Decision On Repo Rate: అందరి దృష్టి RBI MPC మీటింగ్ మీదే, ఏప్రిల్ 9న ఏం జరుగుతుంది?
RBI Monetary Policy Meeting: దేశంలో ద్రవ్యోల్బణం RBI టాలరెన్స్ బ్యాండ్ పరిధిలోనే ఉంది. కాబట్టి, కేంద్ర బ్యాంక్ ఫోకస్ ద్రవ్యోల్బణం నియంత్రణ మీద కాకుండా, ఆర్థిక వృద్ధిపై ఉంటుంది.

RBI Monetary Policy Committee Meeting April 2025: 2025-26 ఆర్థిక సంవత్సరం (FY26)లో మొదటి కీలక సమావేశాన్ని కేంద్ర బ్యాంక్ ప్రారంభించింది. 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) మూడు రోజుల 'ద్రవ్య విధాన కమిటీ' (MPC) సమావేశం ఈ రోజు (సోమవారం, 07 ఏప్రిల్ 2025) నుంచి ప్రారంభమైంది. ఈ సమావేశ తుది నిర్ణయం బుధవారం (09 ఏప్రిల్ 2025) ఉదయం 10 గంటలకు వెలువడుతుంది.
మీరు తీసుకున్న లోన్ భారం తగ్గుతుందా?
2025 ఫిబ్రవరిలో జరిగిన MPC మీటింగ్‌లో RBI అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది, రెపో రేటును 0.25 శాతం (25 bps) తగ్గించింది. దీంతో, రెపో రేటును 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గింది. దాదాపు ఐదు సంవత్సరాల్లో ఇది మొదటి కోత. ఇప్పుడు కూడా ఆర్‌బీఐ 0.25 శాతం కోత విధిస్తుందని మార్కెట్ భావిస్తోంది. దీని అర్థం, ఇప్పటికే తీసుకున్న లేదా కొత్తగా తీసుకోబోయే రుణాలు చవకగాల మారతాయి & EMI భారం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. మొత్తం సంవత్సరంలో 0.75 శాతం (75 bps) తగ్గింపును చూడవచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా అంచనా వేసింది.
రెపో రేటు అంటే?
రెపో రేటు అంటే, RBI బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు. ఈ రేటు తగ్గినప్పుడు, బ్యాంకులు కూడా ప్రజలకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి, దీని కారణంగా EMI తగ్గుతుంది. తద్వారా ప్రజల దగ్గర డబ్బు మిగులుతుంది, ఖర్చు చేసే స్థోమత పెరుగుతుంది.
అదుపులో ద్రవ్యోల్బణం
ఆర్‌బీఐ 'ద్రవ్యోల్బణ నియంత్రణ లక్ష్యం' 2-6 శాతం మధ్య ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ద్రవ్యోల్బణం (Inflation) ఈ పరిధిలోనే ఉంది. ఫలితంగా, ఆర్‌బీఐ దృష్టి ఆర్థిక వృద్ధిని పెంచడంపై ఉంటుంది. కాబట్టి, చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లు, సాధారణ ప్రజలకు ఉపశమన వార్త అందవచ్చు.
ప్రపంచ పరిణామాల నుంచి భారతదేశం ఎలా ప్రయోజనం పొందుతుంది?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) 60 దేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. ఈ లిస్ట్‌లో భారత్ & చైనా కూడా ఉన్నాయి. ఈ సుంకాలు 10 శాతం నుండి 49 శాతం వరకు ఉన్నాయి. ఇప్పటికే బేస్ టారిఫ్ అమల్లోకి రాగా, మిగిలిన టారిఫ్‌లు ఏప్రిల్ 09 నుంచి అమల్లోకి వస్తాయి. అదే రోజున RBI తన ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఇది భారతదేశానికి ఒక అవకాశంగా మారవచ్చు. చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలు అమెరికన్ మార్కెట్లో ఖరీదైనవిగా మారితే, అక్కడ భారత ఎగుమతిదారులకు స్పేస్ ఏర్పడుతుంది. దీని అర్థం మన ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.
ఇప్పుడు ఏం చూడాలి?
టారిఫ్‌ల యుద్ధ మేఘాల నడుమ, ఆర్థిక సమతుల్యతను RBI ఎలా కాపాడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక వైపు దేశీయ అభివృద్ధి అవసరాలు, మరోవైపు ప్రపంచ వాణిజ్యంలో మారుతున్న వాతావరణం కళ్లెదుట కనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితిలో వడ్డీ రేట్లు మళ్ళీ తగ్గిస్తారా, లేదా అనేది పెద్ద సంశయం. గృహ రుణాలు చౌకగా మారతాయా, వాహణ రుణాల EMIల్లో ఉపశమనం ఉంటుందా, కొత్త ఆర్థిక సంవత్సరంలో MSME రంగానికి ప్రోత్సాహం లభిస్తుందా అనేవి ప్రస్తుతం ఉన్న ప్రశ్నలు. ఈ సందేహాలన్నింటికీ ఏప్రిల్ 9న ఉదయం 10 గంటలకు సమాధానాలు దొరుకుతాయి.





















