Avanthika Sundar: ఖుష్బూ కూతురి కష్టాలు... పేరెంట్స్ ముందుకు రావట్లేదు... సినిమా ఎంట్రీ కష్టాలు విన్నారా?
Avanthika Sundar : సీనియర్ నటి ఖుష్బూ సుందర్ కూతురు అవంతిక సినిమా ఎంట్రీకి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె తన తల్లిదండ్రులు ఎప్పుడూ తనను లాంచ్ చేయడానికి ముందుకు రాలేదంటూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి నెపోటిజం అనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా స్టార్ కిడ్స్ కి ఈ వివాదం లేనిపోని చిక్కులు తెచ్చి పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా మరో స్టార్ కిడ్ అవంతిక సుందర్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. కానీ ఆమె మాత్రం తనను నెపోకిడ్ గా చూడడానికి ఎలాంటి అవకాశం ఇచ్చేలా కనిపించట్లేదు. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రులు ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ - డైరెక్టర్, నటుడు సుందర్ సి తనను లాంచ్ చేయడానికి ముందుకు రాలేదని చెప్పింది.
అదే అసలైన మైనస్
90లలో సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నటీమణుల్లో ఖుష్బూ సుందర్ కూడా ఒకరు. ఆమె నటి మాత్రమే కాదు నిర్మాత, రాజకీయ నాయకురాలు కూడా. అప్పట్లో ఏకంగా ఈ హీరోయిన్ కి గుడి కూడా కట్టారు. మరోవైపు ఆమె భర్త, దర్శకుడు సుందర్ దర్శకుడిగా, నటుడిగా రాణిస్తున్నారు. కుష్బూ - సుందర్ దంపతులకు అవంతిక, అనంతిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిద్దరూ కూడా ఖుష్బూ లాగానే అందంగా కనిపిస్తారు. నిజానికి మొదట్లో వీరిద్దరూ లావుగా ఉండడంతో ఎన్నోసార్లు ట్రోలింగ్ బారిన పడ్డారు. కానీ ఇటీవల కాలంలో బరువు తగ్గి చాలా స్లిమ్ గా అందంగా తయారయ్యారు.
ఖుష్బూ పెద్ద కూతురు అవంతిక లండన్ లో యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆలోచనలో ఉన్న అవంతిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినిమా ఎంట్రీ గురించి మాట్లాడింది. "నేను ఏ భాషలోనైనా సరే నటించడానికి రెడీగా ఉన్నాను. మంచి కథల కోసం ఎదురుచూస్తున్నాను. అయితే నా మూవీ జర్నీకి నా హైట్ ఒక అడ్డంకిగా మారుతుందని నాకు తెలుసు. ఇలా ఎక్కువగా హైట్ ఉండడం వల్ల నా ఫస్ట్ ఛాన్స్ కోసం చాలా కాలం వేచి ఉండాల్సి వస్తుంది. ఇక్కడ నటీమణులు ఇలాగే ఉండాలని చెప్పే వ్యవస్థలో నేను భాగం కాదు. కాబట్టి ఈ ఇబ్బందులు తప్పవు. నా టీనేజ్లో నేను అధిక బరువుతో, కళ్లద్దాలు పెట్టుకుని ఉండేదాన్ని. దీంతో హీరోయిన్లలా కనిపించడం కష్టమని చాలా బాధపడ్డాను. కానీ కరోనా తర్వాత నా శరీరాన్ని మార్చుకుని నా కలను సాధించాలనుకున్నాను.. ఇప్పుడు నాకు అన్ని రకాల పాత్రలను పోషించాలని ఉంది.. ఇదొక సెల్ఫిష్ కోరిక. కానీ ఓ నటి ఒకే సర్కిల్లో ఉండడం ప్రమాదకరమని నేను భావిస్తున్నాను" అంటూ తన మనసులోని మాటని బయటపెట్టింది.
తల్లిదండ్రుల సపోర్ట్ లేకుండానే...
ఇక తన తల్లిదండ్రులు తన సినీ కెరీర్ లో ఏం చేయాలి ? ఏం చేయకూడదు అనేది చెప్పలేదని, తనకు ఏది సౌకర్యంగా ఉందో అదే చేస్తానని వెల్లడించింది. అంతేకాకుండా "నా తల్లిదండ్రులు ఎప్పుడూ నన్ను లాంచ్ చేయాలని అనుకోలేదు. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా తల్లిదండ్రులు ఈ విషయంలో కల్పించుకోవాలని కోరుకోలేదు. తల్లిదండ్రుల కారణంగా సినీ పరిశ్రమలో నాకొక స్పెషల్ స్థానం ఉందనేది వాస్తవం. అయితే కనీసం నన్ను ఇండస్ట్రీ వ్యక్తులతో కనెక్ట్ చేయడంలో వాళ్ళ సహాయం ఖచ్చితంగా కావాలి. వారి సపోర్ట్ లేకుండా నాకు ఇది సాధ్యం కాదు. ఇక స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం అనేది ఎంత ఒత్తిడితో కూడుకున్నదో నాకు తెలుసు. అయితే నేను వాళ్లకంటే ఎక్కువగా సక్సెస్ సాధిస్తానని చెప్పలేను. కానీ ఖచ్చితంగా సక్సెస్ ని సాధించడానికి నా వంతు ప్రయత్నం చేయగలను" అంటూ చెప్పుకొచ్చింది అవంతిక.





















