Travel: కొత్త జంటలకు ఉత్తమ హనీమూన్ డెస్టినేషన్ అండమాన్ నికోబార్ దీవులు, అక్కడికి ఎలా వెళ్లాలి? ఎంత ఖర్చువుతుంది?
మనదేశంలో భాగమైన అండమాన్ నికోబార్ దీవులు అందాలకు కేరాఫ్ అడ్రస్ లా ఉంటాయి.
పెళ్లయ్యాక ప్రతి జంట హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలో తెగ ఆలోచిస్తుంది. వారికి ఉత్తమ హనీమూన్ డెస్టినేషన్ ‘అండమాన్ నికోబార్ దీవులు’. సముద్ర తీరాలతో, పచ్చని అందాలతో అండమాన్ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. అది మనదేశంలో భాగమే అయినా, వేరే దేశం వెళ్లిన అనుభవాన్ని మిగిలిస్తుంది. సెలవుల్లో కుటుంబంతో వెళ్లేందుకు కూడా ఇది ఉత్తమ విహార స్థలం. దాదాపు 8000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంలో ఉంటాయి అండమాన్ నికోబార్ ద్వీపాలు.మనదేశానికి దక్షిణ దిశలో కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నాయి ఈ ద్వీపాలు. బంగాళాఖాతంలో ఉన్న దాదాపు 600 ద్వీపాల సమాహారం అండమాన్ అండ్ నికోబార్. వాటివని చూడాలంటే రెండు కళ్లూ చాలవు.
ఎలా వెళ్లాలి?
అండమాన్ అండ్ నికోబార్‌లో ప్రధాన ద్వీపం పోర్ట్ బ్లెయిర్. ఇందులో విమానాశ్రయం ఉంది. చాలా ప్రధాన నగరాలకు ఇక్కడ్నించి విమానాలు నడుస్తున్నాయి. ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్ ల నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు నేరుగా విమానాలు ఉన్నాయి.
హైదరాబాద్ నుంచి...
హైదరాబాద్ నుంచి నేరుగా పోర్ట్ బ్లెయిర్‌కు రవాణా సౌకర్యం లేదు. బెంగళూరుకు నుంచి విమానంలో వెళ్లాల్సిందే.
విశాఖ నుంచి
విశాఖపట్నం నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు వెళ్లే ఓడ ఉంది. కానీ చేరుకోవడానికి మూడు నాలుగు రోజులు పడుతుంది. సముద్ర సిక్‌నెస్ ఉన్నవారికి ఓడ ప్రయాణం మంచిది కాదు. చెన్నై ఓడరేవు, కోల్‌కతా ఓడరేవు నుంచి కూడా చేరుకోవచ్చు.
ఖర్చు...
విమాన టిక్కెట్ బెంగళూరు నుంచి ఒక్కరికి నాలుగు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు ఉంటుంది. అలాగే అండమాన్ లో మూడు రోజులు ఉండేందుకు ఒక మనిషికి కనిష్టంగా 10 వేల రూపాయలు ఖర్చవుతుంది.
తప్పకుండా చూడాల్సినవి...
1. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో హావ్ లాక్ ద్వీపం చాలా అందంగా ఉంటుంది. అక్కడికే అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తారు. ఆ సముద్రతీర ప్రాంతంలో ఎన్నో జలక్రీడలు కూడా ఉన్నాయి. స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ వంటివి చేయచ్చు.
2. రూట్ లాండ్ దీవి కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడి పగడపు దీవులు ఎంతో ఆకట్టుకుంటాయి. వాటిని చూడటానికే ఎక్కువమంది వెళతారు.
3. వందూర్, నీల్ దీవులు కూడా కళ్లని మైమరిపించే అందాలు కలిగి ఉంటాయి. ఇక్కడి బీచ్ లోని ఇసుక తిన్నెల్లో పడుకుని సముద్ర అందాలను చూస్తుంటే, ఇంటికి కూడా వెళ్లాలనిపించదు.
4. ఇక్కడున్న బారెన్ దీవిలో మనుషులు ఉండరు. కేవలం పక్షులు, ఎలుకలు అధికంగా ఉంటాయి. ఇక్కడ అగ్నిపర్వతాలు కూడా అధికం.
5. లాంగ్ ఐలాండ్ లో ఇంకా గిరిజనులు నివసిస్తారు. వారు అనాగరికులు. వారి ఆహారం కూడా మనం తినలేము. ఆ దీవి చూడటానికి వెళ్లినప్పుడు మాత్రం నీళ్లు, ఆహారం అన్నింటితో వెళ్లడం మంచిది. వారు నాగరికుల్లో కలవరు కూడా.
ఇవే కాదు ఇంకా ఎన్నో చిన్న చిన్న దీవులు ఉన్నాయి. వాటన్నింటిలోనూ విహరించవచ్చు. వసతి సౌకర్యాలు కూడా చక్కగా ఉంటాయి.
View this post on Instagram