Ravindra Jadeja Press Conference: జడేజా ప్రెస్ కాన్ఫరెన్స్ వివాదం - మెల్‌బోర్న్‌లో మ్యాచ్ రద్దు, షాక్‌లో క్రికెట్ ఆస్ట్రేలియా
Ind Vs Aus Test Series: భారత క్రికెటర్ జడేజా అనుకోకుండా ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. ఆసీస్ మీడియా అత్యుత్సాహంతో వ్యవహరించడంతో దానికి భారత టీమ్ మేనేజ్మెంట్ దీటుగా బదులిచ్చింది.
Cricket News: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా కారణంగా ఒక మ్యాచ్ రద్దైనట్లు తెలుస్తోంది. నిజానికి ఈ వివాదంతో అతనికి ఏమాత్రం సంబంధం లేకపోయినా, అతని పేరు తీస్తున్నట్లుగా టీమ్ మేనేజ్మెంట్ పేర్కొంటున్నారు. మెల్ బోర్న్‌లో ఇటీవల మీడియాతో జడేజా సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానమిచ్చాడు. అయితే ఆ తర్వాత అతను సడెన్ గా సమావేశం నుంచి వెళ్లి పోవడంతోనే గొడవ ప్రారంభమైందని పలు కథనాలు వెలువడ్డాయి. ముఖ్యంగా హిందీలో అతను సమాధానం ఇవ్వడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారినట్లు తెలుస్తోంది. అయితే మీడియా సమావేశంలో ఇంగ్లీషులో మాట్లాడాలని ఆసీస్ మీడియా కోరగా, జడేజా తిరస్కరించిటనట్లుగా కంగారూ మీడియా ప్రచారం చేస్తోంది. అయితే దీన్ని టీమిండియా మేనేజ్మెంట్ ఖండిస్తోంది.
అసలేమైందంటే..?
మీడియా సమావేశంలో కొంతమంది భారత జర్నలిస్టులు కొన్ని ప్రశ్నలను హిందీలో అడిగారు. దానికి సమాధానంగా జడేజా కూడా హిందీలోనే సమాధానం చెప్పాడు. ఆ తర్వాత తనకు పని ఉండటంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడని టీమ్ మేనేజ్మెంట్ చెబుతోంది. అయితే తమకు తగినంత సమయం కేటాయించలేదని ఆసీస్ మీడియా ఆరోపించింది. దీనిపై కాస్త వివాదం చేసేందుకు ప్రయత్నించిందని సమాచారం. అయితే జడేజాకు మద్దతుగా టీమ్ మేనేజ్మెంట్ నిలిచింది. ఈ క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఏర్పాటు చేసిన మీడియా మ్యాచ్ కూడా రద్దయినట్లు తెలుస్తోంది.
ఆదివారం మ్యాచ్ రద్దు..
మెల్‌బోర్న్‌లోని మైదానంలో ఇరు జట్ల జర్నలిస్టులకు మధ్య క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ఫ్రెండ్లీ టీ20 మ్యాచ్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన భాతర ట్రావెలింగ్ జర్నలిస్టులు వైదొలగడంతో మ్యాచ్ రద్దయింది. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా షాకయ్యింది. ఇక జడేజాపై ఆరోపణలు చేసిన క్రమంలోనే ఈ మ్యాచ్ నుంచి భారత జర్నలిస్టులు వైదొలిగారని, దీని వెనకాల టీమిండియా మీడియా మేనేజర్ ఉన్నట్లు ఆసీస్ మీడియా ఆరోపిస్తోంది. ఇక భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు జరగ్గా, తొలి టెస్టును భారత్ 295 పరుగులతో, రెండో టెస్టును ఆసీస్ 10 వికెట్లతో గెలుపొందాయి. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఇక సిరీస్‌లో రెండు టెస్టులు మిగిలి ఉన్నాయి. నాలుగో టెస్టు ఈ నెల 26న బాక్సింగ్ డే నాడు మెల్‌బోర్న్‌లో జరుగుతుంది. చివరిదైన ఐదో టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీలో ప్రారంభమవుతుంది. మూడో టెస్టులో జట్టులో చోటు దక్కించుకున్న జడేజా సత్తా చాటాడు. 77 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు ఫాలో ఆన్ తప్పించుకోవడంతో కీలక భూమిక పోషించాడు.