Lionel Messi Statue :మెస్సీ భారీ విగ్రహం కోల్‌కతాలో ఆవిష్కరణ; బాలీవుడ్ హీరోలా ఉందని సోషల్ మీడియాలో విమర్శలు
Lionel Messi Statue :లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటన సాగుతోంది. మెస్సీని పర్యటన గుర్తుండిపోయేలా చేయడానికి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Lionel Messi Statue :ప్రపంచం అభిమానించే ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత్‌లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనకు ఆయన అర్థరాత్రి కోల్‌కతాలో దిగారు. ఆ టైంలో కూడా ఆయన్నిచూడటానికి భారీగా జనం తరలి వచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఆయన కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఆవిష్కరించాల్సి ఉంది. కానీ దాన్ని వర్చువల్‌గా మాత్రమే ఆవిష్కరించారు.
మొదట అనుకున్న ప్రకారం, ఆయనే స్వయంగా వెళ్లి ఆవిష్కరించాలని భావించారు. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు విమానం ఎక్కడానికి విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో లియోనెల్ మెస్సీ (Lionel Messi) లేక్ టౌన్‌లో ఆగాల్సి ఉంది. అక్కడే ప్రపంచంలోనే మెస్సీ అత్యంత ఎత్తైన 70 అడుగుల విగ్రహం తయారు చేశారు.
భారత్‌లోనే కాదు, ప్రపంచంలో కూడా ఇంత పెద్ద మెస్సీ విగ్రహం లేదు. మెస్సీ కోల్‌కతా పర్యటనను గుర్తుండిపోయేలా చేయడానికి రాష్ట్ర మంత్రి సుజిత్ బోస్ చొరవతో లేక్ టౌన్‌లో ఈ విగ్రహం తయారు చేశారు. బిగ్ బెన్ పక్కనే ఉంది. మరోవైపు డిగో మారడోనా విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని ఫుట్‌బాల్ యువరాజు మారడోనా స్వయంగా ఆవిష్కరించారు.
#WATCH | Kolkata, West Bengal: Star footballer Lionel Messi virtually unveils his 70-foot statue installed at the Sreebhumi Sporting Club in Lake Town during the first leg of his G.O.A.T. Tour India 2025 pic.twitter.com/dYFPW7KsBg
— ANI (@ANI) December 13, 2025
కానీ మెస్సీ విషయంలో, ఆ దృశ్యాన్ని ఆస్వాదించే అనుభవం కోల్‌కతాకు లేకుండా పోయింది. మెస్సీ స్వయంగా విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళలేకపోయారు. నిర్వాహకుల ప్రకారం, భద్రతా కారణాల వల్ల మెస్సీ లేక్ టౌన్‌కు వెళ్ళడానికి వీలు కాలేదు. అయితే, ఆయనే వర్చువల్‌గా విగ్రహాన్ని ఆవిష్కరించారు.
శనివారం ఉదయాని కల్లా లేక్ టౌన్‌ను జనం చుట్టు ముట్టేశారు. అప్పటికీ మెస్సీ రావడం లేదని వాళ్లకు తెలియదు. ఎత్తైన విగ్రహం నీలిరంగు వస్త్రంతో కప్పి ఉంచిన విగ్రహం పరిసర ప్రాంతాలు జనంతో నిండిపోయాయి. ఫుట్‌బాల్ అభిమానులు, ఉత్సాహవంతులు మెస్సీని భద్రతా కారణాల వల్ల స్వయంగా రావడానికి పోలీసులు అనుమతించలేదని తెలిసి ఒక్కసారిగా బాధపడ్డారు. అయినా ఆయన విగ్రహావిష్కరణ జరిగే వరకు అక్కడే ఉన్నారు.
ఉదయం 10 గంటలకు, మెస్సీ బైపాస్ సమీపంలోని హోటల్‌లో కూర్చొని వర్చువల్‌గా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ దృశ్యాన్ని చూసిన జనం ఒక్కసారిగా భారీ ఎత్తున నినాదాలు చేశారు. మెస్సీతోపాటు అర్జెంటీనా ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యుడు రోడ్రిగో డి పాల్ , ఉరుగ్వే స్టార్, మెస్సీకి సన్నిహితుడు లూయిస్ సువారెజ్ కూడా కోల్‌కతాకు వచ్చారు. కోల్‌కతాలో మెస్సీకి ఉన్న క్రేజ్ చూసి వారు కూడా ఆశ్చర్యపోతున్నారని నిర్వాహకులు తెలిపారు.
లేక్ టౌన్‌లో మెస్సీ విగ్రహాన్ని నిర్మించేందుకు శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ చొరవ తీసుకుంది. ఈ క్లబ్ అధ్యక్షుడు రాష్ట్ర మంత్రి సుజిత్ బోస్. ఈ విగ్రహాన్ని కేవలం 40 రోజుల్లోనే తయారు చేశామని సుజిత్ తెలిపారు. కళాకారుడు మోంటీ పాల్. విగ్రహంలో మెస్సీ చేతిలో ప్రపంచ కప్ ట్రోఫీ ఉంది. ఫైబర్ గ్లాస్‌తో తయారు చేసిన విగ్రహాన్ని మరింత దృఢంగా చేయడానికి కాళ్ళ భాగంలో 20 టన్నుల ఇనుప రాడ్‌ను అమర్చారు.
అయితే, మెస్సీ విగ్రహం నమూనాపై వివాదం చెలరేగింది. చాలా మంది విగ్రహం మెస్సీలా లేదని అంటున్నారు. సోషల్ మీడియాలో వ్యంగ్య విమర్శలు చేస్తున్నారు. నటుడు రిత్విక్ ఛటర్జీ తన ఫేస్‌బుక్‌లో ఈ విగ్రహాన్ని చూస్తే హృతిక్ రోషన్ సంతోషిస్తారని రాశారు. విగ్రహం దాదాపు బాలీవుడ్ నటుడిలాగే కనిపిస్తోందని కొందరు రాశారు! అదృష్టవశాత్తూ మెస్సీ నేరుగా చూడలేదని కొందరు రాశారు! చూసి ఉంటే తనను తాను గుర్తుపట్టలేకపోయేవాడని రాశారు!
అయితే, నిర్వాహకులు దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇంత పెద్ద విగ్రహాన్ని నిర్మించడం అంత సులభం కాదని వారు పేర్కొన్నారు.





















