Immunity Power: ఈ లక్షణాలు కనిపిస్తే మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నట్టే
రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండడం కూడా ఒక ఆరోగ్య సమస్యే.
శరీరాన్ని రక్షించే వ్యవస్థ రోగనిరోధక వ్యవస్థ. ఈ వ్యవస్థ ఎంత మెరుగ్గా ఉంటే వ్యాధులు అంత దూరంగా ఉంటాయి. సరైన ఆహారం తినకపోవడం, నిద్ర తగ్గడం, చెడు జీవనశైలి... ఈ కారణాల కొందరిలో రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. వ్యాధినిరోధక వ్యవస్థ బలహీనపడినా బయటికి ఆ విషయం కనిపించదు. కొన్ని లక్షణాల ద్వారా మనం ఆ విషయాన్ని గ్రహించి జాగ్రత్త పడాలి. లేకుంటే అనేక ఇన్ఫెక్షన్లు వేసవిలో దాడి చేసే అవకాశం ఉంది.
ఒత్తిడి
చిన్న పని చేసినా ఒత్తిడిగా అనిపిస్తుంది. ఇంట్లో చిన్న గొడవ కూడా మీకు భరించలేనంత ఒత్తిడిని కలిగిస్తుంది. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ నివేదిక ప్రకారం దీర్ఘకాలిక ఒత్తిడి ఇలా కలిగితే రోగనిరోధక వ్యవస్థను ఇంకా బలహీనపరుస్తుంది.
తరచూ జలుబు
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి తరచూ జలుబు చేస్తుంది. ప్రతి నెలా జలుబు చేయడం లేదా ప్రతి రెండు మూడు నెలలకోసారి జలుబు చేయడం కూడా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థను సూచిస్తుంది.
పొట్ట సమస్యలు
తిన్న, తినకపోయిన ఏదో పొట్ట సంబందిత సమస్య వేధిస్తుంది. కడుపునొప్పి రావడం, ఉబ్బరం,ఏదో తెలియని ఇబ్బంది ఇలా అన్నమాట. ఎందుకంటే 70శాతం రోగనిరోధక శక్తి జీర్ణకోశంలోనే పనిచేస్తుంది.
గాయం నయం కాకపోవడం
ఏదైనా దెబ్బతాకినా త్వరగా ఆ గాయం నయం కాదు, చాలా నెమ్మదిగా మానుతుంది. కొత్త చర్మాన్ని ఉత్పత్తి చేయడానికి రోగనిరోధక కణాలు చాలా అవసరం. ఆ వ్యవస్థ పనితీరు మందగించడం వల్ల గాయం పచ్చిగానే ఉంటుంది.
తరచూ ఇన్ఫెక్షన్లు
తరచే ఏదో ఒక ఇన్ఫెక్షన్ బారిన పడుతుంటారు. కొందరు చెవి ఇన్ఫెక్షన్ బారిన పడితే, మరికొందరిలో నిమోనియా, సైనస్ వంటివి త్వరగా కలుగుతాయి.
నిత్యం నీరసం
ఉదయం లేచినప్పటి నుంచి నీరసం ఆవహిస్తుంది. ఏ పని చేసినా అలసటగానే అనిపిస్తుంది. శరీరం శక్తిహీనంగా అనిపిస్తుంది. ఆ నీరసం చాలా చికాకును కలిగిస్తుంది.
తినాల్సినవి ఇవే
రోధనిరోధక శక్తిని పెంచుకోవాలంటే అనేక రకాల ఆహార పదార్థాలు తినాల్సి ఉంటుంది. క్యారెట్, బీట్ రూట్, అల్లం, వెల్లుల్లి, గుడ్లు, పాలు, పెరుగు, మజ్జిగ, పప్పులు, నట్స్, పాలకూర, తోటకూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా, చికెన్, చేపలు, కాకరకాయ... ఇలా చాలా రకాల ఆహారపదార్థాలు తినాలి.
కేవలం ఆహారం ద్వారానే రోగినిరోధక శక్తి పెరగదు. కంటి నిండా నిద్రపోవడం కూడా చాలా ముఖ్యం. ఒత్తిడి రోగనిరోధక శక్తిని నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవాలి.
Also read: నెమలి ఈకలు ఇంట్లో ఉంటే అందమే కాదు, సంపద కలిసొస్తుంది కూడా