Hampi: వేసవి సెలవుల్లో హంపి ట్రిప్ అదిరిపోతుంది, అక్కడ కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు ఇవిగో
వేసవి సెలవుల్లో హంపి వెళ్లే వాళ్లు కచ్చితంగా చూడాల్సిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి.
వేసవి సెలవులకు కుటుంబంతో టూర్ వెళ్లేవాళ్లు ఎంతోమంది. తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు కచ్చితంగా వెళ్లే ప్రదేశాలలో హంపి కూడా ఒకటి. విజయనగర సామ్రాజ్య గురుతులను ఇంకా సజీవంగా ఉంచింది హంపి. పచ్చటి పరిసరాల మధ్య ఉన్న ఆ ప్రదేశం పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుంది. ఒకప్పుడు దేశంలోని అతి పెద్ద సామ్రాజ్యాలలో విజయనగర సామ్రాజ్యం కూడా ఒకటి. విస్తరించి ఉన్న విశాల వీధులు, పెద్ద పెద్ద ప్రాకారాల శిధిలాలు అప్పటి నగర నిర్మాణ చాతుర్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. హంపి వెళ్లే వారు కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి.
రాక్ క్లైంబింగ్
దేశంలో అత్యుత్తమ రాక్ క్లైంబింగ్ ప్రదేశాలలో హంపి కూడా ఒకటి. ఇక్కడి శిలలు ఒక్కోటి 2.5 బిలియన్ ఏళ్లనాటివి. ఇవి భూమిపై ఉన్న పురాతన భౌగోళిక నిర్మాణాలలో ఒకటిగా చెబుతారు.
విరూపాక్ష దేవాలయం
యాభై మీటర్ల ఎత్తుతో ఉన్న గాలిగోపురం విరూపాక్ష దేవాలయం ప్రత్యేకత. విశాలమైన వీధిలో ఉంటుంది ఈ దేవాలయం. ఈ దేవాలయాలు విజయనగరసామ్రాజ్యం కన్నా ముందు నుంచే ఉన్నాయని చెబుతారు. ఇవి 10 నుంచి 12వ శతాబ్ధానికి చెందినవై ఉంటాయరి చరిత్రకారుల అంచనా.
విఠల దేవాలయం
అనెగొంది గ్రామానికి దగ్గర్లో ఉంటుంది విఠలదేవాలయం. విఠలుడంటే విష్ణుమూర్తి. ఈ ఆలయాన్ని 16వ శతాబ్ధంలో నిర్మించినట్టు చెబుతారు.ఈ గుడిలో సప్తస్వరాలు పలికే ఏడు సంగీత స్థంభాలు ఉన్నాయి.
ఏకశిలా రథం
విఠల దేవాలయంలోనే ఏకశిలారథం కొలువుదీరి ఉంటుంది. కేవలం ఒకే శిలతో ఈ అద్భుత శిలను చెక్కారు. దీనికి కదిలే చక్రాలు ఉండడం విశేషం.
హిప్పీ ఐలాండ్
హంపి గ్రామం పక్కనే హిప్పీ ఐలాండ్ ఉంటుంది.ఈ ఐలాండ్ కు గ్రామానికి మధ్యలో చిన్న ఏరు ఉంటుంది. దాన్ని తెప్పతో లేదా పడవలో దాలి వెళ్లచ్చు. హిప్పీ ఐలాండ్ లోనే అధికంగా విదేశీయులు వసతి తీసుకుంటారు. ఇక్కడ రకరకాల కార్యక్రమాలు, ఆహారాలు దొరుకుతాయి. చూడటానికి చాలా బావుంటుంది.
దరోజీ ఎలుగుబంట్ల అభయారణ్యం
హంపికి 15కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దరోజీ ఎలుగుబంట్ల అభయారణ్యం. దాదాపు 55.87 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉంటుంది. ఈ అరణ్యంలో 120 ఎలుగుబండ్లు, రకరకాల సీతాకోకచిలుకలు, ఎన్నో జాతుల పక్షులు, చెట్లు ఉంటాయి.
మరికొన్ని...
1. లోటస్ టెంపుల్
2. తుంగభద్రా నది
3. బడల లింగా
4. భూగర్భ ఆలయం
5. కమలాపుర మ్యూజియం
ఎలా వెళ్లాలి?
రైలు ద్వారా హంపి చేరుకోవాలంటే దగ్గర్లో ఉన్న రైల్వేస్టేషన్ హోస్పేట జంక్షన్. ఇది కేవలం హంపికి 13 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. బస్సు, రైలు ఏదైనా మొదట హోస్పేట వచ్చాకే హంపికి చేరుకోవాలి.
విమానంలోనే వచ్చే వారు హుబ్లి ఎయిర్ పోర్టుకు మొదట చేరుకోవాలి. ఇది హంపికి 166 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే బెలగాం ఎయిర్ పోర్టు నుంచి కూడా హంపి చేరుకోవచ్చు. ఇది హంపి నుంచి 270 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ్నించి హంపికి తీసుకెళ్లేందుకు ట్యాక్సీలు అధికంగా ఉంటాయి.
వసతి
హంపిలోనే స్థానికులు తమ ఇళల్లో కొంతభాగాన్ని రూమ్ లుగా మార్చి అద్దెకు ఇస్తారు. ఇక రెస్టారెంట్లు వీధిలో నాలుగైదు ఉంటాయి. కేవలం వెజ్ టేరియన్ ఫుడ్ మాత్రమే అక్కడ లభిస్తుంది. ఆల్కహాల్, మాంసాహారం లభించవు. అవి కావాలంటే హంపికి పక్కనే ఉన్న హిప్పీ ఐలాండ్ కు వెళ్లాలి. అక్కడే కొన్ని రెస్టారెంట్లలో లభించే అవకాశం ఉంది.