Road Trip: వేసవిలో రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అదిరిపోయే లొకేషన్లు ఇవిగో, ఈ దారుల్లో రోడ్ ట్రిప్ గుర్తుండిపోతుంది
వేసవిలో చల్లని దారుల్లో లాంగ్ ట్రిప్ కి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇవిగో కొన్ని అందమైన రోడ్ ట్రిప్ డెస్టినేషన్లు.
ట్రాఫిక్ లేని రోడ్లపై, ఇరువైపులా చెట్లతో, చల్లని గాలి వీస్తుంటే అలా కార్లలో, బైకులపై లాంగ్ డ్రైవ్ కి వెళ్లడం అదిరిపోతుంది. అది చక్కని అనుభూతిగా మిగిలిపోతుంది. వేసవి సెలవుల్లో అలా చల్లని ప్రాంతాలకు లాంగ్ డ్రైవ్ వెళితే ఆ ట్రిప్ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. రోడ్ ట్రిప్‌కు అనువైన డెస్టినేషన్లు ఇవిగో. ఈ దారుల్లో ప్లాన్ చేసుకుంటే ట్రిప్ కలకాలం గుర్తుండిపోయేలా ఉంటుంది.
చెన్నై టు పాండిచ్చేరి
రోడ్ ట్రిప్ చెన్నై నుంచి పాండిచ్చేరి వెళ్లే రోడ్డు ఉత్తమ ఎంపిక. ఈ మార్గం సహజసిద్ధమైన అందాలతో మెరిసిపోతుంది. రహదారికి ఇరువైపులా పచ్చని చెట్లు, నదులు, వంతెనలు, వంకరటింకరగా సాగే దారులు చాలా అద్భుతంగా ఉంటాయి. మధ్యమధ్యలో ఆకలి తీర్చేందుకు ఎన్నో దాబాలు, హోటళ్లు కూడా కొలువుదీరాయి. అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని ఈ మార్గంలో వెళ్లేటప్పుడు పొందొచ్చు.
చెన్నై టు మున్నార్
కేరళలలోని అత్యుత్తమ హిట్ స్టేషన్ మున్నార్. ఎంతో మంది హనీమూన్ జంటల మొదటి ఎంపిక ఇది. ఇది ఏడాదిలో ఎప్పుడు వెళ్లినా ఆకర్షణీయంగానే ఉంటుంది. చెన్నై నుంచి మున్నార్ వెళ్లేందుకు రోడ్ మార్గంలో 12 గంటలు పడుతుంది. కానీ ఆ సమయమంతా ఇట్టే గడిచిపోతుంది. అడుగడుగునా ప్రకృతితో కలిసి ప్రయాణిస్తున్నట్టే అనిపిస్తుంది.
బెంగళూరు టు కూర్గ్
కూర్గ్ కాఫీ తోటలకు ప్రసిద్ధి. బెంగళూరు నుంచి కూర్గ్ 244 కి.మీ దూరంలో ఉంటుంది. బైకుపై కూడా లాంగ్ డ్రైవ్ కు హ్యాపీగా వెళ్లచ్చు. ఆకుపచ్చని అందాలెన్నో దారంతా పలుకరిస్తాయి. ఈ ట్రిప్పు మీలో ప్రశాంతతను, కొత్త ఉల్లాసాన్ని కలిగిస్తాయి.
సిమ్లా నుంచి మనాలి
మనసుకు హత్తుకునే ప్రాంతాలు సిమ్లా, మనాలి. అందమైన కొండలు, మంచు పర్వతాలు ఎంత హాయిగా అనిపిస్తాయో. సిమ్లా నుంచి కారులోనో, బైకులోనే బయలుదేరి రోడ్డు మార్గంలో ప్రయాణించి మనాలిని చేరుకుంటే భలే ఉత్సాహంగా ఉంటుంది.ఆ రోడ్డంతా చల్లని గాలితో స్వాగతం పలుకుతుంది. పూలు నిండిన చెట్లు, దూరం నుంచి కనిపించే మంచు పర్వతాలు భలే సుందరంగా ఉంటాయి.
హైదరాబాద్ టు పట్టడకాల్
పట్టడకాల్ కర్ణాటకలోని భాగల్ కోట్ జిల్లాలోని చిన్న పట్టణం. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది. ఈ పట్టణం చారిత్రక ప్రదేశం. చరిత్రను గుర్తు చేసే ఎన్నో దేవాలయాలు, కట్టడాలు ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. హైదరాబాద్ నుంచి 404 కిలోమీటర్ల దూరంలో ఉంది పట్టడకాల్. చరిత్రను ఇష్టపడేవారికి ఇది ఉత్తమ ఎంపిక.
హైదరాబాద్ టు బాదామి
హైదరాబమాద్ నుంచి దాదాపు 420 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బాదామి. కర్ణాటకలోని భాగల్ కోట్ జిల్లాలోనే ఇదీ ఉంటుంది. రోడ్ ట్రిప్పులో భాగంగా అక్కడికి చేరుకోవడానికి 7 నుంచి 8 గంటల సమయం పడుతుంది. గుహలు, దేవాలయాలు ఇక్కడ ప్రసిద్ధి. హైదరాబాద్ సిటీని దాటాకా బాదామి చేరుకునే దారి కూడా పచ్చగా ఉంటుంది. బాదామిలోని చారిత్రక కట్టడాలను చూడడానికి సరైన సమయం ఇదే.
Also read: ఆసియాలోనే అతి పెద్ద తులిప్ గార్డెన్ ఇది, వేసవిలో అలా రౌండేసి రావచ్చు
Also read: వేసవిలో కుటుంబంతో విహరించేందుకు చల్లని డెస్టినేషన్‌లు ఇవిగో, ట్రిప్ అదిరిపోవడం ఖాయం