించారు. అదేంటో స్క్రీన్ మీద చూడాలి. శ్రీకాంత్ అయ్యంగార్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్, 'మిర్చి' హేమంత్ తదితరులవి రెగ్యులర్ రోల్స్. పాత్రల పరిధి మేరకు వాళ్ళు నటించారు.
Also Read : హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?
ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : మాస్ ప్రేక్షకులను దృష్టిలో వాణిజ్య హంగులతో పెట్టుకుని తెరకెక్కించిన సినిమా 'తీస్ మార్ ఖాన్'. నో లాజిక్స్, ఓన్లీ కమర్షియల్ మేజిక్ అంతే! ఇంటర్వెల్‌కు ముందు సన్నివేశాలు, లవ్ ట్రాక్ మరీ రొటీన్‌గా కాకుండా కొత్తగా తీసే ప్రయత్నం చేస్తే బావుండేది. పాయల్ గ్లామర్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఆది సాయి కుమార్ 'రేసు గుర్రం'లా హుషారుగా చేశారు.
Also Read : తెలుగులో పబ్లిసిటీ లేకుండా విడుదలైన ధనుష్, నిత్యా మీనన్ 'తిరు' సినిమా ఎలా ఉందంటే?