Chhatriwali Review - 'ఛత్రివాలి' రివ్యూ : కండోమ్ టెస్టర్‌గా రకుల్ శృంగార పాఠాలు - సినిమా ఎలా ఉందంటే?
OTT Review - Chhatriwali In Zee5 : తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన రకుల్ ప్రీత్ సింగ్ కండోమ్ టెస్టర్‌గా నటించిన హిందీ సినిమా 'ఛత్రివాలి'. జీ 5 ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదలైంది.
తేజాస్ దేవోస్కర్
రకుల్, సుమిత్ వ్యాస్, రాజేష్ తైలాంగ్, ప్రాచీ షా పాండ్య తదితరులు
రివ్యూ : ఛత్రివాలి (హిందీ సినిమా)
రేటింగ్ : 2/5
నటీనటులు : రకుల్ ప్రీత్ సింగ్, సుమిత్ వ్యాస్, సతీష్ కౌశిక్, డాలీ అహ్లువాలియా, రాజేష్ తైలాంగ్, ప్రాచీ షా పాండ్య, రాకేష్ బేడీ తదితరులు
కథ : సంచిత్ గుప్తా, ప్రియదర్శి శ్రీవాత్సవ
నిర్మాత : రోనీ స్క్రూవాలా
దర్శకత్వం : తేజాస్ ప్రభ విజయ్ దేవోస్కర్
విడుదల తేదీ: జనవరి 20, 2023
ఓటీటీ వేదిక : జీ5
హిందీ సినిమా 'ఛత్రివాలి' ట్రైలర్ తెలుగు ప్రేక్షకులకూ చేరువైంది. రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలో నటించడంతో సౌత్ ఆడియన్స్ కూడా చూశారు. కండోమ్ టెస్టర్ పాత్రలో రకుల్ అనేది ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. మరి, సినిమా ఎలా ఉంది?
కథ (Chhatriwali Story): సాన్యా ధింగ్రా (రకుల్ ప్రీత్ సింగ్) కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్. ఇంటి దగ్గర పిల్లలకు ట్యూషన్లు చెబుతూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంది. అప్పుడు కండోమ్ కంపెనీలో టెస్టర్‌గా (కండోమ్ క్వాలిటీ మేనేజర్‌గా) పని చేసే అవకాశం ఆమెను వెతుక్కుంటూ వస్తుంది. మొదట 'నో' చెబుతుంది. కొన్ని రోజులు ఆగాక... డబ్బు కోసం 'ఎస్' అనక తప్పదు. తాను కండోమ్ కంపెనీలో క్వాలిటీ హెడ్ ఉద్యోగం చేస్తున్నాననే విషయం దాచి రిషి కార్ల (సుమిత్ వ్యాస్)ను పెళ్లి చేసుకుంటుంది. డబ్బు కోసమే కండోమ్ కంపెనీలో ఉద్యోగం చేయడానికి వెళ్ళినా... కండోమ్ ఇంపార్టెన్స్ సాన్యాకు ఎప్పుడు, ఎలా తెలిసింది? ఆమె ఉద్యోగం గురించి తెలిసిన తర్వాత రిషి ఎలా స్పందించాడు? ముఖ్యంగా పద్ధతులు, సాంప్రదాయాలకు విలువ ఇచ్చే రిషి అన్నయ్య రాజన్ (రాజేష్ తైలాంగ్) ఏమన్నాడు? కండోమ్ కంపెనీలో ఉద్యోగం చేసే సాన్య పిల్లలకు శృంగార పాఠాలు చెప్పడం ఎందుకు ప్రారంభించింది? ఆమెను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ : గతేడాది హిందీలో కండోమ్ ఇంపార్టెన్స్ నేపథ్యంలో 'జన్‌హిత్ మే జారీ' సినిమా వచ్చింది. అందులో నుష్రత్ భరూచా మెయిన్ రోల్ చేశారు. ఇప్పుడు ఈ 'ఛత్రివాలి' రెండోది. ఇందులో రకుల్ నటించారు. ప్రధాన తారలు వేర్వేరు కావడం మినహాయిస్తే... రెండు సినిమాల్లో కోర్ పాయింట్ ఒక్కటే. కథ, కథనాలు, కథను మలుపు తిప్పే సన్నివేశాలు, మెయిన్ లీడ్ క్యారెక్టరైజేషన్ సైతం ఇంచు మించు ఒకేలా ఉంటాయి. 'జన్‌హిత్ మే జారీ'కి 'ఛత్రివాలి' మరో వెర్షన్ అన్నట్లు ఉంటుంది. ఆ పోలిక పక్కన పెట్టి 'ఛత్రివాలి' సినిమాకు వస్తే...
స్టార్టింగ్ టు ఎండింగ్... 'ఛత్రివాలి'లో తర్వాత ఏం జరుగుతుందో చెప్పడం పెద్ద కష్టం ఏమీ కాదు. ప్రేక్షకుడి ఊహలకు అనుగుణంగా సినిమా సాగుతుంది. అయితే కొన్ని సన్నివేశాలు మహిళలతో పాటు పురుషులను సైతం ఆలోచనలో పడేస్తాయి. అందుకు ఉదాహరణ... 'ఓ మహిళ శరీరం ఎన్ని అబార్షన్స్ తట్టుకుంటుంది' అని క్లైమాక్స్‌లో రకుల్ తోడికోడలుగా నటించిన ప్రాచీ ప్రశ్నించే సన్నివేశం! ఆ తర్వాత తండ్రితో కుమార్తె సంభాషణ. ఆస్పత్రిలో ప్రాచీ సన్నివేశం కూడా ఆలోచింపజేసేలా ఉంటుంది. పాఠ్య పుస్తకాల్లో ఉన్నప్పటికీ పిల్లలకు శృంగార పాఠాలు ఎందుకు బోధించడం లేదని రకుల్ ప్రశ్నించే సన్నివేశం, శృంగార పరమైన సందేహాలను రకుల్ దగ్గరకు వెళ్ళి పిల్లలు అడిగి తెలుసుకునే సన్నివేశం సమాజంలో ఎంత మేరకు అవగాహన ఉందనేది చెప్పాయి.
సేఫ్ సెక్స్, కండోమ్ ఇంపార్టెన్స్ గురించి ప్రజలకు వివరించే చిత్రమిది. దర్శక నిర్మాతల ఆలోచన బావుంది. దానికి కొత్తదనం తోడైతే ఇంకా బావుండేది. భారత దేశంలో కొన్ని విషయాలు, ముఖ్యంగా శృంగార పరమైన అంశాలు డిస్కస్ చేయడానికి ఇబ్బంది పడుతున్న జనాలు ఉన్నారు. వాళ్ళను ఎడ్యుకేట్ చేయాలని అనుకోవడం మంచిదే. కానీ, మరీ మూస పద్ధతిలో... ఇంతకు ముందు ఈ తరహా కథాంశాలతో వచ్చిన సినిమాల దారిలో 'ఛత్రివాలి' సాగింది.
నటీనటులు ఎలా చేశారంటే? : సాన్యా ధింగ్రా పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్ న్యాయం చేశారు. గ్లామర్ పక్కన పెట్టి, జస్ట్ క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా యాక్టింగ్ చేశారు. సుమిత్ వ్యాస్ స్క్రీన్ స్పేస్ తక్కువే. ఉన్నంతలో, పాత్ర పరిధి మేరకు నటించారు. హీరోయిన్ బావ పాత్రలో రాజేష్ తైలాంగ్ నటన ఆకట్టుకుంటుంది. కథలో కీలకమైన క్యారెక్టర్ అంటే... ప్రాచీ షాదే. ఆమెతో పాటు కుమార్తెగా నటించిన అమ్మాయి కూడా చక్కగా నటించారు. వాళ్ళు ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. మిగతా నటీనటులు పర్వాలేదు.
Also Read : మతిమరుపు అంజలి కథ ఆకట్టుకుంటుందా? - ఝాన్సీ రెండో సీజన్ ఎలా ఉంది?
చివరగా చెప్పేది ఏంటంటే? : అబార్షన్స్, సేఫ్ సెక్స్, కండోమ్ వాడకం గురించి ప్రేక్షకులకు సందేశం ఇచ్చే చిత్రమిది. రొటీన్ ఫార్ములాలో తీశారు. 'జన్‌హిత్ మే జారీ' రావడంతో ఆల్రెడీ చూసిన సినిమాను మరో వెర్షన్ చూసినట్టు ఉంటుంది... అంతే! ఆ సినిమాలో ఉన్న వినోదమూ ఈ సినిమాలో లేదు. రొటీన్ డ్రామాలో రకుల్, ప్రాచీ షా నటన కొన్ని సన్నివేశాలను నిలబెట్టింది.
Also Read : '3Cs' వెబ్ సిరీస్ రివ్యూ : అమ్మాయిలు డ్రగ్స్ కలిపిన వోడ్కా తాగి, ఆ 'హ్యాంగోవర్'లో రచ్చ చేస్తే?