Ayushman Bharat: హెల్త్ ఐడీ క్రియేట్ చేశారా? ఇవే లాభాలు, ఆరోగ్య సేతు యాప్‌తో ఈజీ
ఆరోగ్యసేతు యాప్ ద్వారా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA) నంబర్‌ను క్రియేట్ చేసుకోవాలని కేంద్రం ప్రకటించింది.
ఆరోగ్య సేతు యాప్ వినియోగదారులకు కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ యాప్ ద్వారా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA) నంబర్‌ను క్రియేట్ చేసుకోవాలని సూచించింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఇప్పటికే 16.4 కోట్ల ABHA నంబర్లను జనరేట్ చేసినట్లు వెల్లడించింది. ఆరోగ్య సేతు యాప్ ద్వారా మరికొంతమంది ఇందులో చేరే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) ఓ ప్రకటన విడుదల చేసింది.
దీని ద్వారా 21.4 కోట్ల మంది వినియోగదారులు ABHA నంబర్‌ను జనరేట్ చేసుకుంటారని నేషనల్ హెల్త్ అథారిటీ తెలిపింది. వ్యాధులు, వాటి కోసం చేయించుకున్న వైద్య పరీక్షలు, వాటి రిపోర్టులు, వైద్యులు సిఫార్సు చేసిన మందులు వంటి వివరాలన్నీ ఒకే చోట ఉంటాయని తెలిపింది. ఒక వేళ వైద్యుడిని మార్చినా, ఇతర ప్రదేశాలకు వెళ్లి స్థిరపడాల్సి వచ్చినా ఆరోగ్యపరమైన వివరాలన్నీ పోర్టబుల్ అవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
గత ఏడాది
ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్‌ను గతేడాది సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. హెల్త్ ఐడీ, ఆరోగ్య సంరక్షణ నిపుణుల రిజిస్ట్రీ, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల రిజిస్ట్రీ, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నూతన పథకంతో రోగుల వివరాలను వైద్యులు ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు.
చెక్అప్లు, స్క్రీనింగ్‌లు సమయానికి చేయించుకుంటున్నారా? లేదా? అన్నది తెలుసుకోవచ్చు. బీపీ, మధుమేహం వంటి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇలా రోగులను నిత్యం పర్యవేక్షిస్తూ, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు వైద్యులు కృషి చేయవచ్చు. ఆరోగ్య సంరక్షణ రంగానికి 'డిజిటల్' రూపాన్ని ఇవ్వడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
ఇవేే లాభాలు
- ఆసుపత్రుల చుట్టూ తిరగాలంటే ప్రతి చోటుకు రిపోర్టులు తీసుకెళ్లాలి. ఈ హెల్త్ ఐడీతో అన్నీ ఒక్క చోటుకు చేరినట్టు అవుతుంది.
- వ్యాధులు, వాటి కోసం చేయించుకున్న వైద్య పరీక్షలు, వాటి రిపోర్టులు, వైద్యులు సిఫార్సు చేసిన మందులు వంటి వివరాలన్నీ ఒకే దగ్గర ఉంటాయి.
- ఒక వేళ వైద్యుడిని మార్చినా, ఇతర ప్రదేశాలకు వెళ్లి స్థిరపడాల్సి వచ్చినా ఆరోగ్యపరమైన వివరాలన్నీ పోర్టబుల్ అవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
- ఇలాంటి వ్యవస్థ ఉండటం వల్ల ప్రభుత్వానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఆరోగ్య డేటాను విశ్లేషించేందుకు సులభమవుతుంది. తద్వారా ఆరోగ్యపరంగా మెరుగైన ప్రణాళికలు రచించేందుకు, నిధులు కేటాయించేందుకు, రాష్ట్రాల వ్యాప్తంగా ఆరోగ్య పథకాలను అమలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.