Black Monday: బ్లాక్ మండే భయం నిజమైంది - సెన్సెక్స్ 3300 పాయింట్లు, నిఫ్టీ 1000 పాయింట్లు పతనం
Stock Market Crash: ట్రంప్ టారిఫ్‌ల కారణంగా ఆసియా స్టాక్ మార్కెట్లలో భూకంపం వచ్చింది. హాంకాంగ్ మార్కెట్లు 10 శాతం పడిపోయాయి, జపాన్ మార్కెట్లు 8 శాతం క్షీణించాయి.

Stock Market Crash On Trump Tariffs Pressure: ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన ప్రపంచ స్టాక్ మార్కెట్ల మీద సునామీలా విరుచుకుపడింది, పెట్టుబడిదార్ల సంపదను అమాంతం తుడిచిపెట్టేసింది. సోమవారం మార్కెట్లకు బ్లాక్ మండే (Black Monday) అవుతుందని ముందు నుంచీ ఊహించినదే నిజమైంది. సుంకాల భూకంపానికి ఆసియా మార్కెట్లు పేకమేడల్లా ఊగిసలాడాయి, కుప్పకూలాయి. ఆ ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్‌లోనూ కనిపించింది, సెన్సెక్స్ దాదాపు 3300 పాయింట్లు పడిపోయింది, ఏకంగా 4.70 శాతం పతనమైంది. NSE నిఫ్టీ దాదాపు 1000 పాయింట్లు పడిపోయింది. BSE లిస్టైన కంపెనీల మార్కెట్ క్యాప్, ట్రేడ్ ఓపెనింగ్‌లో ఒక్కసారిగా రూ.19.39 లక్షల కోట్లు తగ్గింది. అంటే మార్కెట్ ప్రారంభమైన సెకన్ల వ్యవధిలోనే పెట్టుబడిదారుల సంపద రూ.19.39 లక్షల కోట్లు ఆవిరైంది.
ఈ రోజు (సోమవారం, 07 ఏప్రిల్ 2025) ఉదయం 9.22 గంటల సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 3,233 పాయింట్ల పతనంతో 72,130 వద్ద ఉండగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 1,022 పాయింట్లు క్షీణించి 21,882 వద్ద కొనసాగింది.
ఉదయం 10.10 గంటల సమయంలో సెన్సెక్స్ 2,830 పాయింట్లు లేదా 3.76% పతనంతో 72,534 వద్ద ఉండగా, నిఫ్టీ 917 పాయింట్లు లేదా 4.01% క్షీణించి 21,986 వద్ద ట్రేడ్ అవుతోంది.
భయంతో బెంబేలెత్తిన ఆసియా మార్కెట్లు
సుంకాల సునామీ కారణంగా ఆసియా స్టాక్ మార్కెట్లు అత్యంత భారీ నష్టాలను, చేదు జ్ఞాపకాన్ని చవిచూశాయి. హాంకాంగ్ మార్కెట్లు 10 శాతం వరకు పడిపోయాయి. చైనా & జపాన్ వరకు మార్కెట్లు 8 శాతం వరకు క్షీణించాయి. ఆస్ట్రేలియాకు చెందిన S&P 200 సూచీ 6.5 శాతం తగ్గి 7184.70 కి చేరుకోగా, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 5.5 శాతం తగ్గి 2328.52 కి దిగి వచ్చింది. ఈ భారీ పతనం అమెరికా నుంచే మొదలైంది. శుక్రవారం, US మార్కెట్లు కుదేలయ్యాయి. నాస్‌డాక్ దాదాపు 7 శాతం క్షీణతతో ముగిసింది. 2020 తర్వాత అక్కడి మార్కెట్లకు ఇది అత్యంత చెత్త వారం.
ఇది ట్రైలర్ మాత్రమే!
ఇప్పుడు చూస్తోంది ట్రైలర్ మాత్రమేనని, సిసలైన సినిమా ఇంకా బిగిన్ కాలేదని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితిని నియంత్రించకపోతే అమెరికన్ మార్కెట్లలో 1987 నాటి సంక్షోభం సీన్‌లు రిపీట్ అవుతాయని హెచ్చరించారు.
"ఈ వారం ప్రపంచ & భారతీయ మార్కెట్లకు భారంగా గడవవచ్చు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాలపై విధించిన సుంకాలు విస్తృత వాణిజ్య యుద్ధం & ప్రపంచ ఆర్థిక మందగమన భయాలను పెంచాయి. మార్చి నెలకు చైనా వినియోగదారుల ధరల సూచిక (CPI) డేటాను గురువారం విడుదల చేస్తారు. బ్రిటన్ స్థూల దేశీయోత్పత్తి (GDP) వివరాలను శుక్రవారం విడుదల చేస్తారు. అమెరికా ద్రవ్యోల్బణం డేటా ఈ వారంలోనే వస్తుంది" - మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునిత్ సింఘానియా
9న రెపో రేట్ ప్రకటన, 10న TCS ఫలితాలు
మన దేశం అప్‌డేట్స్ విషయానికి వస్తే.. రెపో రేట్ సహా RBI ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలు ఏప్రిల్ 09న వెల్లడవుతాయి. రెపో రేటులో పావు శాతం (0.25% లేదా 25 bps) తగ్గింపును మార్కెట్ ఆశిస్తోంది. కార్పొరేట్ కంపెనీల నాలుగో త్రైమాసిక (Q4 FY25) ఫలితాల సెషన్ ఏప్రిల్ 10న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)తో ప్రారంభమవుతుంది. మార్చి నెలకు, భారతదేశ ద్రవ్యోల్బణం లెక్కలు ఈ వారంలో విడుదల కానున్నాయి. విదేశీ పెట్టుబడిదారుల (FIIs) కార్యకలాపాలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలిక, ముడి చమురు ధరలపై కూడా పెట్టుబడిదారులు నిఘా ఉంచుతారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. "abp దేశం" ఎవరికీ, ఎప్పుడూ పెట్టుబడి సలహాలు ఇవ్వదు. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.





















