Bhadrachalam Sri Rama Kalyanam: భద్రాచలంలో కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం Watch Live
Sri Rama Navami 2025 | దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నారు. మిథిలా స్టేడియానికి భారీగా భక్తులు తరలివచ్చారు.

CM Revanth Reddy attends Bhadrachalam Sri Rama Kalyanam | భద్రాచలం: కన్నుల పండువగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాచలం (Bhadrachalam)లో జరుగుతున్న రామయ్య కళ్యాణ మహోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సతీ సమేతంగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల దేవస్థానం బోర్డు తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు నేటి ఉదయం హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో రేవంత్ దంపతులు భద్రాచలానికి బయలుదేరారు. భద్రాచలం ఆలయానికి చేరుకున్న రేవంత్ రెడ్డి (Revanth Reddy) దంపతులు భద్రాద్రి రాముడిని దర్శించుకుంటారు. ఆ తర్వాత మిథిలా స్టేడియంలో జరుగుతున్న కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణానికి ఆరుగురు రాష్ట్ర మంత్రులు, ఇద్దరు కేంద్ర మంత్రులు, 11 మంది జడ్జిలు హాజరు కావడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు హైదరాబాద్‌లో శోభాయాత్రను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారు.
అబిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో సీతారాముల కళ్యాణ వేడుక ఘనంగా జరుగుతోంది. శ్రీరామనవమికి భద్రాద్రిని ముస్తాబు చేశారు. మిథిలా స్టేడియంలో చలువ పందిళ్ళతో ముస్తాబు చేశారు. ఉదయం 10.30 గంటలకు సీతారాముల కళ్యాణ వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తుల కోసం 200 క్వింటాళ్ల తలంబ్రాలు, రెండు లక్షల లడ్డూలు సిద్ధం చేశారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతోంది.
భద్రాచలంలో ప్రత్యేకత ఏంటంటే..
ఆదివారం నాడు అబిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణ వేడుకను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. వేద మంత్రోచ్ఛరణ మధ్య అభిజిత్ లగ్నంలో జీలకర్ర బెల్లాన్ని సీతారాములవారి శిరస్సుపై ఉంచారు. తలంబ్రాల వేడుక తరువాత బ్రహ్మ బంధనం వేశారు. ఇదే బ్రహ్మముడి. అనంతరం నూతన దంపతులు సీతారాములకు ఆశీర్వచనం పలికారు. సాధారణంగా కల్యాణంలో రెండు సూత్రాలు ఉండటం చూస్తుంటాం. కానీ ఇక్కడ భక్త రామదాసు భక్తితో తయారు చేయించిన పతకాన్ని కలిపి 3 సూత్రాలను సీతమ్మకి ధరింపజేశారు. 80 కౌంటర్లు, ఆర్టీసీ బస్సులు, కార్గో, పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా తలంబ్రాల పంపిణీ చేయనున్నారు. రామ నవమి వేడుకలలో పాల్గొనేందుకు తరలివచ్చిన భక్త జనంతో గోదావరి తీరం కిక్కిరిసిసోయింది.
ప్రతి ఏడాది ఘనంగా కళ్యాణోత్సవం..
ఉత్తరాది రాష్ట్రాల్లో రాముడు అంటే అయోధ్య రాముడే గుర్తుకొస్తాడు. అది రాముడు పాలించిన ప్రాంతం. రాముడు నడయాడిన, ధర్మ స్థాపన కోసం రాజ్యాన్ని నడిపించిన కేంద్రం. గత ఏడాది జనవరిలో అయోధ్యలో రామయ్యను పున:ప్రతిష్టాపన తరువాత అక్కడికి భక్తుల తాకిడి పెరిగింది. దక్షిణాదిన మనకు భద్రాచలంలో కొలువైన రాముడు అంతే ఫేమస్. వనవాసం సమయంలో సీతారాములు ఇక్కడ కొంతకాలం గడిపారు. ఇప్పటికీ భద్రాద్రిలో వారి గుర్తులు ఉన్నాయి. ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగానూ భద్రాచలం వర్ధిల్లుతోంది. ప్రతి ఏడాది శ్రీరామనవమి సందర్భంగా రామయ్య పట్టాభిషేకంతో పాటు సీతారాముల కళ్యాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. సీఎం దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది మిథిలా స్టేడియంలో శ్రీరాముడు, సీతమ్మల కళ్యాణ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.






















