Travel: వేసవిలో కుటుంబంతో విహరించేందుకు చల్లని డెస్టినేషన్‌లు ఇవిగో, ట్రిప్ అదిరిపోవడం ఖాయం
వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఫ్యామిలీతో ట్రిప్పులకు చాలా మంది రెడీగా ఉంటారు.
మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. సెలవుల్లో కుటుంబం ఎక్కడ విహరించాలో ఇప్పటికే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అలాంటివారి కోసమే ఈ కథనం. వేసవిలో ఎండలు లేని ప్రదేశాలకు వెళ్లాలి. అప్పుడే ట్రిప్ అదిరిపోతుంది. వేసవిలో కూడా వేడి జాడ తెలియని ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. వీటిల్లో మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో ఎంచుకోండి.
చిరపుంజి
పిల్లలు తమ పాఠ్యపుస్తకాలలో ఈ పట్టణం గురించి చదువుకునే ఉంటారు. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో ఉంది ప్రకృతి స్వర్గధామం. అందమైన అడవులు, పర్వతాలు, జలపాతాలు, నిత్యం కురిసే చినుకులతో చిరపుంజి వాతావరణం అదిరిపోతుంది. భూమిపై అత్యంత తేమవంతమైన ప్రాంతాలలో ఇదీ ఒకటి. ఇక్కడున్న లివింగ్ రూట్ బ్రిడ్జ్ లు చాలా హైలైట్. మీరు వాటిపై నడిచేందుకైనా చిరపుంజి వెళ్లాల్సిందే.
ఖజ్జియార్
ఈ ప్రదేశం హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. ఖజ్జియార్‌ను భారతదేశంలోని స్విట్జర్లాండ్ అని పిలుచుకుంటారు. ఇదొక అందమైన కుగ్రామం. ఏడాదంతా సహజసౌందర్యంతో నిండి ఉంటుంది. విహారయాత్రలకు సూపర్ డెస్టినేషన్ ఇది. ఇక్కడ ట్రెక్కింగ్, గుర్రపుస్వారీలు, పారాగ్లైడింగ్ వంటి ఎన్నో సాహసక్రీడలు కూడా ఉంటాయి.
కూనూరు
నీలగిరి కొండలతో కలిసి ఉన్న అందమైన పట్టణం కూనూరు. ఇది తమిళనాడులో ఉంది. మీరు ఆ ప్రాంతానికి వెళ్లితే నీలగిరి కొండలతో ప్రేమలో పడడం ఖాయం. ప్రశాంతమైన ఆ వాతావరణం మీకెంతో నచ్చేస్తుంది. విశ్రాంతి స్థలాలు కుటుంబాలకు అనువుగా ఉంటాయి. నాలుగు రోజులు సంతోషంగా సేదతీరచ్చు.
చోప్టా
ఉత్తరాఖండ్ లోని ఓ పచ్చని ప్రాంతం చోప్టా. పక్షుల కిలకిల రావాల మధ్య కూర్చుని టీ తాగుతుంటే ఎంత హాయిగా ఉంటుంది. ఆ అనుభూతిని అక్కడ పొందచ్చు. పచ్చిక భూములతో, పైన్ చెట్లతో నిండి ఉన్న అడవులతో చోప్టా మిమ్మల్ని కట్టి పడేస్తుంది. హిమాలయాల ఒడిలో కూర్చుని మీ రొటీన్ జీవితం నుంచి బయటకు వచ్చినట్టు అనిపించడం ఖాయం. కాకపోతే చుట్టూ ఉన్న కొండల కారణంగా ఇక్కడ మొబైల్ సిగ్నల్ సరిగా అందదు. అదొక్కటే లోపం.
తవాంగ్
హిల్ స్టేషన్లకు కేరాఫ్ అడ్రస్ తవాంగ్. అరుణాచల్ ప్రదేశ్లోని ఒక చక్కటి ప్రాంతం. కాకపోతే ఈ ప్రాంతం చూడాలంటే పర్యాటకులు ముందుగా పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. తవాంగ్ ప్రశాంతత, పచ్చదనం మిమ్మల్ని అక్కడే ఉండిపొమ్మనేలా ఉంటాయి. ఒక్కసారి కచ్చితంగా వెళ్లి సేదతీరాల్సిన ప్రాంతం ఇది.
కడ్మట్ దీవి
లోతైన నీటి సముద్ర అందాలు చుట్టూ పరుచుకుని ఉన్న ప్రాంతం కడ్మట్ దీవి. లక్షదీవుల్లో ఇదీ ఒకటి. చల్లనిగాలి, ఇసుక తిన్నెలు, పగడపు దీవులు మిమ్మల్ని ఆకర్షించడం ఖాయం. బీచ్ లు ఇష్టపడేవారికి ఇది సరైన డెస్టినేషన్. దీవిలో ఏ మూలకు వెళ్లినా బీచ్ దర్శనమిస్తుంది.
Also read: వేసవి సెలవుల్లో హంపి ట్రిప్ అదిరిపోతుంది, అక్కడ కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు ఇవిగో