Loss of Smell: రుచి, వాసనా గుర్తించలేకపోతున్నారా? తేలికగా తీసుకోకండి, కారణాలు ఇవి కావచ్చు
చాలా మందిలో రుచిని, వాసనను గ్రహించే శక్తి తగ్గిపోతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది తేలికగా తీసుకునే విషయం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మల్లెపువ్వును ముక్కు దగ్గర పెట్టుకోండి... ఏ వాసనా రావడం లేదా? అందరూ బిర్యానీని ఆస్వాదిస్తూ తింటుంటే మీకు మాత్రం పెద్దగా రుచి తెలియడం లేదా? అయితే ఇది తేలికగా తీసుకునే విషయం కాదు. రుచి, వాసన కోల్పోవడమనేది వినడానికి తేలికగా కనిపించవచ్చు కానీ, దాని వెనుక చాలా పెద్ద కారణాలే ఉండే అవకాశం ఉంది. నిజానికి వయసు పెరుగుతున్న కొద్దీ గ్రాహ్య శక్తి తగ్గడం సహజం కానీ ఇంకా 30,40లలో ఉన్నవారికి కూడా ఇదే లక్షణాలు కనిపిస్తే మాత్రం కాస్త సీరియస్ గా తీసుకోవాల్సిందే. ఈ రెండు తగ్గడం కొన్నిసార్లు తీవ్రజబ్బులకు సంకేతాలు కావచ్చు.
ఏఏ సందర్భాల్లో రుచి, వాసన కోల్పోవచ్చు?
1. వైరల్ ఇన్ ఫెక్షన్లు, జ్వరాల సమయంలో తాత్కాలికంగా రుచి, వాసన శక్తి తగ్గిపోతుంది. ఏమి తిన్నా ఆసక్తిగా అనిపించదు. ఇది నాలుగైదు రోజుల్లో తగ్గిపోతుంది.
2. కరోనా వైరస్ బారిన పడిన వారిలోనూ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. కొంతమందిలో వాసన చూసే శక్తి చాలా రోజుల పాటూ కోల్పోవడం జరుగుతుంది. రుచి కూడా తెలియడం లేదు. కొందరికి ఈ శక్తి పది రోజులకే తిరిగి వచ్చేస్తోంది. మరికొంతమందికి మాత్రం ఆరునెలల వరకు సమయం పడుతోంది.
3. క్యాన్సర్ బారిన పడిన వారిలో రేడియేషన్ వంటి చికిత్సలు తీసుకుంటున్నప్పుడు కూడా ఆ రెండు శక్తులు పనిచేయవు. చికిత్స ఆపేశాక సాధారణ స్థితి వచ్చేస్తుంది.
4. నోటి ఇన్ ఫెక్షన్లు వచ్చినప్పుడు కూడా ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
5. పార్కిన్సన్స్, అల్జీమర్స్ జబ్బులు దాడి చేసేసమయంలో కూడా వాసన సామర్థ్యం తగ్గిపోతుంది.
కాబట్టి వాసన, రుచి తెలియనప్పుడు తేలికగా తీసుకోకండి. కారణమేంటో కనుక్కునే ప్రయత్నం చేయండి. వాసన శక్తి తగ్గిందనిపిస్తే ఇంట్లోనే ప్రాక్టీసు చేయండి. ఘాటైన వాసనలు ఇచ్చే వెల్లుల్లి, పుదీన, మసాలాలు, చేపలు వంటివి వాసన చూస్తూ ఉండండి.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: నిద్ర సరిగా పట్టడం లేదా... అయితే మీకు ఈ విటమిన్ లోపం ఉన్నట్టే
Also read: రోజూ ఇలా పసుపు నీళ్లు తాగితే... ఊహించని ప్రయోజనాలు
Also read: ఒకే కాన్పులో తొమ్మిది మంది పిల్లలు... రోజుకు వంద డైపర్లు, ఆరు లీటర్ల పాలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి