Guntur Crime News: గుంటూరులో దారుణం.. వీధి కుక్క దాడిలో 4 ఏళ్ల చిన్నారి మృతి, స్పందించిన మంత్రి నారాయణ
గుంటూరులో దారుణం జరిగింది. వీధి కుక్క దాడిలో 4 ఏళ్ల చిన్నారి మృతిచెందడంతో విషాదం నెలకొంది.

గుంటూరులో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు గుంటూరులోని స్వర్ణ భారతి నగర్లో ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి ఐజక్ పై దాడి చేసింది. బాలుడు తప్పించుకునే ప్రయత్నం చేసినా వీధి కుక్క విడవకుండా దాడి చేయడం తో తీవ్ర గాయాలపాలైన ఐజక్ ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గాయాల తీవ్రత అధికంగా ఉండడంతో బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.దీంతో బాలుడి తల్లిదండ్రులు నాగరాజు, రాణి కన్నీరుమున్నీరవుతున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న నల్లపాడు పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఇక అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు తమ కళ్ళముందే ఇలా వీధి కుక్క దాడిలో చనిపోవడంతో తల్లితండ్రుల బాధ వర్ణనాతీతంగా మారింది. తల్లి రాణి అయితే ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది.
తల్లిదండ్రులకు అండగా ఉంటాం : మంత్రి నారాయణ
గుంటూరు స్వర్ణ భారతి నగర్ లో కుక్క కాటుతో నాలుగేళ్ల చిన్నారి మృతిపై విచారం వ్యక్తం చేసారు మున్సిపల్ మంత్రి నారాయణ. ఈ ఘటనకు గల కారణాలపై జిల్లా ఇంచార్జి కలెక్టర్ భార్గవ తేజ,జీఎంసీ కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడిన మంత్రి ఆదేశించడం తో గుంటూరు జీజీహెచ్ లో చిన్నారి గోపీ తల్లిదండ్రులను పరామర్శించారు కమిషనర్ శ్రీనివాసులు..ప్రభుత్వం తరపున కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ కూడా ఘటనపై వివరాలు తెలుసుకొని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన మరోసారి జరగకుండా చూసుకుంటామన్నారు.
గుంటూరులో పెరిగిపోయిన వీధి కుక్కల హల్ చల్
పేరుకు పెద్ద నగరమే అయినా వీధి కుక్కల బాధను అరికట్టడంలో గుంటూరు నగరపాలక అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటూ విమర్శలు ఎప్పటినుంచో వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఈ బాలుడి పై దాడి చేసే తన చావుకు కారణం అయ్యే వరకు వీధి కుక్కల హల్చల్ పెరిగిపోయింది. ఇప్పటికైనా నగరపాలక సంస్థ ఈ సమస్య పై దృష్టి సారించాలన్న డిమాండ్ స్థానికుల నుంచి బలంగా వినిపిస్తోంది.





















