800 Year Shiva Temple: అమరావతిలో వెలుగులోకి వచ్చిన 800 ఏళ్ల నాటి శివాలయం.. రుద్రమదేవి శాసనం
Andhra Pradesh News | అమరావతిలో 800 ఏళ్ల నాటి శివాలయం, రుద్రమదేవి శాసనం వెలుగులోకి వచ్చాయి. సెక్రటేరియట్ కు సమీపంలో ఈ శివాలయం ఉంది.

అమరావతి: ఆంధ్రుల రాజధాని అమరావతి(Amaravati)లో 800 ఏళ్లనాటి శివాలయం వెలుగులోకి వచ్చింది. ఏపీ సెక్రటేరియట్ కు కూత దూరంలో మల్కాపురం వద్ద ఈ శివాలయం ఉంది. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు తన సింహాసనాన్ని కుమార్తె రుద్రమదేవికి అప్పగించే సమయంలో అంటే 1261 CE ప్రాంతం లో ఈ దేవాలయాన్ని కట్టించాడు. తన ఆచార్యుడు విశ్వేశ్వరుడి గుర్తుగా శివునికి అంకితం చేస్తూ ఈ విశ్వేశ్వరాలయాన్ని ఆయన నిర్మించాడు. ఇక్కడ కృష్ణా నది ఉత్తరంగా ప్రవహిస్తూ మలుపు తిరిగి మల్కాపురం- మందడం సమీపంలో దక్షిణ దీశగా ప్రవహిస్తూ ఆ ప్రాంతాన్ని ఒక ద్వీపంలో ఏర్పరిచింది. అందుకే దీనిని ఒక పవిత్ర ప్రదేశంగా భావిస్తూ గణపతి దేవ చక్రవర్తి శివునికి ఈ ఆలయం కట్టించాడని ప్రముఖ హిస్థారియన్ Dr. ఈమణి. శివనాగి రెడ్డి తెలిపారు.
కాకతీయుల కాలంలో ఒక వెలుగు వెలిగిన ఈ క్షేత్రం తర్వాత కాలంలో తన ప్రభను కోల్పోయింది. ఆలయం పూర్తిగా ప్రజల మనసులోంచి చెరిగిపోగా ఈ గుడి శిధిలాలను " పిచ్చుకగూళ్ళు"గా స్థానికులు పిలుచుకునేవారు. ఈ శివాలయం చుట్టూ ఇళ్ళు వచ్చేసాయి. అయితే ఇప్పుడు అమరావతి పనులు ప్రారంభం కావడంతో నెమ్మదిగా ఈ గుడి ప్రాముఖ్యత బయటపడటం మొదలైంది. ఈ గుడికి ఒక పెద్ద కోనేరు ఉండగా అది ఒక మురికి చెరువు స్థాయికి పడిపోయింది. ఇటీవల కాలంలో ఈ గుడి చరిత్ర తెలిసిన వారు దీనిని కొంత మెరుగుపరిచి గుడిలో నందీశ్వరుడు, కాలభైరవ స్వామిని ప్రతిష్టించారు. గుడికి కాస్త తెల్లరంగు వేయించి గేటు పెట్టి రక్షణ కల్పించారు. అయినప్పటికీ దీనిని పరిరక్షించాల్సిన అవసరం మరింత ఉంది. ఇటీవలి కాలం లో గుడిలో పూజలు కూడా మళ్లీ జరగడం మొదలైంది.
గుడి సమీపంలో రుద్రమదేవి శాసనం.. అందులో ఏముందంటే...!
వందల ఏళ్లనాటి ఈ శివాలయం సమీపంలోనే రుద్రమదేవి వేయించిన జన్మదిన శాసనం ఉంది. 200 పైచిలుకు లైన్ల లో ఉన్న ఈ అచ్చ తెలుగు శాసనం లో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. గణపతి దేవ చక్రవర్తి రుద్రమదేవి పుట్టినరోజు నాడు రాజ్యాన్ని ఆమెకు అప్పగించినట్లు అందులో స్పష్టంగా రాసి ఉంది. అలాగే ఆ ప్రశాంతమైన వాతావరణం లో కాకతీయ రాజ్యంలోని రోగులు చికిత్స పొందేలా ఒక ప్రజా వైద్యశాలను నిర్మించినట్టు దానికోసం రకరకాల వైద్య మూలికల పెంపకానికి ప్రస్తుతం అమరావతి రాజధాని ఉన్న ప్రాంతం దానం చేసినట్టు ఉంది.
13 అడుగుల ఎత్తైన ఈ శాసనం పై సర్ప మకుటం, నంది విగ్రహం ఉన్నాయి. ప్రస్తుతం ఆ శాసనం పైన ఉన్న నంది విగ్రహం తల విరిగిపోయి ఉంది. చుట్టూ ఇళ్ల మధ్య ఉన్న ఈ శాసనం ఒకప్పుడు శివాలయం పరిధిలోనే ఉండేది. శివాలయం, రుద్రమదేవి శాసనం, కోనేరు కలిపితే అప్పట్లో ఇక్కడ ఎంత పెద్ద క్షేత్రం ఉండేదో అర్థమవుతుంది. అమరావతి రాజధాని పనుల కారణంగా వెలుగులోకి వచ్చిన ఈ కాకతీయుల శివాలయం, రుద్రమదేవి శాసనాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనా, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పైనా ఉందని హిస్టారియన్ Dr. ఈమణి శివనాగి రెడ్డి తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

