World Malaria Day 2025 : మలేరియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. మలేరియాకు చికిత్స ఉన్నా ప్రాణాంతకం ఎందుకవుతుందో తెలుసా?
Malaria Deaths : మలేరియాపై అవగాహన కల్పిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుతున్నారు. అసలు మలేరియా ప్రాణాంతకమవుతుందో ఇప్పుడు చూసేద్దాం.

Malaria Death Causes and Prevention Tips : ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ దానిని నివారణకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీన వరల్డ్ మలేరియా డేని జరుపుతున్నారు. దీనిలో భాగంగా.. అసలు మలేరియా రావడానికి కారణాలు ఏంటి? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మలేరియా చికిత్సతో నివారించగలము కానీ.. అది ప్రాణాంతకం ఏ పరిస్థుతుల్లో అవుతుంది వంటి విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మలేరియా డే చరిత్ర
ఆఫ్రికన్ మలేరియా డే నుంచి.. ప్రపంచ మలేరియా దినోత్సవం ప్రారంభమైంది. మలేరియాను నివారించడం, మరణాలు తగ్గించమే లక్ష్యంగా ఆఫ్రికా 2001లో ఈ డేని ప్రారంభించింది. 2007లో ప్రపంచవ్యాప్తంగా మలేరియాపై అవగాహన కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆఫ్రికా మలేరియా దినోత్సవాన్ని మార్చి ప్రపంచ మలేరియా దినోత్సవంగా ప్రతి ఏడాది ఏప్రిల్ 25వ తేదీన జరిపించాలని నిర్ణయించింది. అలా 2008లో తొలిసారిగా ప్రపంచ మలేరియా దినోత్సవం నిర్వహించారు.
మలేరియా అంటే ఏమిటి..
దోమకాటు ద్వారా కలిగే ప్రాణాంతక వ్యాధి మలేరియా. పరాన్నజీవి అయిన ఆడ అనాఫిలిస్ దోమ ద్వారా ఇది వ్యాపిస్తుంది. అయితే దీనిని నివారించవచ్చు. చికిత్సతో తగ్గించవచ్చు. అయినా సరే కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకమవుతుంది. మలేరియాకు 5 జాతులు కారణం కాగా.. వాటిలో ప్లాస్మోడియం ఫాల్సిపరం, ప్లాస్మోడియం వైవాక్స్ తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2023లో 263 మిలియన్ల కేసులు నమోదయ్యాయని.. వారిలో 5,97,000 మంది చనిపోయినట్లు అంచనా వేసింది. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో మలేరియా కేసులు ఎక్కువగా నమోదవడం, అవి మరణాలకు దారి తీస్తున్నాయని నివేదించింది. అందుకే దీని గురించి ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కలిగి ఉండాలని తెలిపింది.
మలేరియా ప్రమాదం వారికే ఎక్కువ..
మలేరియాను చికిత్సతో కంట్రోల్ చేయవచ్చు. రాకుండా నివారించవచ్చు. అయినా సరే అది కొందరి ప్రాణాలు హరిస్తుంది. అలా ఎందుకు అవుతుందో ఇప్పుడు చూసేద్దాం. బేసికల్గా మలేరియా అనేది తీవ్రమైన జ్వరంతో కూడిన అనారోగ్యం. ఇమ్యూనిటీ తక్కువగా ఉండేవారికి ఇది త్వరగా వస్తుంది. మలేరియా దోమ కుట్టిన 10 నుంచి 15 రోజుల తర్వాత దాని లక్షణాలు కనిపిస్తాయి. 5 సంవత్సరాల లోపు పిల్లలకు, గర్భిణీలకు మలేరియా వచ్చే ప్రమాదం ఎక్కువ. HIV, AIDS ఉన్నవారికి కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తాయి.
మలేరియా లక్షణాలు, మరణానికి కారణాలు..
జ్వరం, తలనొప్పి, చలి వంటి తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయి. ప్లాస్మోడియం ఫాల్సిపరం మలేరియా అయితే 24 గంటల్లోపు చికిత్స అందించాలి. లేదంటే తీవ్రమైన అనారోగ్యంతో పాటు.. మరణానికి దారితీస్తుంది. మలేరియా తీవ్రమైతే.. పిల్లల్లో రక్తహీనత, మెటబాలీజం తగ్గడం, శ్వాసకోశ సమస్యలు ఎక్కువ అవుతాయి. పెద్దల్లో ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల కొందరు మరణిస్తారు. మలేరియాను ఎంత త్వరగా గుర్తించి చికిత్స అందిస్తే అంత త్వరగా కోలుకుంటారు. దీనివల్ల మరణాలు తగ్గుతాయి.
రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఇంటి చుట్టూ దోమలు లేకుండా చూసుకోవాలి. దోమల రాకుండా నెట్స్, కాయిల్స్ వాడవచ్చు. బయటకు వెళ్లినప్పుడు దోమలు కుట్టకుండా ఆయింట్మెంట్స్ లేదా వేప నూనె వంటివి వాడొచ్చు. నిండుగా ఉండే దుస్తులు వేసుకుంటే దోమలు కుట్టకుండా ఉంటాయి. నీరు పేరుకుపోకుండా, కుండీల్లో దోమలు నిల్వఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఫీవర్ వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుల దగ్గరకు వెళ్లి చికిత్స చేయించుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.






















